Skip to main content

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్)సదస్సు

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 2019, నవంబర్ 4న జరిగిన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ-ఆర్‌సెప్)’ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... ‘ఆర్‌సీఈపీ చర్చల ప్రారంభంలో అంగీకరించిన మౌలిక స్ఫూర్తి ప్రస్తుత ఒప్పందంలో పూర్తిగా ప్రతిఫలించడం లేదు. భారత్ లేవనెత్తిన వివాదాస్పద అంశాలు, ఆందోళనలకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్‌సెప్ ఒప్పందంలో భాగస్వామిగా చేరడం భారత్‌కు సాధ్యం కాదు’ అని ప్రకటించారు. ఈ ఒప్పందం భారతీయుల జీవితాలు, జీవనాధారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.

ఆర్‌సెప్ ఆమోదం పొందితే...
ఆర్‌సెప్ ఆమోదం పొందితే .. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందంగా నిలిచేది. దాదాపు ప్రపంచ జనాభాలో సగం మందితో పాటు, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40 శాతం, ప్రపంచ జీడీపీలో 35 శాతం ఈ ఒప్పంద పరిధిలో ఉండేవి.

15 దేశాలు సిద్ధం
ఆర్‌సెప్ ఒప్పందాన్ని భారత్ మినహా మిగతా 15 దేశాలు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒప్పందంలో చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసిన అనంతరం.. 2020వ సంవత్సరంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా 15 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.

ఆర్‌సెప్‌లో భారత్ చేరకపోవడానికి కారణాలు
  • వాణిజ్య లోటు భర్తీని తీర్చడానికి, ధరల మధ్య వ్యత్యాసానికి తగిన పరిష్కారం కనిపించకపోవడం.
  • దాదాపు 90% వస్తువులపై దిగుమతి సుంకాలను ఎత్తివేసేలా ఒప్పందం ఉండడం.
  • వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా చవకైన చైనా వ్యావసాయిక ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం.
  • అత్యంత ప్రాధాన్య దేశాల (ఎంఎఫ్‌ఎన్) హోదాను మరికొన్ని దేశాలకు ఇవ్వాల్సిన పరిస్థితులు రానుండడం.
  • టారిఫ్ తగ్గింపులకు ప్రాతిపదిక ఏడాదిగా 2014ని పరిగణించాలనడం.

2012 నుంచి చర్చలు
ఆర్‌సెప్ చర్చలు 21వ ఆసియాన్ సదస్సు సందర్భంగా నవంబర్, 2012లో ప్రారంభమయ్యాయి. 10 ఆసియాన్ సభ్య దేశాలు(ఇండోనేసియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, మయన్మార్, లావోస్) 6 భాగస్వామ్య దేశాలు(భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) ఈ చర్చల్లో పాలు పంచుకున్నాయి. ‘ఆధునిక, సమగ్ర, అత్యున్నత ప్రమాణాలతో కూడిన, పరస్పర ప్రయోజనకర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద రూపకల్పన’ లక్ష్యంగా ఆర్‌సీఈపీ చర్చలు ప్రారంభమయ్యాయి.

చైనా ఒత్తిడి
అర్‌సీఈపీ ఒప్పందం సభ్య దేశాల ఆమోదం పొందాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సభ్యదేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. అమెరికాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం విపరిణామాలను సమతౌల్యం చేసుకోవడం, ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు చూపడం చైనా లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆ లక్ష్యాలను సాధించాలని చూస్తోంది.
 
మాదిరి ప్రశ్నలు
1. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ-ఆర్‌సెప్) సదస్సు-2019 ఎక్కడ జరిగింది.
1. జెనీవా
2. బ్యాంకాక్
3. వియత్నాం
4. హాంకాంగ్
సమాధానం : 2

2. 2012 నవంబర్‌లో ప్రారంభమైన ఆర్‌సెప్ చర్చల్లో ఎన్ని దేశాలు పాలు పంచుకున్నాయి.
1. 18
2. 15
3. 16
4. 17
సమాధానం : 3

3. ఆర్‌సెప్ సదస్సు-2019 సందర్భంగా ఏ దేశం ఆర్‌సెప్ ఒప్పందంలో భాగస్వామిగా చేరలేమని ప్రకటించింది.
1. చైనా
2. మయన్మార్
3. వియత్నాం
4. భారత్
సమాధానం : 4

4. ఆర్‌సెప్ ఒప్పందంపై ఏ సంవత్సరంలో సంతకాలు చేస్తామని భారత్ మినహా మిగతా 15 దేశాలు ప్రకటించాయి.
1. 2020
2. 2023
3. 2022
4. 2025
సమాధానం : 1
Published date : 05 Nov 2019 06:11PM

Photo Stories