Skip to main content

ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్‌ కోర్సుల్లో ఏపీ రెసిడెన్షియల్‌ విద్యార్థుల సత్తా!

సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల్లోని ప్రతిభకు ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ (ఏపీఆర్‌ఈఐ) గొడుగు పడుతున్నాయి.
అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొంది సత్తా చాటుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులను ముందుకు తీసుకువెళ్లేలా ఏపీఆర్‌ఈఐ ప్రణాళికలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఏపీఆర్‌ఈఐ సొసైటీ పరిధిలో 61 విద్యా సంస్థలున్నాయి. వీటిలో 50 రెసిడెన్షియల్‌ స్కూళ్లు కాగా.. 10 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు, ఒక రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీ ఉన్నాయి. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఈ ఏడాది 19,263 మంది, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 2,641 మంది కలిపి మొత్తం 21,904 మంది విద్యను అభ్యసిస్తున్నారు.

కార్పొరేట్‌కు దీటుగా..
కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ఏపీఆర్‌ఈఐ విద్యార్థులు రాణిస్తున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలతో పాటు జేఈఈ, నీట్, సీఏ వంటి పరీక్షల్లో కార్పొరేట్‌ స్కూళ్లకు మించి ఫలితాలను ఈ విద్యార్థులు సాధిస్తుండటం విశేషం. ఈ కాలేజీల్లో చదివి బయటకు వచ్చిన విద్యార్థుల్లో 25 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. వివిధ పరిశోధనా సంస్థల్లో 15 మంది శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్‌ అకౌంటెంట్లుగా, బ్యాంకింగ్‌ సర్వీసుల్లో పలు హోదాల్లో అనేక మంది పనిచేస్తున్నారు. 2019–20 విద్యా సంవత్సరంలో జేఈఈ మెయిన్ రాసిన ఏపీఆర్‌ఈఐ విద్యార్థులు 91 మంది మంచి స్కోరు సాధించి అడ్వాన్స్ కు క్వాలిఫై అయ్యారు. అడ్వాన్స్ రాసిన వారిలో ఇద్దరు ఉత్తమ ర్యాంకులతో ఐఐటీల్లో చేరగా.. మిగిలిన వారు ఎన్ఐటీలలో సీట్లు పొందారు. ఇటీవల ఇద్దరు ఐఐటీ, ముగ్గురు ట్రిపుల్‌ ఐటీ, 36 మంది ఎన్ఐటీ, 106 మంది నీట్, 396 మంది ఎంసెట్, 131 మంది ఎంసెట్‌ (అగ్రి, మెడికల్‌), 164 మంది సీఏ కోర్సులను పూర్తి చేశారు.

అమ్మ ఒడి’ ఆదుకుంటోంది
బడుగు, బలహీన, పేద వర్గాల విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి తదితర పథకాల ప్రయోజనాలు ఈ విద్యార్థులకూ అందుతున్నాయి. అమ్మ ఒడి కింద ఈ విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున ఏటా అందిస్తోంది. 2019–20లో 20,935 మంది తల్లులకు రూ.31.40 కోట్లను, 2020–21లో రూ.28.76 కోట్లను అందించారు. జగనన్న విద్యాకానుక కింద 18,819 మందికి యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్, షూస్, సాక్సులు, బెల్టు తదితరాలను అందించారు.

పూర్వ విద్యార్థులతో ఐఐటీ, నీట్‌ కోచింగ్‌
ఐఐటీ, నీట్, ఎంసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించి ఏపీఆర్‌ఈఐ విద్యార్థులకు తర్ఫీదు ఇప్పిస్తోంది. ఇక్కడి సిబ్బంది పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారికి చదువుల్లో తోడ్పాటు అందిస్తున్నారు. నిర్ణీత సమయాల్లో విద్యార్థులకు బోధన, దగ్గరుండి చదివించడం, సందేహాలు నివృత్తి చేయడం వంటి కార్యక్రమాల కోసం ఏపీఆర్‌ఈఐ సమగ్ర ప్రణాళికను అమలు చేయిస్తుండటంతో మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఈ విద్యాసంస్థల్లో చదువుకుని వివిధ హోదాల్లో ఉన్న పూర్వవిద్యార్థులు ఇటీవల ‘విజనరీ గురుకుల్‌ అలుమినీ’గా ఏర్పడి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కరోనా సమయంలో ఈ విద్యార్థులకు ఆన్‌లైన్ లో జేఈఈ, నీట్, సీఏ కోచింగ్‌ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరంలోనూ సమగ్ర ప్రణాళికతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్‌
ఈ విద్యా సంవత్సరంలోనూ విజనరీ గురుకుల్‌ అలుమినీ (వీజీఏ) నుంచి 12 మంది ప్రొఫెసర్లు, ఇతర నిపుణులైన పూర్వ విద్యార్థులతో కోచింగ్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి ప్రముఖల ద్వారా బోధన చేయిస్తున్నాం. లైవ్‌ ఇంటరాక్షన్ తో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడంతో పాటు వారికి వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. అన్ని సబ్జెక్టులలో వరుసగా గ్రాండ్‌ టెస్టుల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశాం. విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాల్లో లోపాలు లేకుండా చూస్తూ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా చదువుకునేలా బోధనా సిబ్బంది వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు.
– ఎంఆర్‌ ప్రసన్నకుమార్, కార్యదర్శి, ఏపీఆర్‌ఈఐ
Published date : 29 Mar 2021 04:05PM

Photo Stories