Skip to main content

ఐక్యరాజ్యసమితి.. అనుబంధ సంస్థలు

దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ ఐక్యరాజ్యసమితి.. దాని అనుబంధ సంస్థలు, అవి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై ప్రశ్నలుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఏర్పాటైన నాటి నుంచి దాని విధులు, దాని ఆధ్వర్యంలోని వివిధ సంస్థలు, వాటి కార్యక్రమాలను బాగా అధ్యయనం చేయాలి.

మొదటి ప్రపంచయుద్ధం (1914-1918) ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి కోసం 1920లో నానాజాతి సమితి ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉండేది. అయితే ఈ సంస్థ రెండో ప్రపంచ యుద్ధాన్ని నిలువరించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాపాడటానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అక్టోబర్ 24, 1945న ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అక్టోబర్ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

యునెటైడ్ నేషన్‌‌స అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్. ఈ పదాన్ని అధికారికంగా తొలిసారి జనవరి 1, 1942న వాడారు. ఆ రోజు అట్లాంటిక్ చార్టర్‌పై 26 దేశాలు సంతకాలు చేశాయి. ఏప్రిల్ 25, 1945న శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)లో సమావేశమైన 50 దేశాలు యునెటైడ్ నేషన్‌‌స చార్టర్‌ను రూపొందించాయి. ఈ 50 దేశాలు జూన్ 26, 1945న చార్టర్‌పై సంతకాలు చేశాయి. ఈ సమావేశానికి హాజరుకాని పోలండ్ అక్టోబర్ 15, 1945న సంతకం చేసి 51వ సభ్యదేశంగా చేరింది. ఈ 51 సభ్యదేశాల్లో భారతదేశం కూడా ఉంది. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో 193 సభ్యదేశాలున్నాయి. జూలై, 2011లో దక్షిణ సూడాన్ 193వ సభ్యదేశంగా చేరింది. ఆఫ్రికాలోని సూడాన్ నుంచి దక్షిణ సూడాన్ జూలై 9, 2011న స్వాతంత్య్రం పొందింది. సెప్టెంబర్, 2002లో స్విట్జర్లాండ్, తూర్పు తైమూర్ దేశాలు 190,

191వ సభ్యదేశాలుగా చేరాయి. 2006, జూన్ 28న మాంటినిగ్రో ఐక్యరాజ్యసమితిలో 192వ సభ్యదేశంగా చేరింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్‌‌కలో ఉంది. ఆరు భాషలను అధికారిక భాషలుగా గుర్తించింది. అవి.. అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఈ సంస్థలో 193 సభ్యదేశాలే కాకుండా పరిశీలక హోదా ఉన్న దేశాలు రెండు ఉన్నాయి. అవి..
వాటికన్, పాలస్తీనా.
ఐక్యరాజ్యసమితి జెండాను అక్టోబర్ 20, 1947న ఆమోదించారు. లేత నీలిరంగుపై రెండు ఆలివ్ కొమ్మల మధ్య ప్రపంచ పటం ఉంటుంది. ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం. ఈ సంస్థ అధికారిక రంగులు తెలుపు, నీలం.

