Skip to main content

బెంచీకి ఒక్కరే...! లేదంటే స్కూళ్లపై కఠిన చర్యలు..!

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో బెంచీకి ఒక్కరిని, మొత్తంగా తరగతి గదిలో 20 మందిని మాత్రమే కూర్చోబెట్టాలని, ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాల్సిందేనని పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన స్పష్టం చేశారు.
ఈ నిబంధనలను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. వాటిని అమలు చేయని పాఠశాలలపై అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించని పాఠశాలల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించిన నేపథ్యంలో నిబంధనల అమలు విషయంలో పక్కాగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. గురువారం ఆమెను కలిసిన మీడియా అడిగిన పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన ప్రారంభించామని, 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన బుధవారం నుంచి ప్రారంభించిన నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సీనియర్‌ అధికారుల నేతృత్వంలోని బృందాలు పాఠశాలల్లో తనిఖీలు చేస్తాయని వెల్లడించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు కూడా పాఠశాలల నిర్వహణను పర్యవేక్షిస్తాయని తెలిపారు. ప్రతి పాఠశాల నిబంధనలను పాటించాల్సిందేనని, తరగతి గదులు సరిపోకపోతే, విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్‌ విధానంలో నిర్వహించుకోవచ్చని, జిల్లా కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బెంచీకి ముగ్గురు, నలుగురు విద్యార్థులను కూర్చోబెడితే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో పాటు, అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం పాఠశాలలపై చర్యలు తప్పవన్నారు. మరోవైపు 9, 10 తరగతులకు బోధించేందుకు టీచర్లను సర్దుబాటు చేశామని, 6, 7, 8 తరగతులకు విద్యార్థుల హాజరును బట్టి విద్యా వలంటీర్లను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బుధవారం 9 శాతమే విద్యార్థుల హాజరు ఉందని, గురువారం 14 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని, ఇంకా పెరిగితే ఆలోచన చేస్తామన్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో 17 శాతం..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం 6, 7, 8 తరగతులు విద్యార్థుల హాజరు 17 శాతం ఉందని తెలిపారు. 8,056 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అన్నింటిలో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం అయిందన్నారు. మొత్తంగా 5,47,479 మంది విద్యార్థులకు గాను 94,244 మంది విద్యార్థులు హాజరయ్యారని వెల్లడించారు. 9,612 ప్రైవేటు పాఠశాలలకు గాను, 8,404 ప్రైవేటు స్కూళ్లు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. వాటిల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులు 7,57,319 మంది విద్యార్థులు ఉండగా, 1,02,831 మంది విద్యార్థులు (14 శాతం మంది) గురువారం ప్రత్యక్ష బోధనకు హాజరైనట్లు వివరించారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, గురుకులాలు కలుపుకొని 18,374 స్కూళ్లలోని 14,14,297 మంది విద్యార్థులకు గాను 2,01,020 మంది (14 శాతం) విద్యార్థులు గురువారం ప్రత్యక్ష బోధనకు హాజరైనట్లు వెల్లడించారు.
Published date : 26 Feb 2021 04:23PM

Photo Stories