అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ స్కూళ్లపై చర్యలకు జాప్యమెందుకు..?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలంటూ ప్రభుత్వం జారీచేసిన జీవో 46కు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పాఠశాలలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. ఆన్‌లైన్ తరగతులతో పిల్లలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని, ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించకుండా ఆదేశించాలంటూ హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని, గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన మరో వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ప్రైవేట్ స్కూళ్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి షోకాజ్ నోటీసులు జారీచేశామని, వారిచ్చిన వివరణను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్‌కుమార్ నివేదించారు. ప్రభుత్వం సమర్పించిన విచారణ నివేదికను పరిశీలించామని స్పష్టం చేసిన ధర్మాసనం.. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని ప్రతివాదులను ఆదేశిస్తూ ఈ వ్యాజ్యాలపై విచారణను ముగించింది.
ఆన్‌లైన్ క్లాసులు ఆపలేం..
‘ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరూ ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లాక్‌డౌన్‌ను పూర్తిగా తొలగించింది. అన్ని కార్యాలయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూలై 1 నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించకుండా ఆపాలని ఆదేశించలేం. ప్రభుత్వ జీవోను ఉల్లంఘించి అధికంగా ఫీజులు వసూలు చేసిన నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Published date : 23 Jun 2021 02:24PM