Global Hunger Index: ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 107వ స్థానం
Sakshi Education
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం ఏకంగా ఆరు స్థానాలు పడిపోయింది.
101 నుంచి 107కు దిగజారిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల కంటే మనం వెనుకబడి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 121 స్థానాలకు గాను భారత్ 107 స్థానంలో ఉన్నట్టుగా 2022 సంవత్సరానికి గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. చైల్డ్ వేస్టింగ్ రేటులో (పోషకాహార లోపంతో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం) 19.3 శాతంతో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో ఉంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ ఈ ఆకలి సూచి నివేదికని రూపొందించాయి.
నివేదిక ఏం చెప్పిందంటే...
- 2021లో ప్రపంచ ఆకలి సూచిలో 116 దేశాలకు గాను భారత్ 101వస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 121 దేశాల్లో 107 ర్యాంకుకి చేరుకుంది. 2020లో భారత్ 94వ స్థానంలో ఉంది.
- జీహెచ్‌ఐ స్కోర్ తగ్గుతూ వస్తోంది.. 2000 సంవత్సరంలో 38.8 ఉన్న స్కోర్ 2014–2022లలో 28.2–29.1 మధ్య ఉంటూ వస్తోంది.
- ఆసియా దేశాల్లో యుద్ధంతో అతాలకుతలమవుతున్న అఫ్గానిస్తాన్ మాత్రమే 109వ ర్యాంకుతో మన కంటే వెనుకబడి ఉంది. జీహెచ్‌ఐ స్కోరు అయిదు కంటే తక్కువగా ఉన్న దాదాపుగా 17 దేశాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. చైనా, కువైట్‌లు తొలి స్థానాలను దక్కించుకున్నాయి.
- ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్ (99), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81), శ్రీలంక (64) మన కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి
- చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ (పౌష్టికహార లోపంతో అయిదేళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు) రేటులో కూడా భారత్ బాగా వెనుకబడి ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది.
- భారత్, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్‌లో చైల్డ్ స్టంటింగ్ రేటు 35 నుంచి 38శాతం మధ్య ఉంది.
- పౌష్టికాహారలోపంతో బాధపడేవారు 2018–2020లో 14.6శాతం ఉంటే 2019–2021 నాటికి 16.3శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది పౌష్టికాహార లోప బాధితుల్లో 22.4 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు.
- పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల వయసు లోపు పిల్లల మరణాలు 2014లో 4.6శాతం ఉంటే 2020 నాటికి 3.3శాతానికి తగ్గాయి.
- భారత్‌లోని ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాల్లో తగ్గుదల కనిపిస్తోంది.
- ఆహార భద్రత, ప్రజారోగ్యం, ప్రజల సామాజిక ఆర్థిక హోదా, తల్లి ఆరోగ్యం విద్య వంటి అంశాల్లో భారత్‌లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా వేర్వేరు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
- కోవిడ్–19 దుష్పరిణామాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి ప్రపంచ దేశాల్లో ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి.
Also read: Population Decline: జనాభా తగ్గుదల ఆందోళనకరం... ప్రపంచ దేశాల ముందు కొత్త సవాళ్లు
Published date : 17 Oct 2022 06:10PM