JEE Advanced: సత్తా చూపిన తెలుగు విద్యార్థులు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..

ఇందులో వావిలాల చిద్విలాసరెడ్డి (1వ ర్యాంకు), నాగిరెడ్డి బాలాజీరెడ్డి (9వ ర్యాంకు) తెలంగాణ వారుకాగా.. రమేశ్ సూర్యతేజ (2వ), అడ్డగడ వెంకట శివరామ్ (5వ), బిక్కిని అభినవ్ చౌదరి (7వ), వైపీవీ మనీందర్‌రెడ్డి (10వ ర్యాంకు) ఏపీకి చెందినవారు. ఇక మహిళల్లో జాతీయ టాప్ ర్యాంకర్ (298 మార్కులు)గా ఏపీ విద్యార్థిని నాయకంటి నాగ భవ్యశ్రీ నిలిచింది. ఆమెకు జనరల్ కేటగిరీలో 56వ ర్యాంకు వచ్చింది.
టాప్‌లో ఐఐటీ హైదరాబాద్ జోన్..
దేశంలో ఐఐటీలు, ఇతర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించగా.. జూన్ 18న ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,83,072 మంది పరీక్షలు రాయగా.. 43,773 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 36,264 మంది, బాలికలు 7,509 మంది ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గణనీయ సంఖ్యలో ర్యాంకులు సాధించారు. అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల పరిధి అధికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్ జోన్ టాప్‌లో నిలిచింది. ఈ జోన్ పరిధిలో 10,432 మందికి ర్యాంకులు వచ్చాయి. టాప్–500 ర్యాంకర్లలో 174 మంది ఈ జోన్ (తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి)కు చెందినవారే. నాగర్ కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాసరెడ్డి మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సా«ధించి జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచాడు. గత ఏడాదితో పోల్చితే ఈసారి జేఈఈకి పోటీ ఎక్కువగా ఉందని.. పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెప్తున్నారు.
చదవండి: JEE Advanced: మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ మెరిట్ విద్యార్థి.. ఇలా దొరికాడు..
నేటి నుంచే జోసా రిజిస్ట్రేషన్లు
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన ‘జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)’కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం 6 దశల్లో సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ కౌన్సెలింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు (23), ఎన్‌ఐటీ, ఐఐఈఎస్టీ (31), ఐఐఐటీ (26) జీఎఫ్‌ఐటీ (38)లు కలిపి మొత్తం 118 విద్యాసంస్థల్లో సీట్లను కేటాయిస్తారు. గత ఏడాది ఈ సంస్థలన్నింటిలో కలిపి 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఐఐటీలలోని మొత్తం సీట్లలో 20శాతం మేర మహిళలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు.
– జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన వారిలో ఆర్కిటెక్ట్ కేటగిరీ అభ్యర్ధులు ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్టును రాయాల్సి ఉంటుంది. వారు జూన్ 19 నుంచే ఏఏటీకి దరఖాస్తు చేయవచ్చు. జూన్ 21న పరీక్ష నిర్వహించి 24న ఫలితాలు విడుదల చేస్తారు.
చదవండి: NIRF: దేశంలో నంబర్ 1 ఐఐటీ ఇదే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్–2023 ర్యాంకింగ్ నివేదిక విడుదల..
టాప్ 10 ర్యాంకర్లు వీరే..
- వావిలాల చిద్విలాసరెడ్డి (తెలంగాణ)
- రమేశ్ సూర్యతేజ (ఏపీ)
- రిషి కర్లా (రూర్కీ ఐఐటీ పరిధి)
- రాఘవ్ గోయల్ (రూర్కీ ఐఐటీ పరిధి)
- అడ్డగడ వెంకట శివరామ్ (ఏపీ)
- ప్రభవ్ ఖండేల్‌వాల్ (ఢిల్లీ ఐఐటీ పరిధి)
- బిక్కిని అభినవ్ చౌదరి (ఏపీ)
- మలయ్ కేడియా (ఢిల్లీ ఐఐటీ పరిధి)
- నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ)
- వైపీవీ మనీందర్‌రెడ్డి (ఏపీ)
కొన్నేళ్లుగా క్వాలిఫై కటాఫ్ మార్కులివీ..
