Skip to main content

ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం.. చరిత్రపై దాని ప్రభావం

భారతదేశ రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌కు భిన్నత్వంతో కూడిన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది కృష్ణా - గోదావరి నదులతో సస్యశ్యామలమైంది.
ఐతరేయ బ్రాహ్మణంలో ‘ఆంధ్రుల’ ప్రస్తావన ఉంది. ఆంధ్రులు క్రీ.పూ. మూడో శతాబ్దంలో దక్షిణాపథం (దక్కను) నుంచి తూర్పు తీరాంధ్రం వరకు విస్తరించి.. విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఈ మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పిన శాతవాహన వంశీయులను పురాణాలు ‘ఆంధ్రభృత్యులు’గా పేర్కొన్నాయి. ఈ వంశం ఆంధ్రజాతి సాంఘిక జీవన పద్ధతికి, సంస్కృతికి పునాదులు వేసింది. ప్రస్తుత ‘ఆంధ్రప్రదేశ్’ ప్రభుత్వ రాజలాంఛనం ‘పూర్ణకుంభం’ శాతవాహనుల కాలం నాటిదే. ‘బ్రాహ్మీలిపి’ ఈ కాలంలో రూపొందింది. ‘ప్రాకృతం’ రాజభాషగా కొంతకాలం వర్ధిల్లింది.
 
భౌగోళిక సహజ మండలాలు
నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమలు, పీఠభూమి ప్రాంతం, తూర్పు తీర మైదానం ముఖ్యమైనవి.

తూర్పు కనుమలు
సముద్ర మట్టానికి వెయ్యి నుంచి మూడు వేల అడుగుల ఎత్తున తూర్పు కనుమలున్నాయి. శ్రీకాకుళంలో తూర్పు కనుమల్ని మహేంద్రగిరులని అంటారు. ఇవి చాలా ఎత్తైవి. విశాఖ జిల్లాలోని బాలకొండలోయల్లో బొర్రా గుహలు, అరకు లోయ ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా అందమైన ప్రకృతి దృశ్యాలతో ‘పాపికొండలు’న్నాయి. దట్టమైన అడవుల్లో వివిధ రకాల పక్షులు, జంతువులు, జలపాతాలు, వివిధ రకాల గనులు, నల్లరేగడి నేలలు, పత్తి, వరి పంటలకు తూర్పు కనుమలు గుర్తింపు సాధించాయి. తూర్పు కనుమల్లో గిరిజన తెగలైన సవరులు, గదబులు, కోయలు, చెంచులున్నారు. కృష్ణా జిల్లాలో కొండపల్లి, సీతానగరం కొండలు, గుంటూరు జిల్లాలోని కొండవీడు, కొండపల్లి, నాగార్జున కొండలు ప్రసిద్ధి. సీతానగరం కొండను చీల్చుకొని విజయవాడ వద్ద కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ నదికి దక్షిణంగా నల్లమలై, ఎర్రమలై అనే రెండు పర్వత శ్రేణులున్నాయి. నల్లమలై పర్వత శ్రేణులు కర్నూలు - మహబూబ్‌నగర్ జిల్లాల్లోకి విస్తరించాయి. నల్లమలై - ఎర్రమలై రెండు పర్వత శ్రేణుల మధ్య సారవంతమైన ‘నంద్యాలలోయ’ ఏర్పడింది. ఈ నల్లమల పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవీ ప్రాంతం ఉంది. చెంచు జాతులు, కొండ తెగల వారికి ఈ పర్వత శ్రేణులు ఆశ్రయమిస్తున్నాయి. నల్లమలైకు సమాంతరంగా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ‘వెలిగొండలు, పాలకొండలు, శేషాచలం’ పర్వత శ్రేణులున్నాయి. కర్నూలు జిల్లా నల్లమలై కొండలపై శ్రీశైలం, అహోబిలం పుణ్య క్షేత్రాలున్నాయి. చిత్తూరు జిల్లా శేషాచలం కొండలపై ‘తిరుపతి’ క్షేత్రం ఉంది. శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం వృక్షాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.

పీఠభూమి
తూర్పు కనుమలకు పశ్చిమ దిశలో సువిశాలమైన చారిత్రక దక్కను పీఠభూమి విస్తరించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 480 - 600 మీటర్ల ఎత్తున ఉంది. ఇది అగ్ని పర్వత సంబంధ కఠిన శిలా ప్రాంతం.  దాదాపు రాయలసీమ ఈ పీఠభూమిలోనే ఉంది. కృష్ణా, తుంగభద్రా నదీ లోయ ప్రాంతంలో దీని ఎత్తు 300 - 450 మీటర్లు. దక్కను పీఠభూమికి తుంగభద్రా - కృష్ణా నదీ లోయ ప్రాంతాలు దక్షిణ దిశలో సరిహద్దు ప్రాంతంగా ఉంటాయి. చారిత్రక ప్రాముఖ్యత సంతరించుకున్న ‘రాయచూర్ దోబ్’ ఇదే ప్రాంతంలో ఉంది. మధ్యపీఠభూమిలో నల్ల సీసపు రాయి, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ‘పలుగురాతి పొరలు’ కనిపిస్తాయి. కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సున్నపురాయి పొరలుంటాయి. కడప, కర్నూలులో ఇనుము విస్తారంగా లభిస్తుంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో మాంగనీస్, నెల్లూరులో అభ్రకం, గుంటూరు జిల్లాల్లో రాగి, కడప, కర్నూలుల్లో ఆస్‌బెస్టాస్, అనంతపురం జిల్లాలో వజ్రాలు (వజ్రకరూరు), వివిధ రకాల ఖనిజాలు లభిస్తున్నాయి. దక్కను పీఠభూమి వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు వాలి ఉన్నందున కృష్ణా, గోదావరి తదితర నదులన్నీ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

