6, 7, 8 తరగతులకు బోధనపై ప్రభుత్వం తర్జనభర్జన.. పత్యక్ష బోధన లేనట్టేనా..!
ఈ నెల 1 నుంచి 9, 10వ తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలా..వద్దా? అనే దానిపై ప్రభుత్వం గందరగోళంలో పడింది. ఇప్పటికిప్పుడు వారికి ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే తరగతి గదులు సరిపోకపోవచ్చని, కొద్ది రోజులు వేచిచూడాలన్న ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు ఈ నెల 15 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశాలు కన్పించట్లేదు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదని తెలిసింది. కరోనా కేసులు ఈ నెలాఖరుకు మరింతగా తగ్గితే మార్చి మొదటి లేదా రెండో వారంలో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభంపై ఆలోచించొచ్చనే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోతే ఆయా తరగతులకు కూడా ఆన్‌లైన్/ డిజిటల్ (టీవీ) పాఠాలనే కొనసాగించి పైతరగతులకు ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నట్లు విద్యా శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకున్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన చేపట్టకుండా, ఆన్‌లైన్/డిజిటల్ (టీవీ) విద్యా బోధనే కొనసాగించి పైతరగతులకు ప్రమోట్ చేసేందుకు చర్యలు చేపడున్నట్లు వెల్లడించారు.
తరగతి గదుల కొరతతోనే..
ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల కొరత లేకున్నా, కోవిడ్ నిబంధనల ప్రకారం.. తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా 9, 10 తరగతుల విద్యార్థులను పలు సెక్షన్లుగా విభజించి పాఠాలు బోధిస్తున్నారు. బెంచీకి ఒక్కరు చొప్పున ఒక తరగతి గదిలో 20 మందినే కూర్చోబెడుతున్నారు. దీంతో ఆయా సెక్షన్లకు బోధించాలి. దీంతో ఆయా సెక్షన్లకు బోధించాల్సిన టీచర్ల అవసరం ఎక్కువ కావడంతో ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి కూడా టీచర్లను డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం అమలవుతోంది.
ప్రైవేటు స్కూళ్లలో పరిస్థితి ఇంకోలా..
ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అలా చేయట్లేదు. కరోనా తీవ్రత ఎక్కువగా గతేడాది జూన్, జూలైలోనే ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు టీచర్లను తొలగించాయి. ఆ తర్వాత గత సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కావడంతో స్కూళ్లలో గతంలో పనిచేసిన టీచర్లలో 30 శాతం మందినే విధుల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష బోధనను కూడా వారితోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులను సెక్షన్లుగా విభజించకుండానే అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి బోధన నిర్వహిస్తున్నాయి. భౌతిక దూరం పాటించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న తరగతి గదికి 20 మందినే కూర్చోబెట్టాలన్న నిబంధన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల కొరత సమస్యగా మారుతుంది. ప్రత్యక్ష బోధన కోసం ప్రస్తుతం 9, 10 తరగతులకు పంపిన ప్రాథమికోన్నత టీచర్లను కూడా వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు విద్యా వలంటీర్ల అవసరం ఏర్పడుతుంది. కోవిడ్ నిబంధనలను అమలు చేయడం కష్ట సాధ్యం కానుంది. ప్రైవేటు స్కూళ్లలోనైతే ఇప్పటికే ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు సరిగ్గా అమలే కావట్లేదు. ఇక 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రవేశపెడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఓ అధికారి పేర్కొన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకున్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన చేపట్టకుండా, ఆన్‌లైన్/డిజిటల్ (టీవీ) విద్యా బోధనే కొనసాగించి పైతరగతులకు ప్రమోట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది మీరు పదో తరగతి చదువుతున్నారా.. అయితే ఇది మీకోసమే!