Additional Collector Yadireddy: పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్ సిటీ: పిల్లలతో పని చేయిస్తున్న యాజమాన్యాలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ సమావేశం అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండేటట్టు చూడాలని, పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న, పని చేయిస్తున్న, వీధి బాలలను గుర్తించి వారిని బడిలో చేర్పించవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి షేక్ రసూల్ బి మా ట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఇప్పటివరకు 52 మంది పిల్లలను గుర్తించామన్నారు. పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. డీఎంహెచ్‌వో సుదర్శనం, ఏహెచ్‌టీయూ ఇన్‌చార్జి గోపినాథ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యోహాన్, బాల్ రక్షా భవన్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, డీసీపీవో చైతన్యకుమార్, పోలీస్, కార్మిక శాఖ, డీసీపీయూ, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
Seva Bharat Trust: విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ
బాధితులకు పరిహారం చెల్లించాలి
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం బాధిత మహిళలు, పిల్లలకు అందిస్తున్నటువంటి పరిహారంపైన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని కల్పించే విధంగా కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. బాధిత మహిళలకు, పిల్లలకు జాప్యం చేయకుండా పరిహారం చెల్లించాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 161 కేసులు నమోదు కాగా 63 మంది బాధితులకు మొదటి విడత, 98 కేసులను రెండో విడత పరిహారం ఇచ్చామన్నారు. బాధిత మహిళలు, పిల్లలకు సఖి సెంటర్లో తాత్కాలిక వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ సురేందర్ రెడ్డి, డీఎంహెచ్‌వో సుదర్శనం, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ సంపూర్ణ, సఖి సెంటర్ కోఆర్డినేటర్ భానుప్రియ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ యాదిరెడ్డి