నదులు
గోదావరి:
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది పెద్దది. ఇది సహ్యాద్రి కొండలు - పశ్చిమ కనుమల్లో ‘నాసిక్’ సమీపంలో త్రయంబకం’ వద్ద పుట్టింది. ‘గోదావరి’ అంటే ‘నీరు, పాడి ఆవులిచ్చేదని’ అర్థం.  ఈ నది సుమారు 900 మైళ్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి ఉపనదుల్లో ‘మంజీర, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి’  ముఖ్యమైనవి. ‘కూనవరం’ వద్ద ‘శబరి నదిని’ కలుపుకొన్న తర్వాత పాపికొండల ద్వారా ప్రవహించి, ఏడుపాయలుగా చీలుతుంది. అవి తుల్యభాగ, ఆత్రేయ, గౌతమి, వృద్ధ గౌతమి, భరద్వాజ, కౌశిక, వశిష్ట. ఈ ఏడుపాయలను కలిపి సప్త గోదావరి అంటారు. వీటిలో గౌతమి, వశిష్ట పెద్దవి. గౌతమి యానాం వద్ద, వశిష్ట నర్సాపురం సమీపంలో అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తాయి. గోదావరి డెల్టా ప్రాంతం ‘రాజమహేంద్రవరం’ నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో అనేక లంక గ్రామాలున్నాయి.
కృష్ణానది: ఇది మహారాష్ర్టలోని పడమటి కనుమల్లో  దాదాపు 4500 అడుగుల ఎత్తున ఆవిర్భవిస్తుంది. కొంతదూరం దక్షిణంగా ప్రవహించి, తరువాత తూర్పు దిశగా మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లో హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణానది పొడవు దాదాపు 800 మైళ్లు. దీనికి ఎడమ భాగాన 15, కుడివైపున నాలుగు ఉపనదులున్నాయి. మహారాష్ట్రలో కృష్ణానదిని ‘కృష్ణాబాయి’గా పిలుస్తారు. నల్లరేగడి భూముల మీదుగా ప్రవహిస్తున్నందువల్ల దీన్ని ‘కృష్ణభూమి’ అని, ‘కరేనాడు’ అని కూడా పిలుస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఈ నదీ పరీవాహక ప్రాంతాలు. తుంగభద్ర, మూసీ, భీమ, ఘటప్రభ, మలప్రభ దీని ఉపనదులు. కృష్ణానది డెల్టా విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది.
పెన్నానది: కర్ణాటకలోని నందిదుర్గం దగ్గర చెన్నకేశవ గిరి దీని జన్మస్థానం. ఈ నదికి పినాకిని అని మరో పేరు. పొడవు 570 కి.మీ. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు  జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. జయమంగళ, కుందేరు, పాపాఘ్ని, చిత్రావతి దీని ఉపనదులు. నెల్లూరు సంగం వద్ద పెన్నానదిపై ఆనకట్ట నిర్మించారు. నెల్లూరుకు దక్షిణ దిశలో ఊటుకూరు వద్ద పెన్నానది సముద్రంలో కలుస్తుంది.
వంశధార: దీని జన్మస్థానం ఒడిశాలోని ‘నిమ్మగిరి’ కొండలు. ఇది శ్రీకాకుళం జిల్లా గుండా ప్రవహించి, కళింగపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. తూర్పు కనుమల్లో పుట్టి, బంగాళాఖాతంలో కలిసే నదుల్లో వంశధార పెద్దది. ఈ నది ఒడ్డునే శ్రీ ముఖలింగ దేవాలయం, శాలిహుండం బౌద్ధ స్థూపం బయల్పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో సుమారు 17 నదులు ప్రవహిస్తున్నాయి. బహుదా, లాంగుళ్య (నాగావళి), శారద, గోస్తనీ, మాడుగుల కొండల్లో ముచికుంద ముఖ్యమైనవి.  నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి, గుండ్లకమ్మ నల్లమల కొండల్లో పుట్టి, గుంటూరు, ప్రకాశం జిల్లాల గుండా 235 కి.మీ. ప్రవహించి కొత్తపట్నం వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. ఇవే కాకుండా అనేక చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి.

