Skip to main content

నూట ఇరవై ఏళ్లలో ఈ రంగంలో కేవ‌లం నలుగురు మ‌హిళ‌ల‌కే 'నోబెల్‌'..వీళ్లు ఎవ‌రంటే..?

ఎలా కనిపెడతారు వీళ్లు?! ఇంటిపని చేస్తూనే రేడియో ధార్మికతల్ని పిల్లల్ని ఆడిస్తూనే పరమాణు స్వభావాల్ని వండి పెడుతూనే కాంతి ఉష్ణ కిరణాల్ని నిద్ర చాలకనే మార్మిక కృష్ణ బిలాల్ని! ఎక్కడిది వీళ్లకింత శక్తి? సూక్ష్మదృష్టి? భౌతిక శాస్త్రమే ఆవహిస్తోందా? పాలపుంతల నుంచి ప్రవహిస్తోందా..?

శాస్త్రం జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఎలా చేస్తుందో అర్థం చేసుకోవడం మాత్రం కష్టమైన విషయం! సెల్‌ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని 'హలో' అని వేల మైళ్ల దూరంలో ఉన్నవారితో మాట్లాడినంత సులభం కాదు, ఎలా మాట అంతదూరం వెళ్లి, మళ్లీ వస్తుందో అర్థం చేసుకోవడం. అందుకే నిరంతరం శాస్త్రాన్ని అర్థం చేసుకుని, అర్థం చేయించే పనిలో ఉండే శాస్త్రవేత్తలకు.. ముఖ్యంగా ఏ ప్రయోగ అనుకూలతలూ ఉండని మహిళా శాస్త్రవేత్తలకు చేతులు జోడించి నమస్కరించాలి. ఇటు గృహ బంధనాలు, అటు శాస్త్ర శోధనలు! గ్రేట్‌. అణు ధార్మికత (రేడియో యాక్టివిటీ) పై చేసిన పరిశోధనలకు పొలెండ్‌ శాస్త్రవేత్త మేరీ క్యూరీకి నోబెల్‌ బహుమతి రావడం వెనుక కూడా జీవితకాల పరిశోధనలు, ప్రయోగాలు ఉన్నాయి.

 
భౌతికశాస్త్రంలో తొలి నోబెల్‌ గెలుచుకున్న మహిళ 'మేడమ్‌' క్యూరీ. ఆ 'రేడియో ధార్మికత' అనే పేరు ఆమె పెట్టిందే! అంతకుముందు కూడా రేడియో ధార్మికత ఉండేది. ఫలానా అని దానికొక గుర్తింపును క్యూరీ ఇచ్చారు. అణుధార్మికత ప్రయోగాల ల్యాబ్‌కు ఆమె తన జీవితాన్నే పణంగా పెట్టారు. ఆ దుష్ప్రభాలతోనే చివరికి ఆమె చనిపోయారని అంటారు! మానవ దేహంలో కణుతులకు జరిగే రేడియం చికిత్స పరిణామాలను వైద్యులు అంచనా వేయగలగడాన్ని సాధ్యం చేయించింది క్యూరీ పరిశోధనా ఫలితాలే.
 
 
మేరీ క్యూరీ తర్వాత భౌతిక శాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్‌ పొందిన మహిళ మరియా గోపర్ట్‌ మేయర్‌. జర్మనీ శాస్త్రవేత్త. ఆటమిక్‌ న్యూక్లియస్‌లోని 'న్యూక్లియర్‌ షెల్‌ మోడల్‌'ను ప్రతిపాదించినందుకు ఆమెకు నోబెల్‌ లభించింది. ఆటమిక్‌ న్యూక్లియస్‌ అంటే పరమాణు కేంద్రకం. అందులోనే ప్రొటాన్‌లు, న్యూట్రాన్‌లు ఉంటాయి. ఆ కేంద్రకం శక్తి స్థాయుల నిర్మాణం ఫలానా విధంగా ఉంటుందని మరియా కనిపెట్టారు. సరే, ఎవరికి ప్రయోజనం? అది పూర్తిగా శాస్త్రపరమైన అంశం. అణు స్వభావాలను తెలుసుకోడానికి పనికొచ్చే మేథమెటిక్స్‌. వైద్యరంగాన్నే తీసుకుంటే.. వ్యాధుల నిర్థారణ, వ్యాధి దశల గుర్తింపు, చికిత్స.. వీటికి అవసరమైన అధ్యయనానికి కూడా పరిశోధకులకు 'న్యూక్లియర్‌ షెల్‌ మోడల్‌' ఒక దారి దీపం.
 
 
భౌతికశాస్త్రంలో నోబెల్‌ పొందిన మూడో మహిళా శాస్త్రవేత్త డోనా స్ట్రిక్‌లాండ్‌. ఆప్టికల్‌ ఫిజిసిస్ట్‌. ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ రేడియేషన్‌పై పరిశోధనలు చేస్తుంటారు. కెనడా ఆమెది. 'పల్స్‌డ్‌ లేజర్స్‌' గురించి కొత్త విషయాలు కనిపెట్టినందుకు రెండేళ్ల క్రితం డోనాను నోబెల్‌ వరించింది. సి.పి.ఎ. (చర్ప్‌డ్‌ పల్స్‌ ఆంప్లిఫికేషన్‌) ను ఆచరణాత్మకంగా ప్రయోగించి అత్యధిక తీవ్రతను కలిగిన, అతి చిన్న కాంతి ఉష్ణ కిరణాలను ఆమె సృష్టించారు. కంటికి చేసే లేజర్‌ చికిత్సలలో ఇది చక్కగా ఉపకరిస్తోంది.
 
