Skip to main content

జీవావరణ శాస్త్రం ప్రాధాన్యతాంశాలు

భూమిపై ఉన్న ఘన, వాయు, ద్రవ సమ్మేళనాన్ని పర్యావరణంగా చెప్పొచ్చు. కాబట్టి ముందుగా పర్యావరణంలోని వివిధ విభాగాలైన వాతావరణం (అట్మాస్ఫియర్), శిలావరణం (లిథోస్ఫియర్), జీవావరణం (బయోస్ఫియర్) గురించి పూర్తి పరిజ్ఞానాన్ని కలిగుండాలి.
జీవావరణం
జీవావరణ శాస్త్రం (ఎకాలజీ) కీలకమైన అంశం. జీవావరణ శాస్త్రం- భావనలు, జాతి, జనాభా, జీవ సమాజం, జీవ మండలం, జీవ గోళం, జీవావరణ వ్యవస్థ, జీవావరణ అనుక్రమం, ఆహార శృంఖలం, ఆహార వల, జీవావరణ పిరమిడ్ వంటి మూల జీవావరణ శాస్త్ర అంశాలను సమగ్రంగా చదవాలి. వీటితో పాటు దేశ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీవావరణ శాస్త్ర వ్యవస్థలు, రకాలు, లక్షణాలు, వాటి ప్రాంతీయ పేర్లకు సంబంధించిన సమాచారం సేకరించాలి.
  • వివిధ జంతువులు, మొక్కలు.. పర్యావరణానికి తగిన విధంగా జీవించేందుకు వీలుగా ఎలాంటి అనుకూలతలను (Adaptations) ప్రదర్శిస్తున్నాయి! అనే దానిపై అవగాహన పెంచుకోవాలి.
ఉదా: ఎడారి మొక్కలు, జంతువుల ప్రత్యేక లక్షణాలు, సముద్ర నీటి చేపల అనుకూలనాలు, వీటితో పాటు ఎగిరే, చెట్లలో, బొరియల్లో నివసించే జీవుల అనుకూలనాల గురించి తెలుసుకోవాలి.
జీవ వైవిధ్యం
జీవావరణ శాస్త్రానికి సంబంధించి జీవవైవిధ్యం ప్రస్తుతం అధిక ప్రాధాన్యం సంతరించుకున్న అంశం. జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ), భూమిపై ఉన్న విభిన్న జాతులు, జాతిలోని జన్యువులు, ఆవరణ వ్యవస్థల వైవిధ్యాల గురించి బాగా చదవాలి. ప్రస్తుతం జీవ వైవిధ్యం తీవ్రస్థాయి ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. భారీస్థాయిలో జీవుల విలుప్తత (Extinction) సంభవిస్తున్నట్లు అనేక అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆసియా చీతా, డోడో పక్షి, పాసెంజిర పక్షి, ఎల్లో హెడెడ్ మకా వంటి జంతువులు అంతరించాయి. మరిన్ని జంతువులు అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5 వేల పులులు మాత్రమే ఉన్నాయి. వాటిలో సగం భారతదేశంలోనే ఉన్నాయి. భవిష్యత్‌లో సరైన సంరక్షణ చర్యలు తీసుకోకుంటే వన్యజీవుల పరిరక్షణ కష్టంగా మారుతుంది. ఫలితంగా రాబోయే రోజుల్లో కొన్ని వన్యప్రాణి జాతులు పూర్తిగా అంతరించే ప్రమాదం పొంచి ఉంది. ఖడ్గమృగం, ఆసియా సింహం, కలివి కోడి, ఉడుము, కృష్ణజింక, ఊదా రంగు తల బాతు, బట్టమేక పక్షి, రాబందులు, కొన్ని సర్పజాతులు, అనేక వలస పక్షులు పూర్తిగా అంతరించే స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో జీవ వైవిధ్యం-వన్యజీవుల అంశంపై ప్రత్యేక అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా జీవ వైవిధ్య స్థాయిలు, రకాలు, ఉపయోగాలు, ప్రమాదాలు, సంరక్షణ పద్ధతులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంరక్షణ చర్యలు, సంస్థలు, ఒప్పందాల గురించి తెలుసుకోవాలి.
  • రక్షిత ప్రాంతాల కార్యక్రమాన్ని కూడా బాగా చదవాలి. దేశంలోని జాతీయ పార్కులు, అభయారణ్యాలు, కన్జర్వేషన్ రిజర్వులు, పులుల రిజర్వులు, కమ్యూనిటీ, బయోస్ఫియర్ రిజర్వులు, పులులు, ఎలిఫెంట్ రిజర్వులు గురించి తెలుసుకోవాలి.
పర్యావరణ కాలుష్యం
పర్యావరణంలో మరో ముఖ్య అంశం పర్యావరణ కాలుష్యం.
  • ప్రస్తుతం మనం పీల్చే గాలి, తాగేనీరు, తినే ఆహారాలు కలుషితమవుతున్నాయి.
  • ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. పర్యావరణ సంబంధిత అంశాల సూచీలో 178 దేశాల జాబితాలో భారతదేశం 155వ స్థానంలో ఉంది.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన మొదటి 20 నగరాల్లో 13 భారతదేశంలోనే ఉండటం గమనార్హం. దీన్ని బట్టి దేశంలో పర్యావరణ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
  • ఈ నేపథ్యంలో గాలి కాలుష్యం, జల, భౌమ, శబ్ద, కాంతి కాలుష్యాలు, కారకాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, నివారణ పద్ధతులను చదవాలి. కాలుష్యానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ నివేదికలు, కాలుష్య సంఘటనల గురించి తెలుసుకోవాలి.
  • ఈ మధ్య కాలంలో భారత్‌లో పెరుగుతున్న ఘన వ్యర్థ పదార్థాల ఉత్పాదన దృష్ట్యా పర్యావరణంలో ఈ అంశం కూడా కీలకంగా మారింది. సాధారణ ఘన వ్యర్థ పదార్థాలతో పాటు ఎలక్ట్రానిక్, బయోమెడికల్ వ్యర్థాలు, అణు, రేడియో, రసాయనిక వ్యర్థాల గురించి, వాటి ఉత్పాదన, నిర్వహణలో దేశంలో రాష్ట్రాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి.
  • వివిధ రకాల ఘన వ్యర్థ పదార్థ నిర్వహణ పద్ధతులు (ఇన్సిపిరేషన్, రీసైక్లింగ్, కంపోస్టింగ్...), వాటి సూత్రాలపై అవగాహన అవసరం.
శీతోష్ణస్థితి మార్పులు
శీతోష్ణస్థితి మార్పు మరో ముఖ్యమైన అంశం. ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం, ఉపరితల ఉష్ణోగ్రతల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, తీవ్రమవుతున్న తుఫాన్లకు ప్రధాన కారణం శీతోష్ణస్థితి మార్పు (Climate change).
  • శీతోష్ణస్థితి మార్పుపై పూర్తిస్థాయి అవగాహనకు సౌరపుటం, గ్రీన్‌హౌస్ ప్రభావం, భూతాపం, గ్రీన్‌హౌస్ ఉద్గారాలు, వాటి మూలాలు వంటి విషయాలపై ప్రాథమిక అవగాహన అవసరం. దీంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలు గురించి తెలుసుకోవాలి.
  • ఇంటర్ గవర్న్‌మెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (IPCC) నివేదికలతో పాటు జాతీయస్థాయిలో Indian Network For Climate Change Assessment (INCCA) విడుదల చేసిన నివేదికల సమాచారం అవగాహన కలిగుండాలి.
  • 1992 ధరిత్రీ సదస్సు నుంచి 2015 (డిసెంబరు) పారిస్‌లో జరగనున్న COP-21 సమావేశం వరకు అన్ని సమావేశాల సమాచారం సేకరించుకోవాలి. సుస్థిర అభివృద్ధి, ఓజోన్ పరిరక్షణ, అటవీకరణ, సామాజిక అడువులు, జియోఇంజనీరింగ్, బయోప్రాస్పెక్టింగ్, బయోరెమిడియేషన్, దేశంలోని ముఖ్యమైన వన్యజీవులు, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు (ఉదా: స్టాక్‌హోం ఒప్పందం, బాన్ ఒప్పందం, బేసల్ కన్వెన్షన్, నగోయా ప్రొటోకాల్, కార్టజీన్ ప్రొటోకాల్, రామ్సార్ కన్వెన్షన్, మాంట్రియల్ ప్రొటోకాల్ మొదలైనవి) గురించి అధ్యయనం చేయాలి.
  • వీటితో పాటు అవి అమల్లోకి వచ్చిన తేదీలు, ఎందుకు ఏర్పడ్డాయి? వంటి విషయాలపై కూడా అవగాహన కలిగి ఉండాలి. అదనంగా దేశంలో పర్యావరణ చట్టాలు, శాసనాలు, వాటి అమలు, వివిధ విభాగాల్లోని అత్యున్నత అధికారుల గురించి తెలుసుకోవడం పరీక్షల్లో లాభిస్తుంది.

మాదిరి ప్రశ్నలు

1. జీవావరణ శాస్త్ర ప్రమాణం?
1) జీవావరణ వ్యవస్థ
2) ఆహార వల
3) జీవావరణ పిరమిడ్
4) ఆహార శృంఖలం

Published date : 25 Sep 2015 03:57PM

Photo Stories