Skip to main content

తెలంగాణలో శైవమతం

తెలంగాణలో శైవంతోపాటు వైష్ణవ మతం కూడా అభివృద్ధి చెందింది. కాకతీయులు శైవ మతాన్నే అనుసరించినప్పటికీ వారి రాజచిహ్నాలైన వరాహం, గరుడ.. రెండూ వైష్ణవ చిహ్నాలే.పతాపరుద్రుడి భార్య లకుమాదేవి కరీంనగర్‌లో రామనాథ ఆలయం నిర్మించారు. ప్రజలు వైష్ణవానికి సంబంధించిన వ్రతాలను జరుపుకున్నారు. రామాయణం, మహాభారతం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం, కృష్ణ చరిత్ర, బాలభారతం లాంటి రచనలు చేశారు.
కాలాముఖ శాఖ
తెలంగాణలో మొదట ‘కాలాముఖ’ శైవం వ్యాప్తిలో ఉంది. వీరు శ్రీశైలాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. కల్యాణి చాళుక్యరాజైన సోమేశ్వరుడు, కాకతీయులు ఈ మతశాఖను ఆదరించారు. ఆ తర్వాత వేములవాడ (కరీంనగర్ జిల్లా), అలంపూర్(మహబూబ్‌నగర్ జిల్లా) ప్రాంతాల్లో కాలాముఖ శైవం విస్తరించింది. ఇక్కడ వీరి మఠాలున్నాయి. వీరి క్షేత్రాల్లో ‘సింహపరిషత్’, ‘శక్తి పరిషత్’లను ఏర్పాటు చేసి విద్య నేర్పించేవారు. వీటిని వీరశైవుల అనుభవ మండపాలు, గోళకీ మఠస్థుల విద్యా మండపాలతో పోల్చవచ్చు. వీరు మఠాలతో పాటు సత్రాలను కూడా నెలకొల్పి చదువులు చెప్పారు. అన్నదానం చేశారు. వీరి పాండిత్యం, తపఃసిద్ధి కాకతీయులను ఆకర్షించింది. వీరు కాకతీయ రాజులకు గురువులుగా శైవదీక్షలను ఇచ్చారు. శ్రీశైలంలోని మల్లికార్జున మఠాధిపతి రామేశ్వర పండితులు.. బేతరాజు దుగ్గరాజు, రెండో ప్రోలరాజుకు శివదీక్ష ఇచ్చారు. కాలాముఖాచార్యులు కూడా అనేక మందికి శివదీక్ష ఇచ్చారు. కాకతీయులు మొదట జైన మతాన్ని అనుసరించారని ప్రతీతి. ఆ తర్వాత కాలాముఖ శైవమతాన్ని ఆదరించారు.
ప్రతి కాలాముఖ మఠం ఒక గొప్ప విద్యాకేంద్రంగా వర్థిల్లింది. ఇందులో తర్కం, వ్యాకరణం, జ్యోతిషం, మీమాంస శాస్త్రాలను బోధించేవారు. అలంపూర్‌లో ‘బ్రహ్మపురి’ అనే ఘటిక (వైదిక పాఠశాల) ఉన్నట్లు అక్కడ వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఇది కాలాముఖ శాఖకు చెందిన ఘటికగా నిర్ధారించారు. ఈ శాసనంలో ‘ఘటిక అధిపతి’ అనే అర్థంతో ‘గదాశశి’ పదాన్ని ఉపయోగించారు. 1119 కాలం నాటి పేరూర్ శాసనంలో ప్రజలందరూ సమావేశమై చదువుకునే వారని, ప్రతి పిల్లవాడికి హెర్జుంక (నాణెం) చొప్పున దానం చేయాలని, ఆ ధనాన్ని కుప్పన భట్టోపాధ్యాయునికి చెల్లించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు.
ఘటికలో 14 రకాల విద్యలు నేర్పేవారు. వీటిలో వేద వేదాంగాలు, ధర్మసూత్రాలు, న్యాయ, వైశేషికాలు, పురాణాలు ముఖ్యమైనవి. ఈ కాలానికి చెందిన పండితులందరూ చతుర్థ కులస్థులు (శూద్రులు)గా తెలుస్తోంది. కల్యాణి చాళుక్య రాజైన మూడో సోమేశ్వరుడు, కాకతీరుద్రుడు రాజనీతి గ్రంథాలు రాశారు. బద్వేల్ ప్రాంతానికి చెందిన కాకతీయ సామంతుడు బద్దెన కూడా రాజనీతి గ్రంథం, సుమతీ శతకం రాశాడు. గోనబుద్ధారెడ్డి, భాస్కరుడు, నన్నెచోడుడు మొదలైన వారందరూ చతుర్థ కులస్థులేనని తెలుస్తోంది. భీమయ పాండ్య ‘మార్గదేశీ’ కవితలు రాశాడు. కాలాముఖులు తెలంగాణా ప్రాంతంలో అనేక చోట్ల ‘బ్రహ్మపురి’ పేరుతో ఘటికలు నడిపినట్లుగా ఆధారాలున్నాయి.
