కామన్‌వెల్త్ - చోగమ్
ఆంటిగ్వా అండ్ బార్బుడా, ఆస్ట్రేలియా, బహమస్, బంగ్లాదేశ్, బార్బడోస్, బెలీజ్, బోట్స్‌వానా, బ్రూనై, కామెరూన్, కెనడా, సైప్రస్, డొమినికా, ఫిజీ, ఘనా, గ్రెనడా, గయానా, భారత్, జమైకా, కెన్యా, కిరిబతి, లెసోథో, మలావి, మలేసియా, మాల్దీవులు, మాల్టా, మారిషస్, మొజాంబిక్, నమీబియా, నౌరు, న్యూజిలాండ్, నైజీరియా, పాకిస్తాన్, పపువా న్యూగినియా, రువాండా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనిడైన్స్, సమోవా, సీషెల్స్, సియర్రా లియోన్, సింగపూర్, సోలోమన్ ఐలాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, స్వాజిలాండ్, టాంజానియా, టోంగా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, తువాలు, ఉగాండా, యునెటైడ్ కింగ్‌డమ్, వనౌటు, జాంబియా.
కామన్‌వెల్త్ దేశాల తొలి అధిపతిగా బ్రిటిష్ రాజు ఆరో జార్జ్ వ్యవహరించారు. ఆయన 1949 ఏప్రిల్ 28 నుంచి 1952 ఫిబ్రవరి 6 వరకు కొనసాగారు. ఆయన మరణానంతరం బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ 1952 ఫిబ్రవరి 6 నుంచి కామన్‌వెల్త్ అధిపతిగా కొనసాగుతున్నారు.
కామన్‌వెల్త్ సెక్రెటేరియట్ లండన్‌లో ఉంది. దీన్ని 1965లో ఏర్పాటు చేశారు. దీనికి అధిపతిగా కామన్‌వెల్త్ సెక్రెటరీ జనరల్ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. ప్రధాన కార్యదర్శి పదవీకాలం నాలుగేళ్లు. ఈ పదవిలో రెండు పర్యాయాలు కొనసాగవచ్చు.
చోగమ్
కామన్‌వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు ప్రతి రెండేళకోసారి జరుగుతుంది. ఈ సదస్సును ‘చోగమ్’ అంటారు. చోగమ్ అంటే కామన్‌వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. (Commonwealth Heads Of Government Meeting). మొదటి చోగమ్ 1971లో సింగపూర్‌లో జరిగింది.
24వ కామన్‌వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సును మాల్టా రాజధాని వలెట్టాలో 2015 నవంబర్ 27న బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ ప్రారంభించారు. ఈ సదస్సు నవంబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు జరిగింది. ఈ సదస్సుకు మాల్టా ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ అధ్యక్షత వహించారు. మనదేశం నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రాతినిధ్యం వహించారు. ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఈ సదస్సుకు హాజరై వాతావరణ మార్పులపై జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు.
మాల్టా చోగమ్‌కు హాజరైన ప్రముఖుల్లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కం టర్‌నబుల్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడియు, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నారు.
మాల్టా సదస్సులో ప్రధానంగా వాతావరణ మార్పులు, ఉగ్రవాదంపై చర్చించారు. కామన్‌వెల్త్ కూటమిలోని చిన్న, పేద దేశాలు కర్బన ఉద్గారాలు తగ్గించుకునే చర్యల కోసం ఆర్థిక సహకారం అందక ఇబ్బంది పడుతున్నాయి. ఈ పేద దేశాలకు నిధులు అందించడానికి ఒక వాతావరణ మార్పుల హబ్‌ను ఏర్పాటు చేయాలని కామన్‌వెల్త్ దేశాల నాయకులు నిర్ణయించారు. దీన్నే కామన్‌వెల్త్ క్లైమేట్ ఫైనాన్స్ యాక్సెస్ హబ్ అంటారు. దీన్ని మారిషస్ కేంద్రంగా నెలకొల్పనున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కోవడానికి వచ్చే అయిదేళ్లలో కెనడా 2.65 బిలియన్ డాలర్లను సమకూర్చనున్నట్లు ప్రకటించింది. యు.కె. ప్రభుత్వం విపత్తుల నిర్వహణకు 21 మిలియన్ పౌండ్ల సహాయాన్ని ప్రకటించింది. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం 5.5 మిలియన్ల పౌండ్ల సహాయాన్ని కూడా యు.కె. ప్రకటించింది. నూతనంగా నెలకొల్పనున్న వాతావరణ మార్పుల నిధికి ఆస్ట్రేలియా తన వంతుగా ఒక మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భారత్ 25 లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. భూతాపం పెరుగుదలను అదుపులో ఉంచాలని పేర్కొంది. రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ మేరకు ఉష్ణోగ్రతలు తగ్గించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ ప్రకటించింది.
