Skip to main content

త్వరలో బోధనాస్పత్రుల్లో 355 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 900 వైద్యేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీఎత్తున పోస్టులను భర్తీచేయనుంది.
ఇప్పటికే 695 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీచేసిన సర్కారు త్వరలో మరో 355 మందిని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లుగా తీసుకోనుంది. ఇవన్నీ కొత్తగా మంజూరు చేసిన పోస్టులు కావడం గమనార్హం. వీటితో పాటు సుమారు 900 మంది వైద్యేతర అంటే పారా మెడికల్‌ పోస్టులను కూడా భర్తీ చేయనుంది. దీంతో డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బందితో బోధనాసుపత్రులు మరింత పటిష్టం కానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు అస్సలు చేపట్టకపోవడం.. సేవలన్నీ పీపీపీ (ప్రైవేటు, ప్రభుత్వ, భాగస్వామ్యం) పద్ధతిలో ఉండటంతో బోధనాస్పత్రులను పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లేవు.

వైద్యుల కొరత ఇక ఉండదు
ఇప్పటివరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రధాన లోపం వైద్యుల కొరతే. ఇకపై ఈ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, కొత్తగా ఏర్పాటుచేస్తున్న క్యాన్సర్‌ బ్లాకులకూ వైద్యులను నియమించనున్నారు. ఇలా పెరుగుతున్న పడకలు, యూనిట్లకు అనుగుణంగా 355 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి వెళ్లింది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వైద్యవిద్యా వర్గాలు తెలిపాయి.

పదోన్నతుల నిరీక్షణకు స్వస్తి
ఇదిలా ఉంటే.. కొత్త నియామకాలు లేకపోవడంతో ఏళ్ల తరబడి పనిచేసినా పదోన్నతులు వచ్చేవి కావు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. కొత్తగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు రాగానే పాత వారికి వెంటనే అసోసియేట్‌ ప్రొఫెసర్‌లుగా పదోన్నతి వస్తుంది. అలాగే, అసోసియేట్‌లుగా ఉన్న వారందరికీ ప్రొఫెసర్‌లుగా పదోన్నతి రానుంది. గతంలో లాగా పదోన్నతుల కోసం దశాబ్దాల తరబడి వేచిచూసే పరిస్థితి ఉండదు.

ఇప్పటివరకూ బోధనాసుపత్రుల్లో నియామకాలు ఇలా..

విభాగం

పోస్టులు (వైద్యేతర)

వైద్యులు

డీఎంఈ

2,869

695

వైద్యవిధాన పరిషత్‌

1,132

218

ప్రజారోగ్యశాఖ

2,105

615

Published date : 02 Mar 2021 02:43PM

Photo Stories