Skip to main content

పురాణాల్లో ఆంధ్రుల ప్రస్తావణ

ఆంధ్రులు నివసించే దేశం కాబట్టి ఆంధ్రదేశం అనే పేరు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వేదయుగం నాటి ‘ఐతరేయ బ్రాహ్మణం’ ఎంత ప్రాచీనమైందో ‘ఆంధ్రజాతి’ కూడా అంతే ప్రాచీనమైంది. క్రీ.పూ. 1500 నాటి ఐతరేయ బ్రాహ్మణం ‘ఆంధ్ర’ పదాన్ని జాతిపరంగా వాడింది. ‘సూత్ర’ సాహిత్యాన్ని రచించిన ‘ఆపస్తంభుడు’ ఆంధ్రుల గొప్పతనాన్ని వివరించాడు. ఆయనతో పాటు గొప్ప తాత్వికుడైన ‘దిగ్నాగుడు’, నిఘంటు రచయితైన అమరసింహుడు, మహాయాన మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించిన నాగార్జునుడు వంటి వారంతా ప్రాచీనాంధ్రుల గురించి వివరించారు. ఇతిహాస, పురాణాలు కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించాయి. క్రీ.పూ. 256 నాటి అశోకుని 13వ శిలాశాసనం ఆంధ్రులను మౌర్య సామ్రాజ్యంలో నివసించేవారిగా (ఆంధ్రుల రాజ విషయం) పేర్కొంది.
విదేశీ సందర్శకులు సైతం..
క్రీ.పూ. నాలుగో శతాబ్దంలో మౌర్య ఆస్థానానికి గ్రీకు రాయబారిగా వచ్చిన మెగస్తనీస్.. ఆంధ్రులకు గొప్ప సైనిక బలముందని పేర్కొన్నాడు. మెగస్తనీసుతోపాటు ఏరియన్, టాలెమీ, ప్లినీ వంటి వారి గ్రంథాల్లో కూడా ఆంధ్రుల ప్రస్తావనలున్నాయి. పేరు తెలియని గ్రీకు నావికుని ‘ఎర్ర సముద్రంపై దినచర్య’ ప్రకారం క్రీ.శ. ఆరో శతాబ్దినాటికే దక్షిణ భారతదేశం విదేశీయులతో వర్తక వ్యాపారాలు నిర్వహిస్తోంది. ప్లినీ తన ‘నేచురల్ హిస్టరీ’లో ఆంధ్రులను గొప్ప ప్రాముఖ్యత సంతరించుకున్న వారిగా అభివర్ణించాడు. ఆంధ్రులకు 30 కోటలు,  లక్ష కాల్బలం, రెండు వేల గుర్రాలు, వెయ్యి ఏనుగులున్నట్లు పేర్కొన్నాడు. మౌర్యుల తర్వాత ఆంధ్రులదే పటిష్టమైన సైన్యమని ప్లినీ తెలిపాడు.
 
బౌద్ధ సాహిత్యాల్లో..
బౌద్ధ మత సాహిత్యమైన ‘భీమసేన జాతకం’ ఆంధ్రుల నివాసానికి సంబంధించి ఆంధ్ర పదాన్ని ప్రస్తావించగా. ‘సెరివణిజ జాతకం’ తేలివాహన నదిపై ఉన్న ‘ఆంధ్రనగరి’ గురించి పేర్కొంది. కృష్ణా నదిపై ఉన్న ధాన్యకటకమే సెరివణిజ జాతకంలోని ఆంధ్రనగరి అని అధిక మంది చరిత్రకారుల భావన. ఆంధ్ర దేశం గురించి మొదటి శాసన ప్రమాణం.. మహారాజ శివస్కంధ వర్మ (క్రీ.శ.300) మైదవోలు తామ్ర శాసనం. ఇది ఆంధ్ర పథానికి రాజధానిగా ధాన్యకటకాన్ని పేర్కొంది. దీన్నిబట్టి ఆంధ్ర పథమే ఆంధ్ర దేశానికి మూలమని చెప్పొచ్చు.
 
పురాణాలు
పురాణ సాహిత్యం ఆంధ్రులు, సబరులు, పులిందళలను దక్షిణ భారతదేశ వాసులుగా పేర్కొంది. పాళీ సాహిత్యంలో ఆంధ్రులను అంధకులుగా సంబోధించారు. ఈ సాహిత్యాల ఆధారంగా ఆంధ్రులు మొదట దండకారణ్య ప్రాంతంలో నివసించి, తర్వాత కాలంలో తూర్పు తీరాంధ్రంలో స్థిరపడినట్లు తెలుస్తోంది. ఆంధ్రులు నివసిస్తున్న ప్రాంతాలే ఆంధ్ర పథ, ఆంధ్రదేశాలని  పురాణ, సంస్కృత, పాళీ సాహిత్యాలు వివరిస్తున్నాయి.
 
