Govt. Schools and Colleges: గ్రామ విద్యార్థులని తిరిగి బడికి చేరువ చేసే కార్యక్రమంలో ప్రభుత్వం
సాక్షి ఎడ్యుకేషన్: స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) అనేది విద్యారంగంలో ఉపయోగించే చదువుకునే వారి గణాంక కొలత. మిషన్ విజన్‌లో భాగంగా ఈనెల నాలుగో తేదీ లోపు 5 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వారంతా బడిలో చేర్చితే నూరుశాతం జీఈఆర్ సాధించినట్లు. దీనికోసం ప్రభుత్వం గ్రామ/వార్డు వలంటీర్ల సహకారంతో వారి పరిధిలో సెప్టెంబర్ 2005 నుంచి ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారందరి వివరాలు సేకరించి వారిలో మధ్యలో చదువుకు దూరమైన వారిని లెక్కతేల్చి, బడి/కళాశాల మానేసిన వారందరినీ తిరిగి బడికి చేరువ చేసే బృహత్తర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
యజ్ఞంలా కార్యక్రమం
ఉమ్మడి జిల్లాలో 5 నుంచి 18 ఏళ్ల మధ్యలో బడి మానేసిన వారందరిని తిరిగి చదువులు కొనసాగించే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతోంది. గ్రామ, వార్డు వలంటీర్లు సహకారంతో ఆధార్ డేటా ఆధారంగా బడి మానేసిన వారిని ఉమ్మడి జిల్లాలో 33వేల మంది ఉన్నట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లోని ఉపాధ్యాయులు, వలంటీర్లు, సీఆర్పీల సహకారంతో 18 ఏళ్లు నిండినవారిని, డబుల్ ఎంట్రీ, చనిపోయినవారిని, ఇతర రాష్ట్రాలు ఉన్నవారిని వడపోత చేయగా 14,290 మంది ఉన్నట్లు తేల్చారు. వీరందరిలో పాఠశాల స్థాయిలో ఉంటే ఆయా పాఠశాలల్లో మిగిలిన 10,020 మందిని ఓపెన్ స్కూళ్లలో చేర్చేలా ప్రణాళికలు రూపొందించి నమోదు చేసే కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది.
ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫీజులు ప్రభుత్వమే భరించేలా..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా టెన్త్, ఇంటర్ నమోదు చేసుకునే వారి ఫీజులు ప్రభుత్వమే భరించేలా సమగ్ర శిక్ష అఽధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యామ్‌సుందర్ చెప్పారు. దీని కోసం సచివాలయ వెల్ఫేర్ సహాయకుల ద్వారా 16–19 ఏళ్ల వయసు ఉండి టెన్త్, ఇంటర్ మానేసిన పిల్లల వివరాలు శనివారం సేకరించారు. ఓపెన్ స్కూల్లో చదివే విద్యార్థుల అడ్మిషన్ ఫీజులు సర్వశిక్ష నిధుల నుంచి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. 16 లోపు, 19 పైబడిన వయసు కలిగిన విద్యార్థుల ఫీజులు ఎవరికి వారే చెల్లించుకోవాల్సి ఉంటుందని డీఈవో తెలిపారు.
Teachers day: విజ్ఞాన ఘనులు... ఈ గురువులు...!
గత నాలుగేళ్లుగా పెరుగుతున్న జీఈఆర్
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యారంగంలో జరుగుతున్న సంస్కరణల కారణంగా ఏపీలో గత నాలుగేళ్లుగా జీఈఆర్ పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రాథమిక విద్యలో 2018లో జాతీయ స్థాయిలో జీఈఆర్ 96.09 ఉండగా రాష్ట్రంలో 92.91 ఉంది. అలాగే 2019–20 నుంచి వరుసగా ప్రాథమిక విద్యలో జీఈఆర్ పెరగుతూ 2022–23 నాటికి జాతీయ స్థాయిని మించి 100.80కి చేరింది. (18 ఏళ్లు నిండి చదువుతున్న వారి సంఖ్యను జీఈఆర్ గణాంకాల్లో ఉంటారు). అలాగే సెకండరీ విద్యలో 2019లో జీఈఆర్ 79.69 ఉండగా 2022–23నాటికి 89.63కు చేరింది. ఉన్నత విద్యలో 2018–19లో జీఈఆర్ 46.88 ఉండగా 2022–23 నాటికి 69.87 శాతానికి పెరిగింది.
