Skip to main content

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయంటే...?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఆ దేశానికి అధ్యక్షుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అన్ని దేశాలపై ఏదో ఒక రకంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంత శక్తిమంతమైన పదవి రావడం అంత సులభం కాదు. ఈ ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. అమెరికా రాజకీయ వ్యవస్థలో ఉండే రెండే రెండు పార్టీలు రిపబ్లికన్, డెమొక్రాట్లు. ఈ రెండు పార్టీలు అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయడం దగ్గర్నుంచి అగ్రరాజ్యాధీశుడు శ్వేతసౌధం చేరుకునేవరకు ప్రతీ దశ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది.

ఎన్నికలు ఎప్పుడు?
నాలుగేళ్లకి ఒకసారి జరిగే అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో మొదటి సోమవారం మర్నాడు వచ్చే మంగళవారం నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి.

ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ద్వారా ఎన్నిక..
అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ట్రంప్ వర్సెస్ బెడైన్ అంటూ అభ్యర్థుల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి కానీ అధ్యక్షుడి ఎన్నిక పరోక్ష విధానంలోనే జరుగుతుంది. అమెరికాలో రాష్ట్రాలే ఎక్కువ శక్తిమంతమైనవి. వాస్తవానికి ప్రజలు అధ్యక్షుడిగా నేరుగా ఓటు వెయ్యరు. వారు నివసించే రాష్ట్రంలో రిపబ్లికన్ లేదంటే డెమొక్రాటిక్ పార్టీ ఎలక్టోరల్‌కు ఓటు వేస్తారు. రాష్ట్రాల జనాభాకి అనుగుణంగా ఒక్కో రాష్ట్రానికి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను కేటాయించారు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. దేశానికి అధ్యక్షుడు కావల్సిన వ్యక్తికి 270 అంతకంటే ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రావాలి. అప్పుడే ఆ వ్యక్తి అధ్యక్ష పీఠం అధిరోహిస్తారు. ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ అభ్యర్థికే కేటాయిస్తారు. అలా అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన అభ్యర్థి అగ్రరాజ్యాధీశుడు అవుతారు.

అధ్యక్షుడిగా ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా..
అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చినా లాభం లేదు. ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ ఎవరికి వస్తే వారే ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవిని చేపడతారు. గత ఏడాది ఎన్నికలే దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. వాస్తవానికి ట్రంప్ కంటే డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి 28 లక్షల పాపులర్ ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. కానీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అధికంగా ఉండే కీలక రాష్ట్రాల్లో హిల్లరీ కంటే ట్రంప్‌కి ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనకే అధ్యక్ష పీఠం దక్కింది. ట్రంప్ 306 ఎలక్టోరల్ ఓట్లతో విజయదుందుభి మోగిస్తే, హిల్లరీ 232 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

స్వింగ్ రాష్ట్రాలు చాలా కీలకం..
అధ్యక్ష ఎన్నికల ట్రెండ్ క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అత్యంత ముఖ్యం కావడంతో తటస్థంగా ఉండే రాష్ట్రాలనే రెండు పార్టీలు సవాల్‌గా తీసుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్లకి మద్దతు ఇస్తే, మరికొన్ని రాష్ట్రాలు డెమొక్రాట్ల వైపు ఉంటారు. అందువల్ల ఆఖరి నిమిషంలో ఓటుపై నిర్ణయం తీసుకునే స్వింగ్ రాష్ట్రాలు అత్యంత కీలకం. అరిజోనా (11 ఎలక్టోరల్ ఓట్లు), నార్త్ కరోలినా (15), ఫ్లోరిడా (29) పెన్సిల్వేనియా (20), మిషిగావ్ (16), విస్కాన్సిన్ (10) లను ఈసారి ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే 101 ఎలక్టోరల్ ఓట్లు ఎటు వైపు వస్తాయో ఉత్కంఠ రేపుతోంది.

కాంగ్రెస్‌కి కూడా ఎన్నికలు..
అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయసభలకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 435 మంది సభ్యులుండే సర్వ ప్రతినిధి సభకి రెండేళ్లకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఓ సారి, ఆ తర్వాత రెండేళ్లకి మరోసారి జరుగుతాయి. ఇక కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్‌లో 100 స్థానాలున్నాయి. వీటిలో 33 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. వీరి పదవీకాలం ఆరేళ్లు.

విజేత గద్దెనెక్కేది ఎప్పుడు..?
అమెరికా అధ్యక్ష ఫలితాలు వచ్చిన వెంటనే అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్వీకరించరు. తన కేబినెట్ కూర్పు, పరిపాలన కోసం ప్రణాళిక సిద్ధం చేయడానికి గడువు ఇస్తారు. ఆ కసరత్తు పూర్తయ్యాక జనవరి 20న వాషింగ్టన్‌లోని కేపిటల్ హిల్ (అమెరికా కాంగ్రెస్) భవనం మెట్లపై నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. అక్కడ్నుంచి కొత్త అధ్యక్షుడు వైట్‌హౌ స్ (అధికారిక నివాస భవనం)కి వెళతారు.

రిపబ్లికన్ పార్టీ:
ఎన్నికల చిహ్నం : ఏనుగు
విధానాలు : సంప్రదాయ విధానాలపైనే మొగ్గు చూపించే ఈ పార్టీ పన్నుల సరళీకరణ,తుపాకులకి లెసైన్స్, వలసదారుల నియంత్రణ ప్రధాన ఎజెండాలు. అబార్షన్ హక్కుల్ని వ్యతిరేకిస్తుంది ఈ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టుంది.
అధ్యక్ష అభ్యర్థి : డొనాల్డ్ ట్రంప్, వయసు : 74

డెమొక్రాట్ పార్టీ :
ఎన్నికల చిహ్నం : గాడిద
విధానాలు: ఆధునిక భావాలు కలిగిన డెమొక్రాట్ పార్టీ లెఫ్టిస్ట్ ధోరణి కలిగి ఉంటుంది. వలసదారులకు మద్దతుగా నిలుస్తుంది. జాతి వివక్ష వంటి చర్యల్ని వ్యతిరేకిస్తుంది. అబార్షన్ హక్కులకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తుంది. పట్టణ ప్రాంత ప్రజలు ఈ పార్టీకి బలం ఎక్కువ.
అధ్యక్ష అభ్యర్థి : జో బెడైన్, వయసు :78

ఫలితాలు ఎప్పుడు?
ప్రస్తుత సంవత్సరం కరోనా సంక్షోభంతో ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నారు. అందుకే ఈ సారి ఎన్నికల ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్నికలు జరిగిన మర్నాడే నుంచే ప్రజా నాడి తెలిసిపోతుంది.

Published date : 26 Oct 2020 02:51PM

Photo Stories