Skip to main content

మొగలుల పాలనలో గోల్కొండ రాజ్యం

గోల్కొండ రాజ్యంలో కుతుబ్‌షాహీల పరిపాలన 1687లో అంతరించింది. మొగలు పాలకులు గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని తమ రాజ్యంలో 21వ సుబాగా మార్చారు. బీజాపూర్‌ను గోల్కొండతో కలిపి దక్కన్ ప్రాంతాన్ని ఆరు సుబాలుగా విభజించారు. అవి.. ఖ్వాండేష్, బీరార్, హైదరాబాద్, మచిలీపట్నం, బీజాపూర్, ఔరంగాబాద్.
పశ్చిమాంధ్ర ప్రాంతాలు హైదరాబాద్ సుబాలో, తీరాంధ్ర ప్రాంతాలు మచిలీపట్నం సుబాలో భాగంగా ఉండేవి. ఔరంగజేబు కాలంలో హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు రాచబాట(దండు బాట) నిర్మించారు. మార్గమధ్యలో అనేక గుమ్మటాలు, మసీదులు, విశ్రాంతి భవనాలను నిర్మించారు. ఇవి ఇప్పటికీ పెద్ద అంబర్‌పేట, బాట సింగారం,  తుఫ్రాన్ పేట, దండు మల్కాపూర్, కొయ్యలగూడెం, చౌటుప్పల్, గుండ్రాంపల్లి, చిట్యాల, నార్కట్‌పల్లి, పామనగుండ, మునగాల, వాడపల్లి ప్రాంతాల్లో ఉన్నాయి.
ఈ కాలంలో దక్కన్, మొగల్ సంస్కృతి కలిసి మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. తెలంగాణ 1687-1724 వరకు 37 ఏళ్లపాటు మొగలుల ప్రత్యక్ష పాలనలో ఉంది. వారి పాలనలో పన్నుల భారం అధికంగా ఉండేది. దేవాలయాల విధ్వంసం, పిండారీల దాడులు కొనసాగాయి. 1707లో ఔరంగజేబు మరణించాడు. తర్వాతి కాలం(1708-12)లో ఢిల్లీని పాలించిన రాజులు అసమర్థులు. దీంతో దక్కన్‌లో అనేక తిరుగుబాట్లు వచ్చాయి. ఔరంగజేబు తర్వాత మౌజం లేదా బహదూర్ షా-1,  జహాందర్‌షా, ఫరూక్ సియర్, మహ్మద్ షా ఢిల్లీని పాలించారు. ఫరూక్ సియర్‌ను సయ్యద్ సోదరులుగా పిలిచే హసన్ అలీ, ఖాన్ అబ్దుల్లా హత్య చేశారు. వీరికి దక్కన్ సుబేదారు మీర్ ఖమ్రూద్దీన్ సహాయం చేశాడు. 1724లో హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు మహ్మద్ షా ఖమ్రుద్దీన్‌కు అనుమతిచ్చాడు.
 