ఆంధ్ర జనపదాలు
బౌద్ధ సాహిత్యంలో సుత్తనిపాతంపై వ్యాఖ్యాన గ్రంథం అస్సక, ములకలను ఆంధ్ర జన పదాలుగా పేర్కొంది. అస్సక జనపదాన్ని నేటి నిజామాబాద్ జిల్లాగా గుర్తిస్తున్నారు. అస్సక రాజధాని పౌదన్యపురమే నేటి బోధన్.
 
త్రిలింగ దేశం
‘త్రిలింగ దేశం’ అనే పదం ఆంధ్రదేశానికి పర్యాయ పదంగా వాడుకలో ఉంది. శ్రీశైలం (కర్నూలు), ద్రాక్షారామం (తూర్పు గోదావరి జిల్లా), కాళేశ్వరం (కరీంనగర్ జిల్లా), మహేంద్రగిరి (ఒడిశా) ప్రాకారంగా ఉన్న ప్రాంతాన్ని ‘త్రిలింగ దేశం’ అని నిర్ణయించారు. తూర్పు చాళుక్య రాజవంశాల వారు ‘త్రికళింగాధీశ్వర’ అనే బిరుదు ధరించారు.
 
ఆంధ్ర జాతి
ఆంధ్రుల జాతీయతపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఐతరేయ బ్రాహ్మణంలోని ఓ కథ ఆంధ్ర జాతికి సంబంధించిందిగా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం  విశ్వామిత్రుడు యజ్ఞ పశువుగా తీసుకునిపోతున్న బ్రాహ్మణ యువకుడైన శునస్సేపుడిని రక్షించి, ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆశ్రమంలోని వారిని  శునస్సేపుడిని సోదరునిగా స్వీకరించాల్సిందిగా కోరాడు. అయితే దానికి కొందరు నిరాకరించారు. దాంతో కోపించిన విశ్వామిత్రుడు అవిధేయులైన వారిని ఆర్య దేశం నుంచి బహిష్కరించాడు. అలా బహిష్కృతులైన వారే ఆంధ్ర, పుళింద, శబరీ, మూతిచారి జాతుల ప్రజలు. దీని ఆధారంగా అవిధేయత వల్ల పతితులైన ఆర్యులే ఆంధ్రులని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పాటు భాగవతాది పురాణాల్లో అంధకులే ఆంధ్రులని ఒక వాదం ఉంది. ప్రాకృత వాజ్మయం ఆంధ్రులను ‘అంధకులని’ పేర్కొంది.
 
రుగ్వేదంలో..
రుగ్వేదంలో దాసదస్యులు ఆంధ్రులేనని చరిత్రకారుల అభిప్రాయం. ములక, పహ్లవ వంటి తెగలు దక్షిణాపథంలో కనిపిస్తున్నాయి. పహ్లవులు స్థిరపడిన ప్రదేశంలోని పల్లవ బొగ్గే నేటి పల్నాడు అయింది. ఆంధ్రుల నివాస స్థలమే ఆంధ్ర పథంగా జాతక కథల్లో ప్రవేశించింది. అశోకుని శాసనాలు ఆంధ్రులను దాక్షిణాత్యులుగా పేర్కొన్నాయి. కథాసరిత్సాగరంలోని గుణాడ్యుని కథా రచన శాతవాహనుల కాలంలో ప్రాకృత భాషలో జరిగింది. శాతవాహనుల మాతృభాష ప్రాకృతం.  ఆంధ్రులకు దక్షిణాపథంలోని నాగులు, యక్షులు, అస్మకులు, మహిషకులు వంటి తెగలతో సంబంధాలున్నాయి.
 
భిన్న జాతుల సమూహమా!
బౌద్ధ, సింహళ, సయాం దేశాల ప్రాచీన సాహిత్యాలు కృష్ణానది ముఖద్వారాన్ని ‘నాగభూమిగా’ పేర్కొన్నాయి. అమరావతి శిల్పాల్లో నాగులు కనిపిస్తారు. ఆంధ్రులకు సంబంధించిన అనేక గాథల్లో యక్షుల ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి వీరందరూ ఆర్యేతరులే!
గుంటుపల్లి శాసనం కళింగాధిపతి ఖారవేలుణ్ని మహిషకాధిపతిగా పేర్కొంది. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో (మెదక్, నల్గొండ, ధార్వాడ్ జిల్లాల్లో) మహిషికులున్నట్లు పురావస్తు ఆధారాలున్నాయి. భిన్నజాతుల సమ్మేళనం ద్వారా, ఆంధ్రజాతి ఏర్పడిందని సూచించడానికే బహుశా ‘ఆంధ్రాశ్చ బహవః’ అంటూ మహాభారతం నిర్వచించింది. ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రం, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్రులు వాడుతున్న తెలుగు భాషకే ‘ఆంధ్ర భాష’ అని వ్యవహారం ఏర్పడింది.
Published date : 21 Jul 2016 03:36PM

Photo Stories