Skip to main content

అగ్ని పర్వతాలు

భూపటలంలో లోతుకు వెళ్లేకొద్దీ ప్రతి 32 మీటర్లకు 1°C చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది. పటల అంతర్భాగాల్లోని కొన్ని ప్రాంతాల్లో పీడనం స్థానికంగా తగ్గడంతో శిలల ద్రవీభవన స్థానం క్షీణిస్తుంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో శిలలు ద్రవ లేదా పాక్షిక ద్రవ స్థితిలో ఉంటాయి. ఈ శిలాద్రవాన్నే ‘మాగ్మా’ అంటారు. ఉపరితలం మీదకు ఉద్భేదనం చెందిన మాగ్మాను ‘లావా’గా పిలుస్తారు. లావా ఉద్భేదనాన్నే ‘అగ్నిపర్వత ప్రక్రియ’ అంటారు. ఉద్భేదనా మార్గాన్ని అనుసరించి ఇవి రెండు రకాలు..1) కేంద్ర ఉద్భేదనం, 2) భ్రంశ ఉద్భేదనం.
కేంద్ర ఉద్భేదనంలో మాగ్మా గొట్టం లాంటి ఏక వాహిక ద్వారా ఉపరితలాన్ని చేరుతుంది. ఈ గొట్టం చుట్టూ లావా ఘనీభవించి ‘శంఖు ఆకార అగ్నిపర్వతాలు’ ఏర్పడతాయి. అగ్నిపర్వత శంఖువుల శిఖరంపై ఉన్న గరాటు ఆకార ప్రవేశ ద్వారాన్ని ‘అగ్నిపర్వత బిలాలు’ (Craters) అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ బిలాల్లో నీరు చేరి అగ్నిపర్వత బిల సరస్సులు (Crater Lakes) ఏర్పడతాయి. దాహరణకు దక్కన్ పీఠభూమిలోని ‘లోనార్’ సరస్సు (మహారాష్ట్ర).

భ్రంశ ఉద్భేదనం
భూపటలంలో ఉన్న అనేక పగుళ్లు, సంధులు, భ్రంశ తలాల ద్వారా అధిక పీడనానికి గురైన లావా ఉద్భేదనం చెందడాన్ని ‘భ్రంశ ఉద్భేదనం’ అంటారు. పలుచని, అల్ప స్నిగ్ధత ఉన్న లావా భ్రంశ ఉద్భేదనం చెంది విస్తారంగా ప్రవహించినప్పుడు.. లావా డోమ్‌లు, లావా పీఠభూములు ఏర్పడతాయి. లావా పీఠభూమికి దక్కన్ పీఠభూమి మంచి ఉదాహరణ. సుమారు 65-130 మిలియన్ ఏళ్ల క్రితం(క్రెటేషియస్-ఇయోసిన్) భౌమ్య యుగంలో బసాల్ట్ రకానికి చెందిన లావా భ్రంశ ఉద్భేదనం చెంది.. లావా పీఠభూమి రూపాంతరం చెందింది. ఈ ప్రాంతంలోని బసాల్ట్ శిలలు క్రమక్షయం చెంది, సారవంతమైన నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి.

ఉద్భేదనం నాలుగు రకాలు
తీవ్రత, పదార్థాల స్వభావాన్ని బట్టి ఉద్భేదనాలు నాలుగు రకాలు. అవి.. 1) వెసూవియన్ రకం, 2) స్ట్రాంబోలియన్ రకం, 3) ఐస్‌లాండిక్ రకం, 4) ప్లీనియన్ రకం. వెసూవియన్ ఉద్భేదనం అతి తీవ్రమైంది. ఇది లావాతో పాటు దట్టమైన పొగ, బూడిద వెదజల్లుతుంది. ఐస్‌లాండిక్ రకం ఉద్భేదనంలో లావా విస్ఫోటన రహితంగా నెమ్మదిగా ఉబికి వస్తుంది. పలుచని లావా విస్తారంగా ప్రవహించి లావాడోమ్‌లు లేదా లావా పీఠభూములు ఆవిర్భవిస్తాయి. ఐస్‌లాండ్, హవాయి దీవుల్లోని అగ్నిపర్వత ప్రక్రియ ఈ కోవకు చెందింది.
మధ్యధరా సముద్రంలోని ఇటలీకి చెందిన సిసిలీ దీవిలో ఉన్న స్ట్రాంబోలియన్ అగ్నిపర్వతం లావాతోపాటు అత్యధిక ఉష్ణోగ్రతతో నీటి ఆవిరి, దుమ్ము, ధూళి కణాలను అధికంగా వెదజల్లుతుంది. దీనివల్ల స్ట్రాంబోలియన్ అగ్నిపర్వత శిఖర బిలం వద్ద పొడవాటి జ్వాల ఏర్పడుతుంది. ప్రాచీన, మధ్య యుగాల్లో మధ్యధరా సముద్రంలో ప్రయాణించే నావికులకు జ్వాలతో కూడిన స్ట్రాంబోలియన్ అగ్నిపర్వతం లైట్ హౌస్‌గా ఉపయోగపడేది. ప్లీనియన్ రకమైన అగ్నిపర్వత ఉద్భేదనంలో లావాతో పాటు దట్టమైన పొగ, దుమ్ము, ధూళి ఉద్భేదనం చెందుతాయి. ప్లీనియన్, స్ట్రాంబోలియన్ ఉద్భేదనాలు ఓ మోస్తరు విస్ఫోటన తీవ్రతతో ఉంటాయి. ఉద్భేదన తరచుదనం ప్రాతిపదికగా అగ్నిపర్వతాలను క్రియాశీలక, నిద్రాణ, విలుప్త అగ్నిపర్వతాలుగా విభజించవచ్చు.

