JEE Advanced 2023 Top 10 Rankers : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ ఇదే..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాల్లో (JEE Advanced 2023 Results) తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి(ఐఐటీ హైదరాబాద్ జోన్) జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలిచారు. మరోవైపు అమ్మాయిల కేటగిరీలో నాయకంటి నాగ భవ్యశ్రీ టాపర్‌గా నిలిచింది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌ను ఐఐటీ గువాహటి నిర్వహించగా, సీట్ల భర్తీని ఆ సంస్థే చేపడుతున్నది.
టాప్-10 ర్యాంకర్లు వీరే..
టాప్ టెన్ ర్యాంకర్స్‌లో హైదరాబాద్ ఐఐటీ జోన్ విద్యార్థులు ఆరుగురు ఉన్నారు. వావిలాల చిద్విలాస్ రెడ్డికి 1వ ర్యాంకు, రమేష్ సూర్య తేజకు 2వ ర్యాంకు,అడ్డగడ వెంకట శివరామ్‌కు 5వ ర్యాంకు, బిక్కిన అభినవ్ చౌదరికి 7వ ర్యాంకు, నాగిరెడ్డి బాలాజీ రెడ్డికి 9వ ర్యాంకు, యక్కంటి పాణి వేంకట మనీంధర్ రెడ్డికి 10వ ర్యాంకు వచ్చింది. హైదరాబాద్ జోన్‌కే చెందిన మరో తెలంగాణ విద్యార్థి నాయకంటి నాగ భవ్యశ్రీ 298 మార్కులతో ఆలిండియా 56వ ర్యాంకు దక్కించుకుంది. చిద్విలాస్ రెడ్డి మొత్తం 360 మార్కులకు 341 మార్కులు సాధించాడు.
టాప్ 10 ర్యాంకర్లు వీరే..
1. వావిలాల చిద్విలాస్ రెడ్డి
2. రమేశ్ సూర్య తేజ
3. రిషి కర్లా
4. రాఘవ్ గోయల్
5. అడ్డగడ వెంకట శివరామ్
6. ప్రభవ్ ఖండేల్వాల్
7. బిక్కిన అభినవ్ చౌదరి
8. మలయ్ కేడియా
9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి
10. యక్కంటి ఫణి వెంకట మనీందర్ రెడ్డి
☛ జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి
☛ జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి
జోసా కౌన్సెలింగ్ పూర్తి వివరాలు ఇవే..
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సహా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సెలింగ్ జూన్ 19వ తేదీ నుంచి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నది. బీటెక్, బీఎస్సీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. తొలుత జోసా కౌన్సెలింగ్ తర్వాత ఐఐటీలు మినహా మిగిలిన విద్యాసంస్థల్లోని సీట్లను సెంట్రల్ సీట్ అలకేషన్‌బోర్డు (సీశాబ్) చేపడుతుంది.
జాతీయంగా 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో సీట్లను జోసా కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. సోమవారం నుంచి జూలై 26 వరకు 38 రోజులపాటు కౌన్సెలింగ్ కొనసాగనున్నది.
ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు జూన్ 19వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్లు..
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో 40 వేలకు పైగా సీట్ల భర్తీకి నిర్వహించే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీసాబ్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 19వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) రూర్కీకి సీ-సాబ్ బాధ్యతలు అప్పగించింది. 3 లక్షలకు పైగా జేఈఈ మెయిన్ అభ్యర్థులు సీసాబ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలున్నాయి.
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు పొందేవారు ప్లస్ టు లెవల్లో (12వ తరగతి లేదా ఇంటర్‌లో) 75% మార్కులు, లేదా టాప్-20 పర్సంటైల్ పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు 65% మార్కులు పొందితే సరిపోతుంది. గతంలో ఈ నిబంధన అమల్లో ఉండగా, కరోనా కారణంగా మినహాయింపునిచ్చి, తాజాగా పునరుద్ధరించారు.
జోసా కౌన్సెలింగ్-2023 పూర్తి షెడ్యూల్ ఇదే..
☛ జూన్ 19 అభ్యర్థుల రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్
☛ జూన్ 25 మాక్ సీట్ల కేటాయింపు -1
☛ జూన్ 27 మాక్ సీట్ల కేటాయింపు -2, ఆప్షన్లు ఫ్రీజ్ చేసే అవకాశం
☛ జూన్ 28 రిజిస్ట్రేషన్ ముగింపు
☛ జూన్ 29 సీట్ల కేటాయింపు డేటా వెరిఫికేషన్
☛ జూన్ 30 మొదటి విడత సీట్ల కేటాయింపు
☛ జూలై 6 రెండో విడత సీట్ల కేటాయింపు
☛ జూలై 12 మూడో విడత సీట్ల కేటాయింపు
☛ జూలై 16 నాలుగో విడత సీట్ల కేటాయింపు
☛ జూలై 21 ఐదో విడత సీట్ల కేటాయింపు
☛ జూలై 26 ఆరో విడత సీట్ల కేటాయింపు