సర్వాయి పాపన్న
పాపన్న 1650లో వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని ఖిల్లాషాపూర్ గ్రామంలో జన్మించాడు. ఇతడు గౌడ కులానికి చెందినవాడు. చిన్నతనంలోనే తండ్రి దూరమయ్యాడు. తల్లి సర్వమ్మ పశువుల కాపరి. ఇతడు గొప్ప శైవ భక్తుడు. పాపన్నపై తల్లి ప్రభావం ఎక్కువ.  ఎల్లమ్మ దేవతను ఆరాధించేవాడు. బౌద్ధుల పట్ల మతసహనం చూపేవాడు. తురుష్క పాలకుల దౌర్జన్యాలను ఎదిరించాడు.  నాటి పాలకులపై తిరుగుబాటులో పాపన్నకు హసన్,  హుసేన్, ఇమాం, దూదెకుల పీరు, కుమ్మరి గోవిందన్న, చాకలి సర్వన్న, మంగలి మాసన్న తోడ్పడ్డారు.
సర్వాయిపేటలో కోటను నిర్మించి, తిరుగుబాటు ప్రారంభించాడు. తర్వాత ఖిల్లాషాపూర్‌లో మట్టికోట నిర్మించాడు. మహ్మదీయ ప్రభువులపై తిరుగుబాటుకు పాపన్న సన్నాహాలు చేస్తున్న విషయం కొలనుపాక ఫౌజుదారుకు తెలిసింది. దీంతో అతడు పాపన్నను అణచివేయడానికి ఖాసీంఖాన్ అనే సైన్యాధిపతిని పంపాడు. యుద్ధంలో పాపన్న ఖాసీంను మట్టుబెట్టాడు. తర్వాత మహ్మదీయ సైన్యం పాపన్న లేని సమయంలో దాడిచేసి కోటను నేలమట్టం చేసింది. దీంతో పాపన్న పటిష్టమైన రాతి కోటను నిర్మించాడు. తర్వాత ఔరంగజేబు అతడిపై రస్తుం దిల్‌ఖాన్‌ను పంపాడు. పాపన్న చేతిలో రుస్తుం కూడా మరణించాడు. ఔరంగజేబు మరణానంతరం బహదూర్‌షా-1  ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు.
 ఈ కాలంలో పాపన్న భువనగిరి కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1708 ఏప్రిల్ 1న ఓరుగల్లు కోటను ముట్టడించాడు. తాటికొండపై మరో కోటను నిర్మించాడు. 1709లో గోల్కొండను ఆక్రమించాడు. గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక తెలుగు వీరుడు సర్దార్ పాపన్న. ఇతడి విజృంభణను అడ్డుకోవడానికి బహదూర్‌షా యూసఫ్‌ఖాన్, రుజ్ బహీనీని పంపాడు. వీరితో జరిగిన యుద్ధంలో పాపన్న మరణించాడు. పాపన్న రాజధాని ఖిల్లాషాపూర్. ఇతడు సర్వాయి పాపడు లేదా పాపన్నగా ప్రసిద్ధి చెందాడు.
బార్‌బరా డి.మెట్కాఫ్, థామస్ ఆర్.మెట్కాఫ్ అనే చరిత్రకారులు సర్దార్ పాపన్న గురించి వివరాలు తెలిపారు. జె.ఎ.బోయల్ అనే ఆంగ్లేయ చరిత్రకారుడు పాపన్నపై పరిశోధనలు చేశాడు. వీరి రచనల ప్రకారం.. పాపన్న గెరిల్లా  పద్ధతిలో పోరాడాడు. 30 ఏళ్ల పాలనా కాలంలో భువనగిరి, నల్లగొండ, తాటికొండ, వరంగల్, కొలనుపాక, చేర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రాంతాలు ఇతడి స్వాధీనమయ్యాయి. పాపన్న 1687లో తాటికొండ, వేములకొండ, ఖిల్లాషాపురం దుర్గాలను నిర్మించాడు.
 
గోండ్వానా రాజ్యం
ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రజాతితోపాటు పేర్కొన్న పుళిందులనే గోండులుగా వ్యవహరిస్తున్నారు. వీరు మహారాష్ర్ట జిల్లాలతోపాటు బస్తర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్, ఉట్నూరు, చెన్నూరు ప్రాంతాలు గోండ్వానా రాజ్యంలో అంతర్భాగాలు.
గోదావరి- చంబల్ లోయ మధ్య ప్రాంతాన్ని గోండులు పాలించారు. గోండ్వానా రాజ్యం గురించి మేజర్ లూసీ స్మిత్ ‘గెజిట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఆదిలాబాద్’ పుస్తకంలో తెలిపారు. 870 నుంచి సుమారు తొమ్మిది శతాబ్దాలు వీరు పాలించారని తెలిపారు. ఈ రాజులు 1750 వరకు గోండ్వానాను  పాలించినట్లు ఆధారాలున్నాయి. లూసీ స్మిత్ గెజిట్‌లో 1240-1751 మధ్య పాలించిన ఇరవై మంది రాజుల వివరాలున్నాయి.
1437-62ల మధ్యకాలంలో పాత చాందాను నిర్మించారు. 1572-97 మధ్యకాలంలో బాబీజీ బల్లాల్‌షా కొత్త చాందాను నిర్మించాడని అంకమరాజు కథ వల్ల తెలుస్తోంది.
ఔరంగజేబు మరణం తర్వాత  గోండులు మొగలులను ఎదిరించి స్వతంత్రించారు. తర్వాత మరాఠా రాజులు వీరి రాజ్యంపై ఆధిపత్యం వహించారు. అనంతరం బ్రిటిషర్లు గోండ్వానాను వశపరచుకొన్నారు. ఆ తర్వాత వీరి రాజ్యం నైజాంలో భాగమైంది.
Published date : 12 Dec 2015 05:07PM

Photo Stories