Skip to main content

పోలీసు శాఖలో 20 వేల కొలువుల జాతర ?

సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న వేళ ఎలాంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
త్వరలో రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోడ్‌కు ముందే కొలువుల జాతరకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన వివాదాలు రాకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల కోడ్‌కు ముందే నోటిఫికేషన్ ఇచ్చేందుకు న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నట్లు సమాచారం.

Must check: TS Police Jobs Guidance, Study Material, Practice Tests and Previous Papers

ఎప్పుడైనా రావచ్చు..
అసెంబ్లీ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తే.. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఇంకా 5 నెలలకు పైగా సమయం ఉంది. ఈ రెండు ఎన్నికల్లో ముందుగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ స్థానంతో పాటు ఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ స్థానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ సభ్యుల పదవీ కాలం మార్చి నెలాఖరు వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ గడువుకు ముందే కేంద్ర ఎన్నికల సంఘం వీటికి ఎన్నికలు నిర్వహించనుంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. ఈ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చేసరికి 2 వారాలు పడుతుంది. ఆ తర్వాత ఎపుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు వెళ్తుంది. ఈ లోపు నోటిఫికేషన్ ఇస్తే.. ఈ భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు ఉంటుందని, న్యాయ చిక్కులు రావన్న అభిప్రాయంతో బోర్డు ఉంది. అయితే, ఈ భర్తీకి ప్రభుత్వం నుంచి బోర్డుకు అధికారిక ఆదేశాలు రాలేదు.
Published date : 19 Dec 2020 04:05PM

Photo Stories