Skip to main content

పదోన్నతులు కల్పిస్తేనే.. అధిక సంఖ్యలో పోస్టుల భర్తీకి అవకాశం!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇప్పటికిప్పుడు ఉన్న ఖాళీల ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే 5 వేలకు పైగా అందుబాటులోకి రానున్నాయి.
అదే ప్రభుత్వం కనుక టీచర్ల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 12 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయొచ్చు. ఇదీ క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించిన అనంతరం పాఠశాల విద్యా శాఖ తేల్చిన పరిస్థితి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో విద్యా శాఖ చర్యలు వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల వివరాలను సేకరించింది. విద్యా శాఖ తేల్చిన లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 9 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. వాటి ల్లో విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు కూడా మరో 3 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి.

12 వేలకు పైగా పోస్టుల భర్తీ
ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 9 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటన్నింటినీ డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం లేదు. 70% పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగతా 30% పోస్టులను మాత్రమే డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయొచ్చు. అంటే 9 వేల ఖాళీల్లో డెరైక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా 2,700కు పైగా పోస్టులను మాత్రమే భర్తీ చేసే వీలుంటుంది. మిగతా 6,300 పోస్టుల్లో అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వారికి పదోన్నతులు కల్పిస్తే.. ఖాళీ అయ్యే 9 వేలకు పైగా ఎస్జీటీ పోస్టులు డెరైక్టు రిక్రూట్‌మెంట్ చేసేందుకు అందుబాటులోకి వస్తాయి. అయితే ముందుగా ఎస్జీటీ తత్సమాన పోస్టుల్లో ఉన్న క్లియర్ వేకెన్సీలు, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేటగిరీలో ఉన్న డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ క్లియర్ వేకెన్సీలను ప్రభుత్వానికి పంపేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
Published date : 19 Dec 2020 04:07PM

Photo Stories