Skip to main content

ఓలా గుడ్ న్యూస్: 10,000 మందికి ఉద్యోగాలు !

సాక్షి, న్యూఢిల్లీ: రైడింగ్ సేవలు అందిస్తున్న ఓలా దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ప్లాంటు స్థాపించేందుకు ఇటీవలే తమిళనాడు ప్రభుత్వంతో ఓలా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో ప్లాంటు కార్యరూపంలోకి రానుంది. ఈ కేంద్రం కోసం సంస్థ సుమారు రూ.2,400 కోట్లు పెట్టుబడి చేస్తోంది. ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే 10,000 మందికి ఉద్యోగాలు రానున్నాయని సమాచారం. స్కూటర్ల తయారీలో ప్రపంచంలో ఇదే అతిపెద్ద కేంద్రం కానుంది. తొలుత ఏటా 20 లక్షల యూనిట్ల సామర్థ్యంతో ప్లాంటు రానుంది. కొన్ని నెలల్లో ఈ-స్కూటర్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు ఇక్కడి నుంచి స్కూటర్లను ఎగుమతి చేస్తారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఇంజనీరింగ్, డిజైన్ సామర్థ్యాలను పెంచుకోవడం కోసం అమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన ఇటెర్గో బీవీ అనే కంపెనీని ఓలా ఎలక్ట్రిక్ ఈ ఏడాది మే నెలలో కొనుగోలు చేసింది. ఎలక్ట్రిక్ విభాగం కోసం 2,000 మందిని నియమించుకోనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
Published date : 23 Dec 2020 05:01PM

Photo Stories