Skip to main content

జగనన్న అమ్మ ఒడి పథకం: అర్హతలు – ప్రయోజనాలు

పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని జనవరి 9, 2020న ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పిల్లలను ఎక్కడ చదివించినా, ప్రతి ఏడాది జనవరిలో నేరుగా పథకానికి ఎంపికైన అర్హులైన తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేయడం జరుగుతుంది.

ఈ పథకానికి అర్హులెవరంటే..

  • తల్లిదండ్రులు, వారి పిల్లలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానికులై ఉండాలి.
  • ఆయా కుటుంబాల్లోని పిల్లలు ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ స్కూల్స్‌ లేదా రెసిడెన్షియల్‌ లేదా జూనియర్‌ కాలేజీలలోఒకటో తరగతి నుంచి 12వ తరగతిలోపు చదివే విద్యార్థులై ఉండాలి. ఆయా పాఠశాలలో 75శాతం అటెండెన్స్‌ ఉండాలి.
  • తెల్ల రేషన్‌కార్డు దారులై ఉండి, దారిద్య్రరేఖకు దిగువ ఉన్నవారై ఉండాలి.
  • కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5 వేలు, పట్టణాల్లో రూ.6,250 ఉండాలి. (2021లో కోవిడ్‌ కారణంగా గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఆదాయ పరిమితి ఉండేలా సడలింపు చేశారు)
  • రెండున్నర ఎకరాల మాగాణి, మెట్ట భూమి 5 ఎకరాలలోపు పరిమితి ఉండాలి (2021లో కోవిడ్‌ కారణంగా మాగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు)
  • ఆధార్‌ కార్డు లేదా ఓటర్‌ కార్డు కలిగి ఉండాలి.
  • విద్యుత్‌ వినియోగానికి సంబంధించి నెలకు 200 యూనిట్లలోపు వాడే వాళ్లు అర్హులు (2021లో కోవిడ్‌ కారణంగా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు)
  • మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్థిరాస్థి ఉన్న వారు ఈ పథకానికి అర్హులు (2021లో 1,000 చదరపు అడుగుల స్థలం ఉన్న వారిని కూడా అర్హులుగా గుర్తించారు)
  • ఫోర్‌ వీలర్‌ (కారు) ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఇవ్వడంతో టాక్సీ ఉన్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులే (2021లో ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించారు)
  • పాఠశాల లేదా కళాశాలలో చదివే విద్యార్థులు విద్యాసంవత్సరం పూర్తి చేయకుండా మధ్యలో చదువు మానివేసినా లేదా సక్రమంగా బడికి రాకపోయినా ఈ పథకం వర్తించదు.
  • కేంద్ర మరియు రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫెన్షనర్లు ఈ పథకానికి అనర్హులు (2021లో పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు కూడా అమ్మఒడి వర్తిస్తుంది)


ఈ పథకం ప్రయోజనాలు..
జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న అర్హులైన, విద్యార్థుల తల్లుల ఖాతాలో ప్రతి ఏటా రూ.15 వేలు జమ చేస్తుంది. అయితే 2021 నుంచి తల్లులకు అమ్మఒడి కింద ఇచ్చే రూ.15,000లలో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ నిధికోసం కోసం రూ.1000 మినహాయించి తక్కిన రూ.14,000ల మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేయడం ప్రారంభించింది. పాఠశాలల్లో పారిశుద్ధ్య వసతులకు, విద్యార్ధుల్లో ముఖ్యంగా బాలికల్లో డ్రాప్‌అవుట్‌ల సంఖ్యకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించిన ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచి డ్రాప్‌ అవుట్లను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో అమ్మ ఒడి లబ్ధిదారులకు అందించే రూ.15,000 నుంచి, రూ. 1000 జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని టాయిలెట్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌లో జమ చేస్తుంది. ఈ సొమ్ము ఆ పాఠశాలల్లోని టాయిలెట్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌కు బదిలీ చేసి, పాఠశాల అభివృద్ధి కమిటీ ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు మాత్రమే ఖర్చు చేస్తారు. ఇంత డబ్బు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఈ వెయ్యి రూపాయలు ఎక్కువ కాకపోయినా పిల్లల చదువుకునే బడి, పరిశుభ్రతను వారి డబ్బుతోనే నిర్వహిస్తే జవాబుదారీతనం, పరిస్థితులు మెరుగు పడతాయనే ఉద్దేశంతో మినహాయిస్తుంది. పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే విద్యార్థులు 1902 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు లేదా గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చే సేలా వెసులుబాటు కల్పించారు.

