Inspirational Story : ఇద్దరూ ఇద్దరే... ఎస్‌ఐ ఈవెంట్స్‌లో నెగ్గిన తల్లీకూతుళ్లు
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ తల్లి తన పట్టుదలతో చదివి ఇప్పటికే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తన కూతురిని కూడా ఎస్‌ఐకి సన్నద్ధం చేస్తున్నారు. వారి సక్సెస్ మీకోసం....
ఖమ్మం జిల్లాలోని పరేడ్ గ్రౌండ్స్‌లో....
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల వెంకన్న భార్య నాగమణి(37) తన కుమార్తె త్రిలోకిని(21)తో పాటు ఎస్‌ఐ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లోనూ తల్లీకుమార్తెలిద్దరూ సత్తా చాటి ఎస్‌ఐ మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం నిర్వహించిన పరుగు పందెం, ఎత్తు కొలత, లాంగ్ జంప్, షాట్‌పుట్ ఇలా అన్ని ఈవెంట్లలో విజయం సాధించి తుది పరీక్షకు అర్హత సాధించారు.
కుటుంబ నేపథ్యం ఇదీ...
తోళ్ల వెంకన్న కుటుంబం చెన్నారం నుంచి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితమే ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లింది. తొలుత నాగమణి అంగన్ వాడీ టీచర్‌గా ఖమ్మం బురహాన్ పురంలో కొంతకాలం పనిచేశాక.. పదేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో హోంగార్డుగా విధులు నిర్వర్తించారు. రెండేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆమె ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. ఎస్‌ఐ కావాలన్న లక్ష్యంతో సాధన చేస్తుండగా, డిగ్రీ పూర్తి చేసిన నాగమణి కుమార్తె త్రిలోకిని కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి దేహ దారుఢ్య పరీక్షలకు హాజరైన వీరిద్దరు.. ఇందులోనూ సత్తా చాటి మెయిన్స్‌కు ఎంపికయ్యారు. మెయిన్స్‌లోనూ సత్తా చాటి ఉద్యోగానికి ఎంపికవ్వాలని కోరుకుందాం.