Skip to main content

Children's health: చిన్నారుల ఆరోగ్యమే ప్రధానం

Mission Indradhanush

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలు వేయడమే లక్ష్యంగా మిషన్‌ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రతినెలా ఆరు రోజుల చొప్పున మూడునెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మిషన్‌ ఇంద్రధనస్సు, నులిపురుగుల మాత్రల పంపిణీపై మాట్లాడారు. మిషన్‌ ఇంద్రధనస్సు కార్యక్రమం ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరలా సెప్టెంబర్‌ 11 నుంచి 16వ తేదీ వరకూ, అక్టోబర్‌ 9 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన సర్వేలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని చిన్నారులు 3,009 మందిని గుర్తించామన్నారు. వారితో పాటు ఇంకా వ్యాధినిరోధక టీకాలు వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వేయనున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలో 422 సెషన్స్‌(స్థలాలు)ను ఎంపిక చేసి వ్యాక్సినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరికి మీజిల్స్‌–రూబెల్లా నిర్మూలనకు లక్ష్యాల ఏర్పాటులో భాగంగా మిషన్‌ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Health of students: విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి

5.50 లక్షల ఆల్‌బెండాజోల్‌ మాత్రలు..
ఈ నెల 10న నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులతో నులిపురుగుల నివారణ మాత్రలు (ఆల్‌బెండాజోల్‌) మింగించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాచర్ల సుహాసిని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 19 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4,67,550 మందికి వేయాలనేది లక్ష్యం కాగా, 5.50 లక్షల మాత్రలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ మాత్రలను విజయవాడలోని జోనల్‌ కమిషనర్‌లు, మండలాల్లోని ఎంఈఓలు, మెడికల్‌ ఆఫీసర్‌ల ద్వారా ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నులిపురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు.

Published date : 07 Aug 2023 03:29PM

Photo Stories