కర్ణాటకలో కల్యాణి చాళుక్యుల పతనం తర్వాత కాలాముఖ శైవం ప్రాభవం కోల్పోయింది. దీని స్థానంలో బసవేశ్వరుడు వీరశైవాన్ని అభివృద్ధి చేశాడు. తెలంగాణలో కాకతీయులు బలపడిన తర్వాత గణపతి దేవుడి కాలం నుంచి ‘గోళకీ మఠం’ ప్రాచుర్యంలోకి వచ్చింది. 13వ శతాబ్దంలో కాలాముఖ మతం క్షీణించింది.
పాశుపత శైవం
గణపతి దేవుడి కాలంలో పాశుపతం ప్రాచుర్యంలోకి వచ్చింది. దాహాల దేశానికి చెందిన గోళకీ మఠ శైవాచార్యులు కాకతీయుల కాలంలో పాశుపత శైవం (శైవ మతంలోని ప్రాచీన శాఖ) వ్యాప్తికి పాటుపడ్డారు. ఈ మఠాధిపతి ‘విశ్వేశ్వర శంభు’ మొదట గణపతి దేవుడికి శివదీక్ష ఇచ్చారు. ఆ తర్వాత రుద్రమదేవి, రెండో ప్రతాపరుద్రుడు కూడా ఈయన ద్వారా శివదీక్ష తీసుకున్నారు. కాకతీయుల ఆదరణతో విశ్వేశ్వరుడు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో గోళకీ మఠాలు స్థాపించాడు. అనేక శివాలయాలు నిర్మించాడు. వీటికి అనుబంధంగా విద్యాలయాలు, సత్రాలను ఏర్పాటు చేసి పాశుపత మతాన్ని ప్రచారం చేశాడు. ఏలేశ్వరం (నల్గొండ), వేములవాడ (కరీంనగర్), కాళేశ్వరం (కరీంనగర్), శ్రీశైలం (కర్నూలు), భట్టిప్రోలు (గుంటూరు) తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
రుద్రమదేవి వేయించిన ‘మల్కాపురం’ శాసనంలో గోళకీ మఠాల చరిత్ర, ఏడు తరాల పీఠాధిపతుల గురించి పేర్కొన్నారు.
గోళకీ మఠ చరిత్ర: ‘మల్కాపురం’ శాసనం ప్రకారం గోళకీ మఠాధిపతులు భగీరథి, నర్మదా నదుల మధ్య ఉన్న దాహాల దేశానికి చెందినవారు. ఈ వంశానికి చెందిన సద్భావన శంభు ‘శైవ సిద్ధాంతాన్ని’ ప్రతిపాదించి గోళకీ మఠాన్ని స్థాపించాడు. ఇతడికి కాలాచూరి యువరాజు ‘దేవుడు’ మూడు లక్షల గ్రామాలున్న ఒక రాష్ట్రాన్ని బహూకరించాడు. సద్భావన శంభు గోళకీ వంశస్థుడనీ, భిక్షు మఠ సంతతికి చెందినవాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అందువల్ల ఈ మఠానికి ‘గోళకీ మఠం’గా పేరు వచ్చింది. సోమ శంభు, నామ శంభు, ధర్మ శంభు అనేవారు గురువులుగా మారారు. ధర్మశంభు కుమారుడే విశ్వేశ్వరశంభు. ఇతడు గొప్ప వేద పండితుడు. ఈ గురువులందరూ లక్ష గ్రామాలను భిక్షగా పొందిన గురువుల వారసులుగా ప్రసిద్ధి చెందారు. వీరు కాకతీయులతో పాటు ఛేది (ఒడిశా), మాళ్వా (మధ్యప్రదేశ్), చోళ (తమిళనాడు) వంశ రాజులకు కూడా రాజగురువులుగా ఉన్నట్లు ఆధారాలున్నాయి.
గణపతి దేవుడి కుమార్తె రుద్రమదేవి 1261 మార్చి 25న విశ్వేశ్వర శంభుకు గుంటూరు జిల్లాలోని మందడంతో పాటు కృష్ణలంకను దానం చేసి మల్కాపురం శాసనం వేయించారు. అక్కడ విశ్వేశ్వర శంభు శుద్ధ శైవ మఠం స్థాపించి శివాలయాన్ని నిర్మించాడు. దీనికి అనుబంధంగా వేదశాస్త్ర ఆగమ విద్యాలయం, సత్రం, ప్రసూతి వైద్యశాల (దేశంలోనే తొలి ప్రసూతి వైద్యకేంద్రం)ను ఏర్పాటు చేశాడు. ఇతడు గొప్ప ప్రజ్ఞాశాలి అని, పాశుపత శాఖకు చెందినవాడని ‘త్రిపురాంతక శాసనం’లో పేర్కొన్నారు. ఈ మఠానికి చెందిన శైవాచార్యులు గొప్ప పండితులనీ, పవిత్ర జీవితం గడిపేవారనీ ఈ శాసనం ద్వారా తెలుస్తోంది.
