Skip to main content

15 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం: ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యువత విద్యా వ్యవస్థకి దూరంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
మరో 25 కోట్ల మందికి అక్షరజ్ఞానం కూడా లేదని వెల్లడించారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) గురువారం ‘‘ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు’’ అనే అంశంపై నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, చారిటబుల్‌ సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 3–22 ఏళ్ల మధ్య వయసున్న వారి గణాంకాలను పరిశీలిస్తే దాదాపుగా 35 కోట్ల మంది చదువుకుంటున్నారని తెలిపారు.

చ‌ద‌వండి: యూకేలో 19% పెరిగిన భారత విద్యార్థులు

చ‌ద‌వండి: ఆగస్టు 23, 24 తేదీల్లో లాసెట్, పీజీఎల్సెట్– 2021 పరీక్షలు

చ‌ద‌వండి: తెలంగాణ పాలిసెట్– 2021 ఆప్షన్ల ఎంపికకు నేడే ఆఖరు తేదీ

ఆ వయసు కలిగిన వారు దేశ జనాభాలో 50 కోట్లు మంది ఉన్నారని, దీనిని బట్టి చూస్తే 15 కోట్ల మంది విద్యకు దూరంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. వారందరినీ బడిబాట పట్టించడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుందని, మన దేశ ఆర్థిక వ్యవస్థలో పని చేసే వారి సంఖ్య పెంచాలంటే అందరికీ విద్య అందుబాటులోకి రావాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో అక్షరాస్యత 80 శాతానికి చేరుకుందని ప్రధాన్‌ చెప్పారు. దాదాపుగా 25 కోట్ల మంది ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉన్నా రని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) మరో 25 సంవత్సరాలకి సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ అన్నారు. దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల సమయానికి ఏం సాధించాలో మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. కరోనా సంక్షోభం సమయంలో డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం పెరిగిందని, తద్వారా విద్యారంగంలో సృజనాత్మకత, పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందని అన్నారు. భవిష్యత్‌లో పల్లె పల్లెకి హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లు వస్తాయని, దీనివల్ల విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్‌ పెరిగి వినూత్న మార్పులు వస్తాయని చెప్పారు.
Published date : 13 Aug 2021 03:21PM

Photo Stories