ఉమ్మడి జిల్లాలో చదువుకు దూరమైన వారి వివరాలు
టెన్త్‌లోపు చదువు మానేసినవారు 4,039
టెన్త్ ఫెయిల్‌తో మానేసినవారు 4,619
టెన్త్ పాసై మానేసినవారు 3,810
ఐటీఐ మధ్యలో మానేసినవారు 41
నర్సింగ్ మధ్యలో మానేసినవారు 07
ఏ పాఠశాలలోనూ చేరనివారు 21
సంపాదన అవసరాల నిమిత్తం.. 198
ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు 267
దివ్యాంగులుగా ఉన్నవారు 272
చదువు ఇష్టంలేని వారు 1,016
మొత్తం బడిబయట ఉన్నవారు 14,290
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతోపాటు అమలు చేస్తున్న పథకాలతో గత నాలుగేళ్లుగా స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఈ గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) నూరు శాతం సాధించే దిశగా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. సెప్టెంబర్ 7వ తేదీ లోగా నూరుశాతం స్థూల నమోదు నిష్పత్తి ఉండేలా తగిన చర్యలు తీసుకుంటోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులందరినీ సమన్వయం చేస్తూ మిషన్ విజన్ పేరుతో ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా దశల వారీగా వడపోత చేసి ఉమ్మడి జిల్లాలో బడి బయట ఉన్నట్లు గుర్తించిన 14,290 మంది బడి ఈడు పిల్లలను తిరిగి పాఠశాలల్లో, కళాశాలల్లో, ఓపెన్ స్కూళ్లలో చేర్పించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.
తొలి రాష్ట్రంగా ఏపీ
దేశంలో విద్యార్థుల నమోదులో నూరుశాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలవాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కృషి చేస్తున్నారు. ఆ దిశగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో బడి ఈడు పిల్లలంతా తిరిగి బడులకు చేర్చే కార్యక్రమం యజ్ఞంలా సాగుతోంది. ఈ లక్ష్య సాధనలో బడికి దూరమైన విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరుతున్నాం.
– పి.శ్యామ్‌సుందర్, డీఈవో, ఏలూరు
మెరుగైన స్థాయిలో ఉంచేందుకే
సీఎం వైఎస్ జగన్ విద్యా విధానంలో చేపట్టే విప్లవాత్మక మార్పులు యువతను మెరుగైన స్థాయిలో ఉంచుతాయి. టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలై చదువులు మానేసినవారు, పదో తరగతి, ఇంటర్ ఫెయిలైనా తిరిగి రెగ్యులర్ తరగతుల్లో చేరే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వీరికి అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా, వసతి దీవెన పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటోంది.
– పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్యే, ఉంగుటూరు
సమగ్ర శిక్ష ద్వారా ఫీజుల చెల్లింపు
16 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వారు ఓపెన్ స్కూల్లో జాయిన్ అయితే అడ్మిషన్ ఫీజుతోపాటు ఇతర ఫీజులను ప్రభుత్వమే సమగ్ర శిక్ష ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. బడి ఈడు పిల్లల సర్వే గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థతో సులభంగా సాధ్యమైంది. తక్కువ సమయంలో నూరుశాతం జీఈఆర్ సాధించడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ చాలా కీలకంగా మారింది. అమ్మ ఒడి పథకంతో ప్రాథమిక విద్యలో జీఈఆర్ జాతీయ స్థాయిని మించి ఏపీ సాధించగలిగింది.
– సబ్బిత నర్సింహమూర్తి, ఎంఈవో, దెందులూరు