కామన్‌వెల్త్ దేశాధినేతలు అంతర్జాతీయ సహకారంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి ఏ జాతీయతను, మతాన్ని, దేశాన్ని ముడిపెట్టొద్దని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ కామన్‌వెల్త్ దేశాల్లో ఉగ్రవాద నిరోధానికి రూ. 50 లక్షల పౌండ్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మాల్టా కామన్‌వెల్త్ సదస్సును ‘యాడింగ్ గ్లోబల్ వాల్యూ’ అనే అంశంపై నిర్వహించారు.
బ్రిటన్‌లో 25వ చోగమ్
25వ కామన్‌వెల్త్ శిఖరాగ్ర సదస్సు2018లో బ్రిటన్‌లో జరగనుంది. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ సదస్సు 2017లో వనౌటు అనే దేశంలో జరగాల్సి ఉంది. అయితే 2015 మార్చిలో పామ్ అనే తుపాను తాకిడితో ఈ చిన్న పసిఫిక్ దీవి తీవ్రంగా దెబ్బతింది. దీంతో చోగమ్‌ను నిర్వహించలేమని వనౌటు ప్రకటించింది. దీంతో 25వ చోగమ్‌ను నిర్వహించడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. అయితే 2017కు బదులు 2018లో చోగమ్‌ను నిర్వహిస్తామని బ్రిటన్ ప్రకటించింది.
నూతన సెక్రెటరీ జనరల్ ఎన్నిక
మాల్టాలో జరిగిన చోగమ్‌లో కామన్‌వెల్త్ నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. 2015 నవంబర్ 27న జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ న్యాయవాది ప్యాట్రీషియా స్కాట్లాండ్ కామన్‌వెల్త్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆమె కామన్‌వెల్త్‌కు ఆరో సెక్రెటరీ జనరల్‌గా 2016 ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ప్యాట్రిషియా స్కాట్లాండ్ పదవీ విరమణ చేయబోతున్న కమలేశ్ శర్మ స్థానంలో ఎన్నికయ్యారు. ఈమె గతంలో ఉత్తర ఐర్లాండ్, ఇంగ్లండ్, వేల్స్‌కు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఈమెకు యునెటైడ్ కింగ్‌డమ్, డొమినికా దేశాల పౌరసత్వం ఉంది.