బడికి రాకపోతే వెంటనే మెసేజ్‌.. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమ్మఒడి పథకానికి టెక్నాలజీని అనుసంధానం చేసింది. దీని ద్వారా పిల్లలు బడికి రాకపోతే మొదటి రోజు తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. వరుసగా రెండు రోజులు రాకుంటే మూడో రోజు వలంటీర్‌ నేరుగా ఇంటికి వచ్చి పిల్లల యోగ క్షేమాలను విచారిస్తారు. పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదైతే తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఉన్న ఉద్యోగులు, వలంటీర్లు, పేరెంట్స్‌ కమిటీతో పాటు టీచర్ల మీద ఉంచింది.

నగదుకు బదులు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..
కోవిడ్‌ మహమ్మారి లాంటి సమయంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తే, ప్రభుత్వ బడులలో చదివే పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్ధేశ్యంతో 2022 విద్యాసంవత్సరం నుంచి 9 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కోరుకుంటే అమ్మఒడి ద్వారా ఇస్తున్న నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ తీసుకునే విధంగా ఈ çపథకంలో కొత్త ఆప్షన్‌ను చేర్చారు. వసతి దీవెన కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్‌లు పొందే ఆప్షన్‌ కల్పించింది. హెచ్‌పీ, డెల్, లెనోవా, ఏసర్, ఎంఐ, ఫాక్స్‌కాన్‌ లాంటి బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్స్‌ ఇంటెల్‌ ఏఎండీ లేదా సమానమైన ప్రాసెసర్, 4 గిగాబైట్‌ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచుల తెర (స్క్రీన్‌), విండోస్‌ 10 (ఎస్‌టీఎఫ్‌), మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయింట్‌)ల కాన్ఫిగరేషన్‌తో, 3 సంవత్సరాల వారంటీతో ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లకు మెయిన్‌టెనెన్స్‌ సమస్యలు ఎదురైతే 7 రోజులలోనే రీప్లేస్‌మెంట్‌ లేదా రిపేర్‌ బాధ్యత గ్రామ సచివాలయం ద్వారా సంబంధిత కంపెనీ పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధిస్తారు. ఫిర్యాదులను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది. 

ఈ బ్రాండెడ్‌ ల్యాప్‌ టాప్స్‌ విద్యార్థులు కింది విధంగా ఉపయోగించుకోవచ్చు

  • ఆన్‌లైన్‌లో పాఠాలు వినొచ్చు.
  • ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చదువుకు సంబంధించి వీడియోలు చూసుకోవచ్చు.
  • డిజిటల్‌ రూపంలో ఉన్న పుస్తకాలు చదువుకోవచ్చు.
  • ఇంటర్నెట్‌లో చదువుకు సంబంధించి అపారంగా సమాచారాన్ని వెతకొచ్చు.
  • ఈ మెయిల్‌ ఇవ్వవచ్చు. పొందవచ్చు.
  • మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వంటి వాటితో ప్రాజెక్టు పనులు చేయవచ్చు.


ఈ ల్యాప్‌టాప్‌లలోప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ (మొబైల్‌ డివైస్‌ మేనేజ్‌మెంట్‌) ఇన్‌స్టాల్‌ చేసి ఇవ్వడం ద్వారా చెడు / హానికర వెబ్‌సైట్స్‌ను నిరోధించి వాటి ప్రభావం పిల్లలపై పడకుండా ఉండేలా చేయడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ల్యాప్‌ టాప్స్‌ కొనుగోలు చేస్తున్నందున మార్కెట్లో దాదాపు రూ.25 వేలు నుంచి రూ.27 వేలు ఉన్న బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.18,500కే అందించడం జరుగుతుంది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ ఏర్పాటు, గ్రామంలో నెట్‌వర్క్‌ పాయింట్‌ నుంచి ఇంటింటికీ కనెక్షన్‌, గ్రామంలో నెట్‌వర్క్‌ పాయింట్‌ వద్ద వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మించనున్నారు.

భవిష్యత్‌ ప్రయోజనాలు.. 
ఈ పథకం అమలుతో బడి బయట పిల్లల సంఖ్య భారీగా తగ్గి, ఆర్థిక సమస్యలతో పిల్లలు మధ్యలోనే చదువు మానేయకుండా ఈ పథకం ఉపయోగపడుతుంది. పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి నాణ్యమైన విద్య అందడం ద్వారా ఆయా కుంటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించగలుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అక్షరాస్యత రేటును పెంపొందడానికి ఈ పథకం బంగారు బాటలు వేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Published date : 18 Aug 2021 03:27PM

Photo Stories