Skip to main content

బెస్ట్ ర్యాంకుకే ఫుల్ ఫీజు... మిగతావారు ర్యాంకు ఆధారంగా ఫీజులు చెల్లించాల్సిందే!

శంషాబాద్‌కు చెందిన గోలి అవినాశ్ ఎంసెట్‌లో 10,051 ర్యాంకు సాధించాడు. కౌన్సెలింగ్‌లో అతనికి గండిపేట్‌లోని ప్రఖ్యాత కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులో సీటొచ్చింది.
ఆ కాలేజీలో సీఎస్‌ఈ కోర్సుకు ఏటా చెల్లించాల్సిన ఫీజు రూ1.34 లక్షలు.. కానీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఫీజు కేవలం రూ.35 వేలు మాత్రమే. ఎందుకంటే పదివేలలోపు ర్యాంకు సాధించిన బీసీ విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు మంజూరు చేస్తోంది. అవినాశ్ ర్యాంకు ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్ కంటే ఎక్కువుండటంతో అతనికి రూ.35 వేలు ఫీజు రీయింబర్స్ మెంట్ రూపంలో వస్తుండగా... మిగతా రూ.99 వేలు వ్యక్తిగతంగా చెల్లించాల్సి వచ్చింది. అలా పూర్తి ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్‌కు అర్హత వస్తుంది. ఈ క్రమంలో అవినాశ్ తండ్రి వెంకటేశ్ అప్పు తెచ్చి పూర్తి ఫీజు చెల్లించడంతో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తయి కాలేజీలో సీటు కన్ఫర్మ్ అయ్యింది..

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో అమలు చేస్తున్న నిబంధనలు బీసీ విద్యార్థులకు సంకటంగా మారాయి. ఎంసెట్‌లో పదివేల లోపు ర్యాంకు, ఈసెట్‌లో వెయ్యి లోపు ర్యాంకు సాధించిన బీసీ విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు చెల్లిస్తోంది. అంతకుమించి ర్యాంకు వస్తే కేవలం రూ.35 వేలు మాత్రమే మంజూరు చేస్తుంది. ఇంజనీరింగ్ కోర్సులే కాకుండా డిగ్రీ, పీజీ వృత్తి విద్యా కేటగిరీల్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, ఇతర జనరల్ కోర్సుల్లో కూడా ఇదే నిబంధనను అమలు చేస్తోంది. విద్యార్థుల్లో సంఖ్యా పరంగా అత్యధికులు బీసీలే ఉండటంతో సీలింగ్ దాటి ర్యాంకులు సాధిస్తున్న వారిలోనూ వీరే ఎక్కువుంటున్నారు. దీంతో బీసీలకు ప్రభుత్వం విధించిన నిబంధన ఇబ్బందికరంగా మారింది.

ఎందుకీ నిబంధన..
పోస్టుమెట్రిక్ కోర్సు చదివే విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజును ప్రభుత్వమే భరించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ.. పోటీతత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో పదివేల లోపు ర్యాంకు సాధించిన వారికే పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన నుంచి ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపునివ్వగా.. రానురాను మైనార్టీలకు సైతం మినహాయింపు లభించింది. చివరకు అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు మాత్రం ప్రభుత్వం నిబంధనను వర్తింపజేస్తోంది. వాస్తవానికి పదివేల లోపు ర్యాంకు సాధించిన వారిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, జనరల్ విద్యార్థులందరూ ఉంటారు. మెరిట్ పరంగా చూస్తే జనరల్ విద్యార్థులే ఎక్కువ.. ఈ క్రమంలో పదివేల లోపు ర్యాంకు సాధించిన వారిలో బీసీల సంఖ్య 4 వేలకు మించదని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న వారిలో సగభాగం ఉన్న బీసీ విద్యార్థుల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయి ఫీజు అందుతున్నట్లు తెలుస్తోంది. మిగతా విద్యార్థులంతా సీలింగ్‌కు అవతల ఉండటంతో ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజే అందుతోంది.

వినతులు, హామీలతో సరి..
ప్రతి బీసీ విద్యార్థికి పూర్తిస్థాయి ఫీజు చెల్లించాలనే డిమాండ్ దాదాపు ఆరేళ్లుగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ నిబంధన తొలగిస్తారని భావించినప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఈ అంశంపై విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.. మూడేళ్ల క్రితం బీసీ మంత్రులతో ఏర్పాటు చేసిన సబ్‌కమిటీలో బీసీ సబ్‌ప్లాన్ అంశంపై దాదాపు వారం రోజుల పాటు జరిగిన తర్జనభర్జనల తర్వాత బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మేరకు అప్పట్లో హామీ దక్కినప్పటికీ అమలు మాత్రం ఇప్పటికీ జరగలేదు.

బీసీల్లో కొన్ని వర్గాలకు ఇలా..
పదివేల లోపు ర్యాంకు నిబంధన బీసీ ఉపకులాలకు వర్తిస్తున్నప్పటికీ.. బీసీ-సీ, బీసీ-ఈ కేటగిరీల్లో ఉన్న మైనార్టీ విద్యార్థులకు మాత్రం వర్తించడం లేదు. బీసీ కోటాలో సీటు వచ్చినప్పటికీ.. ఫీజు రీయింబర్స్‌మెం ట్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి నిధులు విడుదలవుతున్నాయి. ఈక్రమంలో వారికి పూర్తిస్థాయిలో ఫీజు విడుదలవుతోంది. ఈ రకంగా బీసీ కేటగిరీల్లో కొందరికి పూర్తిస్థాయి ఫీజు అందుతుండటం గమనార్హం. ప్రభుత్వం విధించిన సీలింగ్ నిబంధన ప్రకారమే ఫీజులు విడుదల చేస్తున్నట్లు, ఇందులో శాఖా పరంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
Published date : 20 Nov 2020 04:15PM

Photo Stories