నిద్రాణ అగ్నిపర్వతాలు
తరచుగా విస్ఫోటనం చెందేవి క్రియాశీలక అగ్నిపర్వతాలు. ఇటీవల కాలంలో ఉద్భేదనా చరిత్ర(దాఖలాలు) లేనప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఉద్భేదనం చెంది, క్రియాశీలకమయ్యే అవకాశాలున్నవి ‘నిద్రాణ అగ్నిపర్వతాలు’.

విలుప్త అగ్నిపర్వతాలు
విలుప్త అగ్నిపర్వతాల బిలాల్లో సరస్సులు ఏర్పడి ఉంటాయి. లావా ఉద్భేదనా మార్గం పూర్తిగా ధ్వంసమై ఉంటుంది. ఇవి ఉద్భేదనం చెందే అవకాశం లేదు. వీటిని మృత అగ్ని
పర్వతాలుగా పేర్కొనవచ్చు. దక్కన్ పీఠభూమి, అండమాన్ దీవులు, హిమాలయాల్లోని అగ్నిపర్వతాలు, తూర్పు ఆఫ్రికాలోని కిలిమంజారో విలుప్త అగ్నిపర్వతాల కోవకు చెందినవి.

క్రియాశీలక అగ్నిపర్వతాలు
ప్రపంచంలోని క్రియాశీలక అగ్నిపర్వతాల్లో 90 శాతానికి పైగా పసిఫిక్ మహాసముద్రంలోనే కేంద్రీకృతమయ్యాయి. ఇవి ప్రధానంగా పలకలు అభిసరణం చెందే సబ్‌డక్షన్ మండలాల్లో ఏర్పడ్డాయి. పసిఫిక్ మహాసముద్ర ప్రధాన పలక ఈ ప్రాంతంలో జపాన్, ఫిలిప్పైన్, బిస్మార్క్, నాజ్కా, కాకస్ లాంటి ఉప సముద్ర పలకలతో అభిసరణం చెందడం వల్ల సబ్‌డక్షన్ మండలంలో క్రియాశీలక అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు ఫ్యూజియామా (జపాన్), పినటూబో (ఫిలిప్పైన్), క్రాకటావో (ఇండోనేషియా), రాంగిటాటో (న్యూజిలాండ్), సెయింట్ హెలెనెన్ (అలస్కా), మవునాలోవా (హవాయి) మొదలైనవి. అండమాన్‌లోని ‘బారెన్’ దీవుల్లో క్రియాశీలక అగ్నిపర్వత ప్రక్రియను గమనించవచ్చు. మధ్యధరా సముద్ర ప్రాంతంలోనూ క్రియాశీలక అగ్నిపర్వత ప్రక్రియ సంభవిస్తుంది. ఉదాహరణకు ఎత్నా, వెసూవియన్, స్ట్రాంబోలి అగ్నిపర్వతాలు.
భూపటలంలోని మాగ్మా కొన్ని సందర్భాల్లో భూ ఉపరితలాన్ని చేరకముందే మార్గ మధ్యంలోనే ఘనీభవిస్తుంది. ఫలితంగా పటల అంతర్భాగంలో వివిధ రకాల అగ్నిపర్వత సంబంధ భూ స్వరూపాలు ఏర్పడతాయి. ప్రత్యేక ఆకృతి లేని విశాల భూ స్వరూపాలను ‘బాథొలిథ్’ అంటారు. పటలంలోని శిలా పొరలకు సమాంతరంగా మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడే భూస్వరూపాలు ‘సిల్స్’. శిలా పొరలకు అడ్డంగా క్షితిజ లంబదిశలో మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడే భూస్వరూపాలు ‘డైక్స్’. సాసర్ ఆకారంలో ఉండే భూ స్వరూపాలు ‘లాకోలిథ్’. అలల మాదిరి ఆకృతి ఉన్న భూ స్వరూపాలు ‘ఫాకోలిథ్’.

ప్రాక్టీస్ బిట్స్

1. దక్కన్ పీఠభూమి ఏ రకమైన మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడింది? - బసాల్ట్
2. భారతదేశంలో క్రియాశీలక అగ్నిపర్వత ప్రక్రియ సంభవిస్తున్న ఏకైక ప్రాంతం? - బారెన్ దీవులు (అండమాన్)
3. నిశ్శబ్దంగా లావా ఉద్భేదనం ఏ ప్రాంతంలో సంభవిస్తుంది? - ఐస్‌లాండ్
4. ‘మధ్యధరా సముద్ర ‘లైట్ హౌస్’గా పిలిచేది? - స్ట్రాంబోలి అగ్నిపర్వతం
5. భూపటలంలో క్షితిజ సమాంతరంగా ఏర్పడే అగ్ని పర్వత సంబంధ భూ స్వరూపాలను ఏమని పిలుస్తారు? - సిల్స్
Published date : 13 Oct 2015 05:02PM

Photo Stories