కేటగిరీ |
2023 |
2022 |
2021 |
2020 |
2019 |
జనరల్ |
86 |
55 |
63 |
69 |
93 |
ఓబీసీ |
77 |
50 |
56 |
62 |
83 |
ఈడబ్ల్యూఎస్ |
77 |
50 |
56 |
62 |
83 |
ఎస్సీ |
43 |
28 |
31 |
34 |
46 |
ఎస్టీ |
43 |
28 |
31 |
34 |
46 |
పీడబ్ల్యూడీ |
43 |
28 |
31 |
34 |
46 |
ఈసారి కనీస అర్హత మార్కుల శాతం ఇలా
జనరల్ |
23.89 |
ఓబీసీ |
21.50 |
ఈడబ్ల్యూఎస్ |
21.50 |
ఎస్సీ |
11.95 |
ఎస్టీ |
11.95 |
పీడబ్ల్యూడీ |
11.95 |
ఐఐటీ జోన్ల వారీగా అత్యధిక ర్యాంకులు, క్వాలిఫై అయిన అభ్యర్ధులు
జోన్ |
టాప్–10 |
టాప్–100 |
టాప్–200 |
టాప్–300 |
టాప్–400 |
టాప్–500 |
మొత్తం క్వాలిఫైడ్ |
బాంబే |
0 |
22 |
42 |
59 |
80 |
103 |
7,957 |
ఢిల్లీ |
2 |
20 |
44 |
69 |
98 |
120 |
9,290 |
గౌహతి |
0 |
1 |
2 |
2 |
4 |
4 |
2,395 |
హైదరాబాద్ |
6 |
40 |
75 |
121 |
149 |
174 |
10,432 |
కాన్పూర్ |
0 |
2 |
4 |
4 |
9 |
16 |
4,582 |
ఖరగ్‌పూర్ |
0 |
5 |
11 |
20 |
25 |
37 |
4,618 |
రూర్కీ |
2 |
10 |
22 |
25 |
35 |
46 |
4,499 |
పేదల విద్య కోసం సాఫ్ట్‌వేర్ రూపొందిస్తా..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం గోదల్ గ్రామం. నాన్న రాజేశ్వర్‌రెడ్డి, అమ్మ నాగలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అమ్మానాన్న, సోదరుడి ప్రోత్సాహంతో ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివాను. భవిష్యత్‌లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేలా సాఫ్ట్‌వేర్ రూపొందించడమే లక్ష్యం.
– ఫస్ట్ ర్యాంకర్ చిద్విలాసరెడ్డి
ఏపీ, తెలంగాణ నుంచి కొందరు ముఖ్య రాంకర్లు
పేరు |
ర్యాంకు |
దాసరి సాకేత్ నాయుడు |
12 |
జి.అభిరామ్ |
14 |
కౌశిక్‌రెడ్డి |
17 |
డి.వెంకటయుగేష్ |
18 |
మాలిక్ జిందాల్ |
19 |
షేక్ సాహిల్ చందా |
23 |
సోని మయాంక్ |
26 |
ఎస్‌ఎస్ సుమేథ్ |
37 |
వీడీఎస్ సాత్విక్‌రెడ్డి |
38 |
సుతార్ హర్ష |
62 |
డి.ఫణీంద్రనాధ్‌రెడ్డి |
65 |
గుండా సుశాంత్ |
67 |
హర్ష తాయ |
68 |
కె.వివేక్ |
73 |
తేజరెడ్డి |
81 |
వెంకట కౌండిన్య |
84 |
సమోట అపూర్వ |
92 |
పెద్ద కంపెనీకి సీఈఓ అవుతా
జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ రావడం పట్ల ఆనందంగా ఉంది. మాది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బీఎన్ ఆర్ పేట. అమ్మానాన్న కృష్ణవేణి, రమేష్ ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ తీసుకుంటాను. పెద్ద కంపెనీకి సీఈఓ కావాలన్నదే నా లక్ష్యం. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉప యోగపడేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా.
–సెకండ్ ర్యాంకర్ ఆర్.సూర్యతేజ
ఎంఐటీలో ఎంఎస్ చేయాలనుంది
మా స్వస్థలం గుంటూరు జిల్లా చిలక లూరి పేట. నాన్న హనుమంతరావు రైతు. అమ్మ కళావతి నరస రావుపేట లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ లో సూపర్‌వైజర్. ముంబై ఐఐటీలో సీఎస్ ఈలో చేరుతాను. తర్వాత ఎంఐటీ (మసా చుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఎంఎస్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాను.
–5వ ర్యాంకర్ అడ్డగడ వెంకట శివరాం
ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో చేరుతా..
మా స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నాం. నాన్న శ్రీనివాసరెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ అనురాధ గృహిణి. ఏపీఈఏపీ సెట్‌లో 6వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో 2వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్ జనరల్ కేటగిరీలో 10వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఐఐటీలో చదవాలనే లక్ష్యంతో చదివాను. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో చేరుతాను.
–10వ ర్యాంకర్ యక్కంటి ఫణి వెంకట మణీందర్‌రెడ్డి