Skip to main content

ఆన్‌లైన్, ఓడీఎల్‌ విధానంలో అందుబాటులోకి ప్రొఫెషనల్‌ కోర్సులు..: ఏఐసీటీఈ

సాక్షి, అమరావతి: ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలోనూ వినూత్న విధానాలకు కేంద్రం శ్రీకారం చుడుతోంది.
దేశంలో ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్ రోల్‌మెంటు రేషియో (జీఈఆర్‌)ను పెంచేందుకు వీలుగా జాతీయ నూతన విద్యావిధానం–2020లో అనేక అంశాలను చేర్చింది. ఈ లక్ష్యాలు నెరవేరేందుకు వీలుగా ఆయా విద్యా విభాగాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రొఫెషనల్, టెక్నికల్‌ కోర్సులలో చేరికలు పెరిగేందుకు ఆన్‌లైన్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్‌ (ఓడీఎల్‌) విధానాలను మరింత విస్తృతం చేస్తోంది. ఆన్‌లైన్, ఓడీఎల్‌ విధానంలో నాన్ ప్రొఫెషనల్‌ కోర్సులే ఎక్కువగా అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రొఫెషనల్‌ కోర్సులనూ క్రమేణా విద్యార్థులకు చేరువ చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త విధివిధానాలతో గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 యూజీసీ రెగ్యులేషన్ల ప్రకారం ఆన్‌లైన్, ఓడీఎల్‌ నాన్ ప్రొఫెషనల్‌ కోర్సులను పలు విద్యాసంస్థలు అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు ఏఐసీటీఈ నిర్ణయంతో ప్రొఫెషనల్‌ కోర్సులనూ ఆయా విద్యాసంస్థలు విద్యార్థులకు అందించనున్నాయి.

రెగ్యులర్‌ కోర్సులతో సమానంగా..
ఈ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులతో సమానమైన ప్రాధాన్యతతో విద్యార్థులకు అందనున్నాయి. ఏఐసీటీఈ చట్టం–1987 ప్రకారం డిప్లొమో, పీజీ డిప్లొమో సర్టిఫికెట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమో, పోస్టు గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీలను ఆన్‌లైన్, ఓడీఎల్‌ ద్వారా అమలుచేస్తారు. విద్యా సంవత్సరంగా జనవరి/ఫిబ్రవరి లేదా జులై/ఆగస్టుల మధ్య 12 నెలల కాలవ్యవధిలో ఇవి అమలవుతాయి. ఈ కోర్సులను నాణ్యతా ప్రమాణాలతో విద్యార్థులకు అందించేలా ప్రతి సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ క్వాలిటీ అస్యూరెన్సు (సీఐక్యుఏ) ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి. ఆన్‌లైన్, డిస్టెడిస్టెన్స్ విధానంలో ఈ కోర్సులు అమలుచేస్తున్నా విద్యార్థులు టీచర్ల మధ్య ముఖాముఖి అభ్యసనం ఉండేలా కొంతకాలం సంప్రదాయ అభ్యసన విధానాన్నీ అమలుచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్‌ విధానంలోని కోర్సులకు కూడా రెగ్యులర్‌ కోర్సులతో సమానంగా క్రెడిట్‌ సిస్టమ్‌ అమలవుతుంది. విద్యార్థి ఆయా కోర్సులను యూనిట్ల వారీగా విద్యార్థి అభ్యసించిన గంటలు, అసెస్‌మెంటులో తేలిన ప్రమాణాలను అనుసరించి ఈ క్రెడిట్లు ఇస్తారు.

