ఐదో తరగతి, ఇంటర్, డిగ్రీ గురుకుల అడ్మిషన్లకు వారంలోగా నోటిఫికేఫన్!
కోవిడ్-19 నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం... ఫలితంగా పనిదినాలు సైతం మే నెలాఖరు వరకు ముందుకు జరగడంతో వచ్చే విద్యాసంవత్సరంపై ప్రభావం పడకుండా గురుకుల సొసైటీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. వేసవి సెలవుల్లో ప్రవేశపరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని సొసైటీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశపరీక్షలకు దరఖాస్తుల స్వీకరణను మొదలుపెట్టాయి.
ఐదో తరగతికి ఉమ్మడి పరీక్ష
రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలోని స్కూళ్లలో ఐదో తరగతిలో 70 వేల సీట్లున్నాయి. వీటిలో మైనార్టీ సంక్షేమ గురుకుల సొసైటీ మినహా మిగిలిన సొసైటీల అడ్మిషన్లకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న సొసైటీలవారీగా జాబితాను వడపోసి మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. దీనికి సంబంధించి వారంలోగా నోటిఫికేషన్ వెలువడనుంది. వీటితోపాటు ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతుల్లోని బ్యాక్‌లాగ్ ఖాళీలకు సొసైటీలవారీగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. మరోవైపు ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన అర్హత పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవన్నీ ఏప్రిల్‌లో అర్హత పరీక్షలు నిర్వహించనున్నాయి. వారంలోగా ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీలు సైతం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది.
మే నెలాఖరు కల్లా పూర్తి
గురుకుల అడ్మిషన్ల ప్రక్రియను మే నెలాఖరుకల్లా పూర్తి చేసేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లోనే అన్ని రకాల ప్రవేశ పరీక్షలు నిర్వహించి మే నెల రెండోవారంలో ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాల ప్రకటన పూర్తయిన వెంటనే అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెడితే వారం నుంచి పదిరోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఇంకా సీట్లు మిగిలితే మెరిట్ జాబితా ఆధారంగా తదుపరి వరుసలోని విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకు మరోవారం సమయం పడుతుంది. మొత్తంగా మే నెల చివరిరోజు వరకు అడ్మిషన్లు ప్రక్రియ పూర్తి చేస్తే విద్యాసంవత్సరం ప్రారంభంలో అధికారులకు సైతం హడావుడి ఉండదని చెబుతున్నారు. 2021-22 విద్యాసంవత్సరం జూన్ 14న ప్రారంభం కానుంది.