తీరమైదానం
తూర్పు కనుమలు - తీరానికి మధ్య 60 కి.మీ. వెడల్పుతో ఈ తీర మైదానం ఉంది. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల డెల్టాలు ఈ మైదానంలో ఉన్నాయి. ఈ మైదాన తీరం సారవంతమైన ఒండ్రు నేలలతో కూడి ఉంది. గుప్త గోదావరీ ప్రాంతంలో విస్తరించిన లంకలున్నాయి. ఈ ప్రాంతాన్నే ‘కోనసీమ’ అంటారు.  తీర మైదాన ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. తూర్పు తీర మైదానంలో కొల్లేరు, ‘పులికాట్’ వంటి పెద్ద సరస్సులున్నాయి. కృష్ణా - గోదావరి డెల్టాల మధ్యలో కొల్లేరు మంచినీటి సరస్సు ఉంది. బుడమేరు, తమ్మిలేరు వంటి వాగులు ఇందులో కలుస్తాయి. నెల్లూరు జిల్లాలోని ‘పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు. భారత ప్రభుత్వం ఇక్కడ శ్రీహరికోట వద్ద కృత్రిమ ఉపగ్రహ ప్రయోగశాలను నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్‌కు సుమారు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అయినా ఓడరేవులు తక్కువ. విశాఖపట్నం వద్ద ‘డాల్ఫిన్‌‌సనోస్’ కొండ వద్ద ‘విశాఖ ఓడరేవు’ సహజసిద్ధంగా ఏర్పడింది. 
 
భౌగోళిక పరిస్థితులు - చరిత్రపై దాని ప్రభావం
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఆంధ్రులు స్వల్పకాలం మాత్రమే ఏకఛత్రాధిపత్యం కింద మనగలిగారు. భౌతిక, నైసర్గిక భిన్నత్వం వల్ల సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యత్యాసాల్లో మార్పులొచ్చాయి. దీని ఫలితంగా చారిత్రక కాల గమనంలో సర్కారు, రాయలసీమ, తెలంగాణ, తూర్పాంధ్ర అనే ప్రాంతీయ భావాలు చోటుచేసుకున్నాయి. దాని ఫలితంగా తెలుగు దేశంలో భిన్నత్వంలో ఏకత్వం లోపించింది. దక్షిణాపథంలో పశ్చిమ ప్రాంతంలో అనేక రాజవంశాలు తీరాంధ్రాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాయి. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ‘రాయచూర్ దోబ్’ (అంతర్వేది) ప్రాంతంపై పల్లవులు, పశ్చిమ -చాళుక్యులు, రాష్ర్ట కూటులు, చోళులు, కళ్యాణీ చాళుక్యులు, విజయనగర, బహమనీ రాజుల మధ్య అనేక సంఘర్షణలు జరిగాయి. ఈ దండయాత్రల వల్ల ద్రావిడ, కన్నడ, మరాఠా, కళింగ (ఒడిశా) ప్రజలు అధిక సంఖ్యలో వలస వచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడ్డారు. ఫలితంగా ఆంధ్రజాతిలో భౌతికమైన వైవిధ్యం, సంస్కృతీ సంప్రదాయాలు సమ్మిళితం అయ్యాయి.
 మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో శాతవాహనుల యుగం నుంచి విజయనగర రాజుల వరకు, తూర్పు కనుమల్లో గోల్కొండ, కొండపల్లి, కొండవీడు, దేవరకొండ, గుత్తి, గండికోట, పెనుగొండ, మహేంద్రగిరి వంటి కొండ ప్రాంతాల్లో అనేక దుర్గాలు ఏర్పడ్డాయి. ఇవి కూడా కొంత వరకు ఆంధ్రదేశ రాజకీయ అనైక్యతకు దారితీశాయి. ఈ దుర్గాలతోపాటు, గోదావరీ, కృష్ణానదీ తీర ప్రాంతాల్లో శ్రీ పర్వతం, శ్రీశైలం, యాదగిరి గుట్ట, అహోబిలం, సింహాచలం, విజయవాడ, తిరుపతి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సూదికొండ, పాపికొండ, శాలిహుండం, అరసవల్లి ఆదిత్యుడు, శ్రీకూర్మం, ముఖలింగం వంటి అనేక క్షేత్రాలు వెలిశాయి. ఈ క్షేత్రాలు ఒక విధంగా దేశ వ్యాప్తంగా సమైక్యానికి తోడ్పడ్డాయని చెప్పొచ్చు. దక్కను (దక్షిణాపథం) రాజ్యమేలిన రాజులు ప్రపంచ చరిత్రలో చోటు దక్కించుకొని, స్థూపాలు, చైత్యాలు, విహారాలు (బౌద్ధం), అనేక హిందూ, జైన ఆలయాలు నిర్మించి ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయులయ్యారు.
Published date : 21 Jul 2016 03:49PM

Photo Stories