Skip to main content

అమ్మఒడికి ఇంకా అర్హులుంటే జనవరి 5 లోగా పేర్లు పంపాలి: విద్యా శాఖ

సాక్షి, అమరావతి: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ కార్యక్రమాన్ని ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా ఈ నెల 4 నుంచి 9 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో జగనన్న అమ్మఒడి వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

అమ్మఒడి వారోత్సవాల వివరాలు
  • జనవరి 4: జగనన్న అమ్మఒడి కార్యక్రమంపై తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం. అమ్మఒడి పథకంలో గుర్తించిన అర్హులైన తల్లులు/సంరక్షకుల జాబితా ప్రదర్శించాలి. అమ్మఒడి పథకం కింద ఇంకా గుర్తింపు పొందాల్సిన అర్హులైన తల్లులు/సంరక్షకులు ఉంటే వారి వివరాలు తగిన ధ్రువపత్రాలతో సేకరించి సంబంధిత మండల విద్యాశాఖాధికారికి అందచేయాలి.
  • జనవరి 6: మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పెంపు.. ఆహార పట్టికలో సంక్రాంతి తర్వాత మార్పులు గురించి తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకు అవగాహనా కార్యక్రమం.
  • జనవరి 7: పాఠశాలల్లో 2020- 21 విద్యా సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ప్రవేశానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించడం. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టటంపై తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో చర్చించాలి.
  • జనవరి 8: ప్రభుత్వ పాఠశాలల్లో ’మనబడి నాడు-నేడు’ కార్యక్రమం అమలు గురించి తల్లిదండ్రుల కమిటీలు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం. పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, అవి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా తీసుకుంటున్న చర్యల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
  • జనవరి 9: ’జగనన్న అమ్మఒడి’ పథకం ప్రారంభోత్సవం. అర్హులైన తల్లులు/సంరక్షకుల్ని పాఠశాలలకు ఆహ్వానించాలి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులను కూడా ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నందున ఆ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో పిల్లలు, తల్లిదండ్రులు చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలి. ప్రారంభోత్సవాన్ని పండుగను తలపించేలా వేడుకలాగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు.

అర్హులుంటే జనవరి5వ తేదీకల్లా వివరాలు పంపాలి
అమ్మఒడి పథకంలో కొందరు తల్లుల/సంరక్షకుల వివరాల జాబితాపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తున్నాం. వాటిని జిల్లా విద్యాశాఖాధికారులు ఈనెల 5 నాటికి పరిశీలన పూర్తి చేసి, అర్హుల వివరాలు అదే రోజు సాయంత్రం 5 గంటలకు మా కార్యాలయానికి పంపాలి. ఎవరైనా అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే.. మండల విద్యాశాఖాధికారి ద్వారా వారి వివరాలను తగిన ధ్రువపత్రాల నకళ్లతో సేకరించి 5వ తేదీ సాయంత్రానికల్లా మా కార్యాలయానికి పంపాలి.
-చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్
Published date : 03 Jan 2020 03:14PM

Photo Stories