కామన్‌వెల్త్ ప్రధాన కార్యదర్శులు
పేరు | దేశం | పదవీకాలం |
ఆర్నాల్డ్ స్మిత్ | కెనడా | 1965 జూలై 1- 1975 జూన్ 30 |
శ్రీదత్ రాంఫాల్ | గయానా | 1975 జూలై 1- 1990 జూన్ 30 |
ఎమెకా అన్యోకు | నైజీరియా | 1990 జూలై 1- 2000 మార్చి 31 |
డాన్ మెకిన్నోన్ | న్యూజిలాండ్ | 2000 ఏప్రిల్ 1- 2008 మార్చి 31 |
కమలేశ్ శర్మ | భారత్ | 2008 ఏప్రిల్ 1- ప్రస్తుత ప్రధాన కార్యదర్శి |
చోగమ్ సదస్సులు
సం॥ | నగరం | దేశం |
1971 | సింగపూర్ | సింగపూర్ |
1973 | ఒట్టావా | కెనడా |
1975 | కింగ్‌స్టన్ | జమైకా |
1977 | లండన్ | యునెటైడ్ కింగ్‌డమ్ |
1979 | లుసాకా | జాంబియా |
1981 | మెల్‌బోర్న్ | ఆస్ట్రేలియా |
1983 | న్యూఢిల్లీ | భారత్ |
1985 | నస్సావు | బహమాస్ |
1986 | లండన్ | యు.కె. |
1987 | వాంకూవర్ | కెనడా |
1989 | కౌలాలంపూర్ | మలేషియా |
1991 | హరారే | జింబాబ్వే |
1993 | లిమస్సోల్ | సైప్రస్ |
1995 | అక్లాండ్ | న్యూజిలాండ్ |
1997 | ఎడిన్‌బరో | యు.కె. |
1999 | డర్బన్ | దక్షిణాఫ్రికా |
2002 | కూలమ్ | ఆస్ట్రేలియా |
2003 | అబుజా | నైజీరియా |
2005 | వలెట్టా | మాల్టా |
2007 | కంపాలా | ఉగాండా |
2009 | పోర్ట్ ఆఫ్‌స్పెయిన్ | ట్రినిడాడ్ అండ్ టొబాగో |
2011 | పెర్త్ | ఆస్ట్రేలియా |
2013 | కొలంబో | శ్రీలంక |
2015 | వలెట్టా | మాల్టా |
మాదిరి ప్రశ్నలు
1. రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజునజరుపుకొంటారు?
1) జనవరి 26
2) నవంబర్ 14
3) నవంబర్ 26
4) డిసెంబర్ 9
- View Answer
- సమాధానం: 3
2. 2015 నవంబర్‌లో టెస్ట్ క్రికెట్లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఏ నగరంలో జరిగింది?
1) మెల్‌బోర్న్
2) సిడ్నీ
3) బ్రిస్బేన్
4) అడిలైడ్
- View Answer
- సమాధానం: 4
3. కామన్‌వెల్త్ కూటమిలో భారత్ తర్వాత ఎక్కువ జనాభా ఉన్న దేశం?
1) నైజీరియా
2) బంగ్లాదేశ్
3) పాకిస్తాన్
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 3
4. కింది వాటిలో ఏ దేశాన్ని గతంలో ఎల్లైస్ ఐలాండ్స్ గా పిలిచేవారు?
1) తువాలు
2) కిరిబతి
3) ఫిజీ
4) నౌరు
- View Answer
- సమాధానం: 1
5. 2015 మార్చిలో వనౌటు దేశంలో సంభవించిన తుపాను?
1) సైక్లోన్
2) కార్లోస్
3) సైక్లోన్ ఫ్రాంక్
4) సైక్లోన్ పామ్
- View Answer
- సమాధానం:4
6. 2018లో కామన్‌వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు ఏ దేశంలో నిర్వహించనున్నారు?
1) ఆస్ట్రేలియా
2) వనౌటు
3) న్యూజిలాండ్
4) యునెటైడ్ కింగ్‌డమ్
- View Answer
- సమాధానం: 4
7. 26వ చోగమ్‌ను 2020లో ఏ దేశంలో నిర్వహిస్తారు?
1) సైప్రస్
2) బహమాస్
3) మలేసియా
4) కెనడా
- View Answer
- సమాధానం: 3
8. జాంబియా దేశ రాజధాని ఏది?
1) హరారే
2) లుసాకా
3) జుబా
4) ఖార్టూమ్
- View Answer
- సమాధానం: 2
9. 983లో చోగమ్‌ను భారత్‌లో నిర్వహించారు. అప్పటి భారత ప్రధాని ఎవరు?
1) మొరార్జీ దేశాయ్
2) రాజీవ్‌గాంధీ
3) ఇందిరాగాంధీ
4) వి.పి.సింగ్
- View Answer
- సమాధానం: 3
10. కామన్వెల్త్లోని ఎన్ని దేశాలు బ్రిటిష్ రాణిని తమ మోనార్క్ గా గుర్తిస్తున్నాయి?
1) 10
2) 12
3) 14
4) 16
- View Answer
- సమాధానం:4