 
ఆండ్రియా గెజ్‌ ఈ ఏడాది నోబెల్‌ పొందిన మహిళా ఖగోళ శాస్త్రవేత్త. ఫిజిక్స్‌లో నాల్గవ మహిళా నోబెల్‌ విజేత. పాలపుంత మధ్యలో ధూళితో నిండి ఉన్న 'ధనుర్భాగాన్ని' (సాజిటేరియస్‌ –ఎ ) గెజ్‌ ఆధ్వర్యంలోని బృందం నిశితంగా పరిశీలించి, అక్కడి కాంతిమంతమైన నక్షత్రాల గమ్యాన్ని గుర్తించింది. గెజ్‌ అంచనా ప్రకారం ఆ ప్రదేశంలో బ్రహ్మరాక్షసి వంటి మార్మిక బిలం ఒకటి ఆ చుట్టుపక్కల నక్షత్రాల కక్ష్యలకు దారి చూపుతోంది! కొన్ని నక్షత్రాలను ఆధాటున మింగేస్తోంది. ఈ విశ్వవైపరీత్యాన్ని గెజ్‌ శక్తిమంతమైన టెలిస్కోప్‌తో కనిపెట్టారు. గెజ్‌ పరిశోధన మున్ముందు మనిషి ఈ విశ్వాన్ని మరింత సూక్ష్మంగా శోధించేందుకు, విశ్వ రహస్యాలను ఛేదించేందుకు తోడ్పడుతుంది.
 
 
పంచుకోవడంలో సంతోషం ఉంటుంది. అయితే అవార్డుల విషయంలో అదేమంత సంతోషాన్నివ్వదు. చిన్న అవార్డు అయినా విడిగా ఒక్కరికే వస్తే ఉండే ప్రత్యేక గుర్తింపు కలివిడిగా వస్తే ఉండదు. భౌతికశాస్త్రంలో నోబెల్‌ పొందిన ఈ నలుగురు మహిళా శాస్త్రవేత్తలూ మరో ఇద్దరితో అవార్డును పంచుకోవలసి వచ్చినవారే. ఇది కొంచెం నిరుత్సాహం కలిగించే విషయమే అయినా, మానవ జీవితాలకు కలిగే ప్రయోజనాల ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కలిగి ఉండటం కూడా శాస్త్రవేత్తగా జన్మ ధన్యం అవడమే. నోబెల్‌ గెలుపును మించిన సార్థక్యమది.
 
 
నూట ఇరవై ఏళ్లలో నలుగురు...
నోబెల్‌ ప్రైజ్‌లు 1901లో ప్రారంభం అయ్యాక ఇప్పటì వరకు భౌతికశాస్త్రంలో 114 సార్లు నోబెల్‌ని ప్రకటించారు. 215 మంది విజేతలు అయ్యారు. వీరిలో నలుగురంటే నలుగురే మహిళలు. ఒక నోబెల్‌ ప్రైజ్‌ను ముగ్గురికి మించి పంచరు. ఆ ముగ్గురి మధ్య కూడా కనీసం రెండు వేర్వేరు ఆవిష్కణలకు ప్రైజ్‌ను పంచడం ఉంటుంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ఇద్దరు పురుషులతో కలిసి బ్లాక్‌హోల్స్‌పై చేసిన పరిశోధనలకు ఆండ్రియా గెజ్‌ నోబెల్‌ను గెలుపొందారు. 1901లో విల్‌హెల్మ్‌ రాంట్‌జెన్‌ ఎక్స్‌–రే కనిపెట్టినందుకు భౌతికశాస్త్రంలో తొలి నోబెల్‌ గెలుచుకున్న రెండేళ్లకే 1903లో మేరీ క్యూరీ రేడియో ధార్మికతకు నోబెల్‌ సాధించారు.
 
తర్వాత అరవైఏళ్లకు గానీ ఒక మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోలేకపోయారు. 1963లో మరియా గోపర్ట్‌ మేయర్‌ న్యూక్లియర్‌ స్ట్రక్చర్‌కు నోబెల్‌ పొందారు. 2018లో డోనా స్ట్రిక్‌లాండ్‌ లేజర్‌ పల్సెస్‌కు నోబెల్‌ సాధించారు. అయితే ఈ నలుగురు మహిళల్లో విడిగా ఏ ఒక్కరికీ నోబెల్‌ రాలేదు. నలుగురూ మరో ఇద్దరు పురుషులతో నోబెల్‌ను పంచుకున్నవారే. మొత్తం మీద భౌతికశాస్త్రంలో ఏక విజేతగా 47 మంది నోబెల్‌ను గెలుపొందగా.. ఒకరితో కలిసి 32 మంది, ఇద్దరితో కలిసి 34 మంది నోబెల్‌ను పంచుకున్నారు. యుద్ధపరిస్థితుల కారణంగా 1916, 1931, 1934, 1940, 1941, 1942లలో ఆరుసార్లు నోబెల్‌ను ఇవ్వలేదు.
Published date : 09 Oct 2020 01:13PM

Photo Stories