గోళకీ మఠ శాఖలు: కాళేశ్వరం, త్రిపురాంతకం, శ్రీశైలం, వేములవాడ, ఏలేశ్వరం మొదలైన ప్రదేశాల్లో గోళకీ మఠ శాఖలు ఉండేవి. వీటి పోషణకు కాకతీయులు ‘పొన్న’ గ్రామాన్ని దానం చేశారు. గణపతి దేవుడు విశ్వేశ్వర శంభుకు గురుదక్షిణగా ‘తాండ్రకోట’ గ్రామాన్ని ఇచ్చాడు. కాకతీయుల పతనానంతరం తెలంగాణ తురుష్కుల వశమైంది. దీంతో గోళకీ మఠాలు పోషణకర్తలు లేక అంతరించి పోయాయి.
ఆరాధ్యశైవం
పాశుపతంతోపాటు కాకతీయుల కాలంలో తెలంగాణలో ఆరాధ్యశైవం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ మతం అతి ప్రాచీన కాలం నుంచే ప్రచారంలో ఉన్నట్లు ఆరాధ్య శైవుల నమ్మకం. ఈ మత స్థాపకులుగా ద్వాదశాచార్యులను పేర్కొంటారు.
ద్వాదశాచార్యులు:
సిద్ధత్రయం:
మరళ, ఏకోరామ, రేవణను ‘సిద్ధత్రయం’ అని పిలుస్తారు.
ఆరాధ్యత్రయం: ఉద్దటారాధ్య, వేమారాధ్య, విశ్వ ఆరాధ్య అనే ముగ్గుర్ని ‘ఆరాధ్య త్రయం’గా పేర్కొంటారు.
ఆచార్యత్రయం: నీలకంఠ, హరదత్త, భాస్కరాచార్యను ‘ఆచార్యత్రయం’ అంటారు.
పండితత్రయం: శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, మంచెన పండితుడు ‘పండిత త్రయం’గా ప్రసిద్ధి.
పైన పేర్కొన్న 12 మంది ‘ద్వాదశ ఆచార్యులు’ అని, ఆరాధ్య శైవాన్ని వీరే అభివృద్ధి చేశారని ఆరాధ్యశైవుల నమ్మకం.
వీరశైవం
వీరశైవాన్ని కన్నడ దేశంలో బసవేశ్వరుడు స్థాపించాడు. గణపతి దేవుడు వీరశైవులను అదుపులో పెట్టాడు. ప్రతాపరుద్రుడి కాలంలో ఇది కొద్దిగా ప్రాచుర్యం పొందింది. దీనికి కారణం ప్రతాపరుద్రుడి మంత్రి ఇందులూరి అన్నయ. ఇతడు వరంగల్‌లోని పాలకుర్తి గ్రామానికి చెందినవాడిగా తెలుస్తోంది.
వీరశైవులు అవైదికులు. అంటే కర్మకాండలు, వర్ణ వ్యవస్థ, ఉపనయనం, బ్రాహ్మణ ఆధిక్యత లాంటివాటిని అంగీకరించరు. కానీ పండితారాధ్యుడు భక్తితోపాటు బ్రాహ్మణాన్ని అంగీకరించాడు. ఇతడు ‘భక్తి మీద వలపు, బ్రాహ్మణ్యంబుతో పొత్తు వదలలేను బసవలింగా’ అని చెప్పుకున్నాడు. పండితారాధ్యుడు శైవ మతాన్ని వీరశైవానికి భిన్నంగా తీర్చిదిద్దాడు. కాబట్టి దీన్ని ‘స్మార్తశైవం’గా పేర్కొంటారు. బసవేశ్వరుని వీరశైవ మతాన్ని జంగాలు, సాలె, వీరబలిజ కులస్థులు ఆదరించారు.
స్మార్తశైవం
రామానుజాచార్యులు, బ్రహ్మనాయుడు వల్ల తెలంగాణలో వైష్ణవ మతం అభివృద్ధి చెందిన తర్వాత శైవ, వైష్ణవుల మధ్య సంఘర్షణ ఏర్పడింది. కానీ తిక్కన సోమయాజీ హరిహరనాథుని ఆరాధనను ప్రచారం చేసి మతసామరస్యానికి పాటుపడటం వల్ల వీరి మధ్య వైషమ్యాలు తగ్గి అద్వైత సిద్ధాంతం, స్మార్త విధానం ప్రాచుర్యంలోకి వచ్చాయి.