డ్యూయెల్‌ విధానంలో అమలుకు అవకాశం
  • విద్యాసంస్థలు డ్యూయెల్‌ (ద్వంద్వ) విధానంలో అంటే సంప్రదాయ కోర్సులను అమలుచేస్తూనే ఆన్‌లైన్, ఆన్‌లైన్ డిస్టెన్స్ కోర్సులను అమలుచేయడానికి అవకాశం కల్పించనున్నారు.
  • రెగ్యులర్‌ కోర్సులతో సమానంగా వీటిని గుర్తిస్తున్నందున ఆ కోర్సుల్లోని లెర్నింగ్‌ మెటీరియల్‌ మాదిరిగానే ‘ఈ లెర్నింగ్‌ మెటీరియల్‌’ను డిజిటల్‌ ఫార్మాట్‌లో విద్యార్థులకు అందిస్తారు.
  • విద్యార్థులు తమంతట తాము అభ్యసించడం, పరిజ్ఞానాన్ని స్వయంగా పెంచుకోవడం, ఎప్పటికప్పుడు స్వయం మూల్యాంకనం (సెల్ఫ్‌ ఎవాల్యుయేషన్) ద్వారా స్వయం మార్గదర్శకత్వం వంటివి పెంపొందించుకోగలుగుతారు.
  • రెగ్యులర్‌ కోర్సులకు మాదిరిగానే ఈ పరీక్షలను కూడా నిర్ణీత కేంద్రాల్లో ఆన్‌లైన్ లో నిర్వహించాల్సి ఉంటుంది.
  • పెన్, పేపర్‌ లేదా కంప్యూటరాధారిత, లేదా పూర్తిస్థాయి ఆన్‌లైన్ విధానంలో విద్యార్థులను నిపుణులైన వారితో పరీక్షింపజేయాలి.

కోర్సులు అందించే సంస్థల అర్హతలు..
  • యూజీసీ గుర్తింపు, స్వయంప్రతిపత్తి ఉన్న ఉన్నత విద్యాసంస్థలు, డీమ్డ్‌ వర్సిటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులు అందించేందుకు అర్హమైనవి.
  • ఈ ఆన్‌లైన్ కోర్సులు అమలుచేసే సంస్థలకు నాక్‌ 4 పాయింట్ల స్కేలులో 3.26 పాయింట్లు, లేదా ఎన్బీఏ స్కోరు 1000 స్కేల్‌లో 700 వచ్చి ఉండడం తదితర నిబంధనలను ఏఐసీటీఈ అమలుచేస్తుంది.
  • నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్కులో ఆ సంస్థలు టాప్‌ 100లో ఉండాలి.
  • ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలను కలిగి ఉండాలి.
  • ఆయా సంస్థల్లోని ఇంటిగ్రేటెడ్‌ ప్రొఫెషనల్‌ కోర్సులను కూడా ఆన్‌లైన్, ఓడీఎల్‌ విధానంలో అందించవచ్చు.
  • ఈ కోర్సులను అమలుచేసేటప్పుడు విద్యార్థులకు సహకారం కోసం నిపుణులైన బోధకులతో ‘లెరి్నంగ్‌ సపోర్టు సెంటర్ల’ను ఏర్పాటుచేయాలి.
  • ఆన్‌లైన్ విధానంలో ఏఐసీటీఈ నిషేధించిన ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను ఆన్‌లైన్, ఓడీఎల్‌ విధానంలో అమలుకు వీల్లేదు. వీటితో పాటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హోటల్‌ మేనేజ్‌మెంట్, అప్లయిడ్‌ ఆర్ట్స్, క్రాఫ్టస్, డిజైన్ వంటి కోర్సులను ఆన్‌లైన్, ఓడీఎల్‌ విధానంలో అమలుచేయరాదు.
  • విద్యార్థులను రెగ్యులర్‌ కోర్సులకు నిర్దేశించిన పరిమితికి మూడు రెట్లు అదనంగా చేర్చుకోవడానికి అవకాశమిస్తారు.
  • నిబంధనలు ఉల్లంఘించే సంస్థల అనుమతుల రద్దుకు ఏఐసీటీఈ యూజీసీకి సిఫార్సు చేస్తుంది. అవసరమైన చట్టపరమైన చర్యలనూ చేపడుతుంది.

ఆయా కోర్సుల క్రెడిట్లు, కాలపరిమితి ఇలా..

కోర్సు

క్రెడిట్లు

కాలపరిమితి

టెన్త్‌ తరువాత డిప్లొమో కోర్సులు

120

మూడేళ్లు

మాస్టర్‌ డిగ్రీ (కంప్యూటర్‌ అప్లికేషన్స్)

80

రెండేళ్లు

పీజీ డిగ్రీ (మేనేజ్‌మెంటు) కోర్సు

80

రెండేళ్లు

పీజీ డిప్లొమో కోర్సులు

80

రెండేళ్లు

పీజీ సర్టిఫికేట్‌ కోర్సులు

40

1–2 ఏళ్లు

పోస్టు డిప్లొమో సర్టిఫికేట్‌ కోర్సులు

40

1–2 ఏళ్లు

Published date : 06 Mar 2021 04:11PM

Photo Stories