Skip to main content

బిమ్స్‌టెక్.. ఏడు దేశాల స్నేహ సౌరభం!

దక్షిణాసియా, ఆగ్నేయాసియాలలోని ఏడు దేశాలు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ (బిమ్స్‌టెక్). ఇందులో సభ్య దేశాలుగా బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ ఉన్నాయి.

1997, జూన్6న బ్యాంకాక్‌లో జరిగిన ఒక సమావేశంలో మొదట నాలుగు దేశాలు- బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనమిక్ కోఆపరేషన్ (బిస్టెక్) అనే కూటమిగా ఏర్పడ్డాయి. అదే ఏడాది డిసెంబర్‌లో కూటమిలో మయన్మార్ అయిదో సభ్య దేశంగా చేరింది. ఆ తర్వాత ఈ కూటమి పేరును బిమ్‌స్టెక్‌గా మార్చారు. 2003లో నేపాల్, భూటాన్‌లు కూటమిలో చేరాయి.

14 రంగాల్లో స్నేహ హస్తం!
బిమ్‌స్టెక్ దేశాలలో 1.3 బిలియన్ ప్రజలు అంటే ప్రపంచ జనాభాలో 21 శాతం మంది నివసిస్తున్నారు. ఈ దేశాలు 14 ప్రాథమ్య రంగాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి. అవి.. వాణిజ్యం, పెట్టుబడులు; సాంకేతికత; ఇంధనం; రవాణా, కమ్యూనికేషన్లు; పర్యాటకం; మత్య్స పరిశ్రమ; వ్యవసాయం; సాంస్కృతిక సహకారం; పర్యావరణం-విపత్తుల నిర్వహణ; ప్రజారోగ్యం; ప్రజల మధ్య సంబంధాలు; పేదరిక నిర్మూలన; తీవ్రవాద వ్యతిరేకత; వాతావరణ మార్పులు.

మొదటి సదస్సు మయన్మార్‌లో:
బిమ్‌స్టెక్ మొదటి శిఖరాగ్ర సదస్సు 2004లో బ్యాంకాక్‌లో జరగ్గా, రెండో సదస్సును 2008లో ఢిల్లీలో నిర్వహించారు. మూడో శిఖరాగ్ర సదస్సు 2014 మార్చిలో మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగింది. ఈ సమావేశానికి అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ హాజరయ్యారు. ఇందులో సభ్యదేశాలు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణాపై ఉమ్మడిగా పోరాడాలని.. వాణిజ్యం, విద్యుత్తు, పర్యావరణ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాయి.

మూడు ఒప్పందాలు:
మూడో సదస్సులో మూడు ఒప్పందాలు కుదిరాయి. అవి.. 1. బిమ్స్‌టెక్ శాశ్వత సచివాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నెలకొల్పుతారు. 2. భారత్‌లో ‘బిమ్స్‌టెక్ సెంటర్ ఫర్ వెదర్ అండ్ క్లైమేట్’ ఏర్పాటు చేస్తారు. 3. బిమ్స్‌టెక్ కల్చరల్ ఇండస్ట్రీస్ కమిషన్, కల్చరల్ ఇండస్ట్రీస్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేస్తారు. నాలుగో శిఖరాగ్ర సదస్సు నేపాల్‌లోని ఖాట్మండ్‌లో జరుగుతుంది. బిమ్స్‌టెక్ తొలి సెక్రటరీ జనరల్‌గా శ్రీలంకకు చెందిన సుమిత్ నకందలను 2014 మార్చిలో నియమించారు.
Published date : 17 Oct 2014 06:30PM

Photo Stories