కాలక్రమంలో బసవేశ్వరుడి వీరశైవం, బ్రహ్మనాయుడి వీరవైష్ణం, పండితారాధ్యుడి వీరశైవ (స్మార్త) ఉద్యమం.. మూడూ పూర్తిగా అంతరించాయి. ఈ ఉద్యమాల పర్యవసానాన్ని గ్రహించిన గణపతిదేవుడు వీరశైవులనుగానీ, వీర వైష్ణవులనుగానీ ప్రత్యేకంగా ఆదరించలేదు. దీంతో తెలంగాణలో మతసామరస్యం నెలకొంది. ప్రజలు అన్ని మతాలను ఆదరిస్తూ, అన్ని క్షేత్రాలను దర్శించారు. అలంపురం, కొల్లాపురం, వేములవాడ, కొలనుపాక, హన్మకొండ గొప్ప పుణ్యక్షేత్రాలుగా వర్థిల్లాయి. ఈ క్షేత్రాలను లక్షలాది భక్తులు దర్శించేవారు.
జైనమత పతనం..
తెలంగాణలో జైనమతం పతనం కావడానికి అనేక కారణాలున్నాయి. శైవులతో వీరికి వైషమ్యాలు పెరిగాయి. ‘కాలముఖులు’ కాళేశ్వరాన్ని కేంద్రంగా చేసుకున్నారు. శైవులు జైనులతో వాదన చేసి వారిని ఓడించారు. తమ మహిమలతో శైవులు సామాన్య ప్రజలను ఆకర్షించారు. వీరశైవ స్థాపకుడైన బసవేశ్వరుడు జైనమతాన్ని బాగా దెబ్బతీశాడు. జైన, శైవ సంఘర్షణల వల్ల జైనులు పతనమయ్యారు. ఈ సంఘర్షణ ఎక్కువగా కాకతీయుల కాలంలోనే జరిగింది. దేవదాసయ్య అనే శైవ నాయకుడు తన మహిమలతో పొట్ల చెరువు (పటాన్ చెరువు)లో 500 జైన కేంద్రాలను నాశనం చేసినట్లుగా కథనం ప్రచారంలో ఉంది. కాకతీయ రాజైన ‘గణపతిదేవుడు’ అనేక జైనపండితులను శిక్షించి వారి గ్రామాలను తగులబెట్టినట్లు గద్వాలలోని పూడూరు శాసనంలో పేర్కొన్నారు.
జైన శిల్పకళ: జైనమతం వాస్తుకళాభివృద్ధిలో ప్రముఖపాత్ర పోషించింది. వాస్తు, శిల్ప కళలకు సంబంధించి జైనమతం తెలంగాణ ప్రజలకు అమోఘమైన సేవలందించింది.
జైనమత ప్రాధాన్యం: ఇటీవల భారత ప్రభుత్వం జైనమతానికి మైనార్టీ హోదా కల్పించింది. ప్రస్తుతం దేశంలో మైనార్టీ గుర్తింపు పొందిన మతాలు ఆరు ఉన్నాయి. అవి.. ఇస్లాం, క్రైస్తవం, పార్శీ, సిక్కు, బౌద్ధం, జైనం. జైనమతం రాకతో సామాన్యులందరికీ విద్యావకాశాలు లభించాయి. వీరి ఆరాధ్య విద్యాదేవతనే హిందువులు సరస్వతీదేవిగా పూజిస్తున్నారు. అంటే విద్యాదేవతను గుర్తించింది మొదట జైనులేనని గమనించవచ్చు. ప్రతి సమావేశంలో దీపారాధన లేదా జ్యోతి ప్రజ్వలన చేయడం వీరి ఆచారం. ఇప్పటికీ భారతీయ సమాజంలో ఈ విధానం సజీవంగానే ఉంది. ప్రస్తుతం దీన్ని అనేక దేశాల్లో చూడవచ్చు.
జైనులు విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం ద్వారా వైశ్యులను తమవైపు తిప్పుకున్నారు. జంతు బలులు, జీవహింసను నిషేధించారు. శూద్రులకు యజ్ఞయాగాదులు నిష్ర్పయోజనం అని చెప్పారు. బ్రాహ్మణులకు వ్యతిరేకులయ్యారు.

మాదిరి ప్రశ్నలు

1. కింద పేర్కొన్నవారిలో ‘ఆరాధ్యత్రయం’లోని వారెవరు?
1. ఉద్దట
2. వేమా
3. విశ్వ 
4. హరదత్త
ఎ) 1, 2, 3
బి) 1, 3, 4
సి) 2, 3, 4
డి) 3, 4

Published date : 06 Oct 2015 04:01PM

Photo Stories