Skip to main content

Colleges Reopening: కాలేజీల పునఃప్రారంభం సరే.. గెస్ట్‌ లెక్చరర్ల మాటేంటి?

సాక్షి, హైదరాబాద్‌: కళాశాలల పునఃప్రారంభానికి ప్రయత్నిస్తున్న విద్యాశాఖ తమ గోడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గెస్ట్‌ లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా తమను కొనసాగిస్తూ ఇంతవరకూ ఆదేశాలివ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో 405 ప్రభుత్వ కాలేజీల్లో 18 వేల మంది గెస్ట్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరి సేవలను ప్రతీ ఏటా పొడిగిస్తారు. కరోనా నేపథ్యంలో ఏడాదిగా ఈ ప్రక్రియ సాగడం లేదు. ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం ఉపక్రమించినా వారి గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న తాము ఏడాదిగా కరోనా వల్ల వీధిపాలయ్యామని వాపోతున్నారు. చాలామంది కూలి పనికి వెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ 16 నెలల వేతనం పెండింగ్‌లో ఉందని గెస్ట్‌ లెక్చరర్స్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంట దేవేందర్‌ తెలిపారు. అనేకసార్లు ప్రజాప్రతినిధులను కలిసినా ప్రయోజనం లేదన్నారు.

వేతనంలోనూ వ్యత్యాసమే
ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, మోడల్‌ స్కూల్స్, సంక్షేమ, మైనార్టీ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్లు పని చేస్తున్నారు. రెగ్యులర్‌ వారితో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా, వేతనంలో వ్యత్యాసం ఉందని వారు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్స్‌కు నెలకు రూ.58 వేల వరకు ఇస్తుంటే, తమకు రూ.21,600 మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని గెస్ట్‌ లెక్చరర్స్‌ జేఏసీ నేతలు కోరారు.
Published date : 28 Aug 2021 03:47PM

Photo Stories