Skip to main content

ఆన్‌లైన్‌లోఉచితంగా 100కు పైగా యూజీ,పీజీ కోర్సులు.. వివరాలివిగో..

సాక్షి, అమరావతి: కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆన్‌లైన్ కోర్సులపై దృష్టి పెట్టింది.
ఇప్పటికే అమల్లో ఉన్న మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు (మూక్స్)లో కొత్తగా 46 పోస్టు గ్రాడ్యుయేట్, 78 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులు వర్తించేలా.. జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. యూజీసీలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఆధ్వర్యంలో ఉన్న కన్సార్టియమ్ ఫర్ కమ్యూనికేషన్ (సీఈసీ) ద్వారా ‘స్వయం’ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం వేదికగా ఈ కోర్సులను అమలు చేయనుంది.

నాన్ ఇంజనీరింగ్ కోర్సుల బోధన..
ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చిన ఈ కోర్సులు నాన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినవి. అన్ని యూనివర్సిటీల అనుబంధ కాలేజీలు, గుర్తింపు విద్యాసంస్థలు, అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతి ఉన్న కాలేజీల్లో ప్రస్తుతం వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులులతో పాటు పార్ట్‌టైం కోర్సులు చేస్తున్న వారు కూడా వీటిని అభ్యసించేందుకు అవకాశం కల్పించారు. ఈ కోర్సుల్లో సాధించే క్రెడిట్లను ఆయా విద్యార్థులు చదివే రెగ్యులర్ కోర్సుల క్రెడిట్లకు జత చేసేలా యూజీసీ అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల విద్యార్థుల క్రెడిట్లు పెరిగి వారికి భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు మెరుగుపడనున్నాయి. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు యూజీసీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విద్యా రంగ నిపుణులను మెంటార్లుగా నియమించింది. ఆసక్తిగల అభ్యర్థులు యూజీసీ వెబ్‌సైట్ ‘యూజీసీ.ఏసీ.ఐఎన్’ లేదా ‘ఎస్‌డబ్ల్యూఏవైఏఎం.జీఓవీ.ఐఎన్/సీఈసీ’ ద్వారా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
Published date : 29 Dec 2020 01:13PM

Photo Stories