Skip to main content

TS ICET 2023: ఐసెట్‌లో ఉత్తీర్ణత 86.17%.. టాప్‌–5 ర్యాంకర్లు వీరే..

కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2023–24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి విడుదల చేశారు.
TS ICET 2023
ఐసెట్‌లో ఉత్తీర్ణత 86.17%.. టాప్‌–5 ర్యాంకర్లు వీరే..

జూన్‌ 29న హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్‌ చైర్మన్, వీసీ తాటికొండ రమేష్,. కన్వీనర్‌ పి.వరలక్ష్మి, రిజిస్ట్రార్‌ టి.శ్రీనివాస్‌రావుతో కలిసి ఆయన ఫైనల్‌కీ, ఫలితాలను విడుదల చేశారు. టీఎస్‌ ఐసెట్‌కు తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 75,925 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 70,900 మంది పరీక్ష రాసినట్లు లింబాద్రి తెలిపారు. వీరిలో 61,092 మంది (86.17శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 29,618, బాలికలు 31,473 మంది, ట్రాన్స్‌జెండర్‌ ఒకరు ఉన్నట్లు పేర్కొన్నారు. ఫలితాలు సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తమ వర్సిటీ ఐసెట్‌ను విజయవంతంగా నిర్వహించడం ఇది 14వ సారి అని తాటికొండ రమేష్‌ చెప్పారు. ఐసెట్‌లో సూర్యాపేట జిల్లాకు చెందిన నూకల శరణ్‌కుమార్‌ 161 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఈ ఏడాది మే 26, 27 తేదీల్లో టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.   

☛ TS ICET 2023 Results

వచ్చె నెల్లో షెడ్యూల్‌ విడుదల 

ఐసెట్‌ కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ను వచ్చే నెలలో విడుదల చేస్తామని లింబాద్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఎంబీఏ కళాశాలలు 265 ఉండగా, వాటిలో 32,544 సీట్లు ఉన్నాయన్నారు. ఎంసీఏ కళాశాలలు 53 ఉండగా 4,410 సీట్లు ఉన్నాయన్నారు. మొత్తంగా 318 కళాశాలలో 36,954 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.  

☛ TS ICET 2023 College Predictor; Check Cutoff Ranks
 
కేంద్ర గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగమే లక్ష్యం: శరణ్‌ కుమార్‌ (ఫస్ట్‌ ర్యాంక్‌) 
కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగమే లక్ష్యంగా చదివాను. అందుకే ప్రస్తుతం చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాను. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) పరీక్ష రాశాను. అందులో గ్రూప్‌–బీ పోస్టు అయిన అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. దాని పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నాను.  
 
సొంతంగా ప్రిపేరయ్యా: సాయి నవీన్‌ (సెకండ్‌ ర్యాంక్‌) 
ఐసెట్‌ కోసం సొంతంగా ప్రిపేరయ్యాను. ఏ కోచింగ్‌ కేంద్రంలోనూ శిక్షణ తీసుకోలేదు. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో సివిల్స్, గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతా.  

టాప్‌–5 ర్యాంకర్లు వీరే.. 

ర్యాంకు

పేరు

మార్కులు

ప్రాంతం

1

నూకల శరణ్‌కుమార్‌

161.30

హుజూర్‌నగర్, సూర్యాపేట

2

నాగులపల్లి సాయి నవీన్‌

156.38

కంచన్‌బాగ్, హైదరాబాద్‌

3

సజ్జ రవితేజ

153.60

మియాపూర్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి

4

ఎస్‌.సాయి ఫణి ధనుష్‌

152.30

నేరేడ్‌మెట్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి

5

మల్లికంటి గోపి

149.17

నేరేడుచర్ల, సూర్యాపేట

Published date : 30 Jun 2023 03:10PM

Photo Stories