Skip to main content

3.28 లక్షల మందికి చదవడం, రాయడం నేర్పుతాం: ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం (మైలవరం) : పడ్‌నా లిఖ్‌నా అభియాన్‌ (అక్షరాస్యత కార్యక్రమం)లో భాగంగా చదువు వయసు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో చదవడం, రాయడం నేర్పుతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.
ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ భవనంలో పడ్‌నా లిఖ్‌నా అభియాన్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘చదువుకుందాం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదువు లేని 15 ఏళ్ల వయసు దాటిన వారిని బడికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచనతో రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధన దిశగా అడుగులేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే అన్ని రాష్ట్రాల్లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, అందుకు భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టామని, రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులను విద్యాభివృద్ధికి కేటాయించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికి 26 శాతంగా ఉన్న నిరక్షరాస్యతను సగానికి తగ్గించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరించారు.
Published date : 08 Apr 2021 03:29PM

Photo Stories