Govt General Hospital: చిన్నారుల ఎదుగుదలకు ఎన్‌ఆర్‌సీ
అనంతపురం క్రైం: పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులకు అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లోని న్యూట్రిషియన్ రీహేబిలిటేషన్ సెంటర్(ఎన్‌ఆర్‌సీ). వరంగా మారింది. పోషకాహార లోపంతో బక్కచిక్కపోయి, వివిధ రకాల ఇన్‌ఫెక్ఫన్లతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 0– 59 నెలల వయసున్న పిల్లలందరికీ నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో ఉచితంగా చికిత్సనందిస్తున్నారు.
వైద్య సేవల్లో ప్రత్యేక చొరవ..
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 2014, అక్టోబర్‌లో 20 పడకల సామర్థ్యంతో ఎన్‌ఆర్‌సీ యూనిట్ ప్రారంభమైంది. 2014లో 170, 2015లో 342, 2016లో 350, 2017లో 220, 2018లో 221, 2019లో 444, 2020లో 78, 2022లో 889, ఈ ఏడాది ఇప్పటి వరకూ 211 మంది చిన్నారులు వైద్యం పొందారు. వైద్యులు డాక్టర్ సతీష్, డాక్టర్ షబానా, న్యూట్రిషీయన్ కౌన్సిలర్లు సౌజన్య, పల్లవి, స్టాఫ్‌నర్సులు దివ్యాంజలి, పవిత్ర, చెన్నమ్మ, వంట మనిషి శరణ్య, అటెండర్ శకుంతల, తదితరులు ప్రత్యేక చొరవ తీసుకుని చిన్నారులకు సేవలందిస్తున్నారు.
Padma Basavanthappa, IAS: స్కూళ్లు, అంగన్‌వాడీల్లో తనిఖీ
రోజూ 7 నుంచి 9 సార్లు పోషకాహారం..
పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యకు అనుగుణంగా చికిత్స అందజేస్తూనే రోజూ 7 నుంచి 9 సార్లు ఫార్ములా 100, 75, సీరియల్ బేస్డ్ 75 (పాలు, నీరు, చక్కెర, బొరుగులు, కొబ్బరినూనె, ఉడికించిన కూరగాయలు, కిచిడి, నెయ్యితో చేసిన రాగిసర, అటుకుల పాయసం, తాజా కూరగాయలు, పండ్లు, బెల్లంతో చేసిన సున్నుండలు) అందజేస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి రెండు గంటలకోసారి పౌష్టికాహారం అందిస్తారు. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న వారికి అర్ధరాత్రి మరో రెండుసార్లు పౌష్టికాహారం అందిస్తారు. ఇలా 14 రోజుల పాటు చిన్నారులను అడ్మిషన్‌లో ఉంచుకుని వారు సంపూర్ణంగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నారు. అనంతరం నాలుగుసార్లు ఫాలో అప్ ట్రీట్‌మెంట్ ఇస్తారు. చివరి ఫాలోఅప్‌లో 14 రోజుల అడ్మిషన్‌కు గాను రూ.1,400ను చెక్కు రూపంలో అందజేస్తారు.
పౌష్టికాహార లోపంతో బాధపడేవారికి 14 రోజుల సేవలు చిన్నారులకందుతున్న వైద్యం పట్ల తల్లిదండ్రుల ఆనందం ఉచిత సేవలు
పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఎన్‌ఆర్‌సీలో అడ్మిషన్‌లో ఉంచి మెరుగైన సేవలందిస్తున్నాం. వైద్యులు, న్యూట్రిషీయన్ కౌన్సిలర్లు, స్టాఫ్‌నర్సుల పర్యవేక్షణలో చిన్నారులకు కార్పొరేట్ తరహాలో వైద్యం అందిస్తున్నాం. పౌష్టికాహార లోపంతో ఇబ్బందిపడుతున్న చిన్నారులను ఆస్పత్రికి తీసుకువచ్చిన ప్రోత్సాహాకాలనూ అందజేస్తున్నాం. ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్