ఇరాన్ అణు ఒప్పందం-2015
Sakshi Education
పశ్చిమ దేశాల ఆంక్షల ఫలితంగా తీవ్రస్థాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్ ఆరు అగ్ర రాజ్యాలతో అణు ఒప్పందం కుదుర్చుకుంది.
అణ్వస్త్రాల తయారీని నిలిపేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రతిగా.. ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించేందుకు ఆరు అగ్ర రాజ్యాలు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, రష్యా అంగీకరించాయి. ఆస్ట్రియా రాజధాని వియెన్నాలో 18 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన కీలక చర్చల అనంతరం 2015, జూలై 14న ఈ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో అగ్ర రాజ్యాలతో ఇరాన్ వైరానికి విరామం లభించినట్లైంది. ఈ అణు ఒప్పందం ప్రపంచానికి ఒక ఆశావహ నూతనాధ్యాయమంటూ ఇరాన్, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు గొప్పగా ప్రశంసించగా.. ఇది చరిత్రాత్మక తప్పిదమంటూ ఇరాన్ శత్రుదేశం ఇజ్రాయెల్ అభివర్ణించింది.
ఒప్పందంలోని అంశాలు:
- ఇరాన్ తన అపకేంద్ర యంత్రాల(సెంట్రిఫ్యుజెస్) సంఖ్యను 19 వేల నుంచి 6,104కి తగ్గించాల్సి ఉంటుంది. ఈ యంత్రాలు అణుబాంబు తయారీకి అవసరమైన అత్యంత శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేస్తాయి.
- మరో పదేళ్ల పాటు తమ దగ్గరున్న ఆధునిక అపకేంద్ర యంత్రాలను యురేనియం ఉత్పత్తికి ఇరాన్ ఉపయోగించరాదు.
- తమ వద్ద ఇప్పటికే ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 98% నిల్వలను తొలగించాలి.
- తమ దేశంలోని అణు కేంద్రాలను, సరఫరా శృంఖలాన్ని, యురేనియం గనులను, యురేనియం ఉత్పత్తి, నిల్వ కేంద్రాలను, ప్రయోగ కేంద్రాలను.. అన్నింటినీ అంతర్జాతీయ సమాజం ఎప్పుడైనా తనిఖీ చేసేందుకు ఇరాన్ అంగీకరించాలి.
- అణ్వాయుధ తయారీకి ఉపయోగపడే ఫ్లుటోనియం ఉత్పత్తిని నిలిపేయాలి.
- ఈ ఒప్పందంలోని కొన్ని పారదర్శక నిబంధనలు 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి.
Published date : 22 Sep 2020 03:54PM