Skip to main content

అన్ని జాగ్రత్తలతో స్కూళ్లలో తరగతులు నిర్వహించాలి: ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: కరోనా మరలా వ్యాపిస్తున్న దృష్ట్యా ఉపాధ్యాయులు, విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్త వహించేలా చూడాలని అధికారులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు.
శనివారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ‘కోవిడ్‌ నుంచి రక్షణకు అనుసరించాల్సిన ప్రణాళికపై జిల్లా జాయింట్‌ కలెక్టర్లు, వర్సిటీ వీసీలు, విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీ‹Ùచంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకుడు కె.వెట్రిసెల్వి, ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్‌ వల్ల గత విద్యాసంవత్సరం ఛిన్నాభిన్నమైనా విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండటానికి పాఠాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా అందించామని చెప్పారు. కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహించడం అరుదైన విషయమన్నారు. సీఎం జగన్ దిశానిర్దేశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను గాడిలో పెట్టగలిగామని చెప్పారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాపిస్తున్నందున మాసు్కలు, శానిటైజర్, భౌతికదూరం వంటి జాగ్రత్తలను విద్యార్థులు పాటించేలా టీచర్లు చూడాలని సూచించామన్నారు. ఈ విద్యాసంవత్సరం సాఫీగా సాగేందుకు ప్రత్యేక ఎస్‌ఓపీ మార్గదర్శకాలు రూపొందించామని చెప్పారు. జగనన్న గోరుముద్దను పిల్లలందరికీ ఒకేసారి కాకుండా బ్యాచుల వారీగా వడ్డించాలన్నారు. ఆయాలు చేతికి ధరించేందుకోసం గ్లౌజులను అందజేయాలని జేసీలకు సూచించామని తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో స్పెషల్‌ మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం థర్మల్‌ స్క్రీన్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశామన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభిస్తున్నాం కాబట్టి పిల్లలు, ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వచ్చేలా చూడాలని సూచించామని తెలిపారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ను వేయాలని, జిల్లా అధికారులు బయోమెట్రిక్‌ హాజరును తనిఖీ చేయాలన్నారు.
Published date : 29 Mar 2021 03:57PM

Photo Stories