ఐక్యరాజ్యసమితి ప్రధానాంగాలు..
ప్రధానాంగాలు ఆరు ఉన్నాయి. అవి.. సాధారణ సభ (జనరల్ అసెంబ్లీ), భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్), ఆర్థిక, సాంఘిక మండలి (ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్), ధర్మకర్తృత్వ మండలి (ట్రస్ట్‌షిప్ కౌన్సిల్), అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్‌‌ట ఆఫ్ జస్టిస్), సచివాలయం (సెక్రటేరియట్).
  1. సాధారణ సభ: ఐక్యరాజ్యసమితిలోని అన్ని సభ్యదేశాలు దీనిలో సభ్యదేశాలుగా ఉంటాయి. దీన్ని ప్రపంచ పార్లమెంట్‌గా వ్యవహరిస్తారు. ప్రతిదేశం ఐదుగురు సభ్యులను పంపొచ్చు. కానీ ఒక ఓటు మాత్రమే ఉంటుంది. భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశాలను సాధారణ సభ నియమిస్తుంది. ఈ సభ సమావేశాలను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహిస్తారు. మొదటి సమావేశం 1946లో జరిగింది. సాధారణ సభ అధ్యక్షుడి పదవీకాలం ఒక ఏడాది. ప్రస్తుత అధ్యక్షుడు ఆంటిగ్వా, బార్బుడాకు చెందిన జాన్ విలియమ్ ఆషే. భారతదేశానికి చెందిన విజయలక్ష్మీ పండిట్ 1953లో సాధారణ సభకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సాధారణ సభ ప్రధాన కార్యాలయం న్యూయార్‌‌కలో ఉంది.
  2. భద్రతా మండలి: కేంద్ర కార్యాలయం న్యూయార్‌‌కలో ఉంది. ప్రధాన ఉద్దేశం అంతర్జాతీయ శాంతిభద్రతలు. ఇందులో 15 సభ్యదేశాలు. శాశ్వత సభ్యదేశాలు ఐదు. అవి... యూఎస్‌ఏ, రష్యా, యూకే, ఫ్రాన్‌‌స, చైనా. వీటినే పీ-5 దేశాలు (పర్మనెంట్ ఫైవ్) అని పిలుస్తారు. వీటికి వీటో అధికారముంటుంది. ఏదైనా తీర్మానాన్ని ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్కటి వ్యతిరేకించినా అది రద్దవుతుంది. 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. వీటి పదవీకాలం రెండేళ్లు. ప్రస్తుతమున్న తాత్కాలిక సభ్యదేశాలు.. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అజర్‌బైజాన్, గ్వాటిమాలా, లగ్జెంబర్‌‌గ, మొరాకో, పాకిస్థాన్, రువాండా, దక్షిణ కొరియా, టోగో. వీటిని సాధారణ సభ ఎన్నుకుంటుంది. 2/3 వంతు మెజారిటీతో ఎన్నిక కావాలి.
  3. ఆర్థిక, సాంఘిక మండలి: ఇందులో 54 సభ్యదేశాలున్నాయి. కేంద్ర కార్యాలయం న్యూయార్‌‌కలో ఉంది. సభ్యదేశాలను సాధారణ సభ మూడేళ్ల పదవీకాలం కోసం ఎన్నుకొంటుంది. ప్రపంచంలోని ఆర్థిక, సామాజిక అంశాలపై మండలి దృష్టి సారిస్తుంది. అధ్యక్షుని పదవీకాలం ఒక సంవత్సరం. ప్రస్తుత అధ్యక్షుడు నెస్టర్ ఒసోరియో లండనో. ఆయన కొలంబియా దేశస్తుడు. ఇందులో భారతదేశం కూడా ఒక సభ్యదేశం.
  4. ధర్మకర్తృత్వ మండలి: వలస రాజ్యాల ప్రయోజనాలను కాపాడటానికి ఇది ఏర్పడింది. పసిఫిక్ మహాసముద్రంలోని పలావు దేశం 1994లో స్వాతంత్య్రం పొందడంతో ఈ మండలి లక్ష్యం పూర్తైది. అందుకే 1994, నవంబర్ 1 నుంచి మండలి తన కార్యకలాపాలను నిలిపేసింది.
  5. అంతర్జాతీయ న్యాయస్థానం: దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉంది. సభ్యదేశాల మధ్య వివాదాలను పరిష్కరించడం, సాధారణ సభ, ఇతర అనుబంధ సంస్థలకు న్యాయపరమైన సలహాలను ఇవ్వడం దీని ప్రధాన విధులు. ఇందులో 15 మంది న్యాయమూర్తులుంటారు. వీరిని సాధారణ సభ, భద్రతామండలి ఎన్నుకుంటాయి. వీరి పదవీకాలం తొమ్మిది ఏళ్లు. ప్రతి మూడేళ్లకు ఐదుగురు న్యాయమూర్తులను ఎన్నుకొంటారు. ఏ ఇద్దరు న్యాయమూర్తులు ఒకే దేశానికి చెంది ఉండకూడదు. ప్రస్తుత న్యాయమూర్తుల్లో భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ కూడా ఉన్నారు. ఆయన ఈ పదవిలో 2018 వరకు కొనసాగుతారు. జస్టిస్ దల్వీర్ భండారీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రస్తుత అధ్యక్షుడు స్లోవేకియాకు చెందిన పీటర్ టోమ్కా. ఆయన పదవీకాలం మూడేళ్లు.
  6. సచివాలయం: ప్రధాన కార్యాలయం న్యూయార్‌‌కలో ఉంది. ఇది పరిపాలనా మండలి. ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీనికి అధిపతిగా ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ ఉంటారు. భద్రతా మండలి సలహాపై సాధారణ సభ ప్రధాన కార్యదర్శిని నియమిస్తుంది. ఆయన పదవీకాలం ఐదేళ్లు. తిరిగి రెండోసారి ఎన్నికయ్యే అవకాశం ఉంది. జనవరి 1, 2007 నుంచి ఈ పదవిలో దక్షిణ కొరియాకు చెందిన బాన్ కీ మూన్ కొనసాగుతున్నారు. ఆయన మొదటి పదవీకాలం డిసెంబర్ 31, 2011న ముగిసినప్పటికీ తిరిగి ఎన్నికయ్యారు. జనవరి 1, 2012 నుంచి రెండో పర్యాయం పదవిలో కొనసాగుతున్నారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారు:
పేరు దేశం కాలం
ట్రిగ్విలీ నార్వే 1946-52
డాగ్ హామర్ జోల్డ్ స్వీడన్ 1953-61
యు థాంట్ మయన్మార్ 1961-71
కర్‌‌ట వాల్దీమ్ ఆస్ట్రియా 1972-81
జేవియర్ పెరేజ్ డిక్యులర్ పెరూ 1982-91
బౌత్రోస్ ఘలీ ఈజిప్ట్ 1992-96
కోఫి అన్నన్ ఘనా 1997-2006
బాన్ కీ మూన్ ద. కొరియా 2007, జనవరి 1..

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శులలో రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ట్రిగ్విలీ. రెండో ప్రధాన కార్యదర్శి అయిన డాగ్ హామర్ జోల్డ్ సెప్టెంబర్, 1961లో విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన పదవిలో ఉండగా మరణించిన ఏకైక ప్రధాన కార్యదర్శి. హామర్ జోల్డ్‌కు మరణానంతరం 1961లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. కర్‌‌టవాల్దీమ్ 1986 నుంచి 1992 వరకు ఆస్ట్రియా అధ్యక్షుడిగా పనిచేశారు. జేవియర్ పెరేజ్ డిక్యులర్ నవంబర్, 2000 నుంచి జూలై, 2001 వరకు పెరూ ప్రధానిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితికి, అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్‌కు సంయుక్తంగా 2001లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థలు
యూఎన్ ఉమెన్: మహిళల సాధికారత కోసం ఈ సంస్థను 2010లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన పుమ్‌జిల్ లాంబో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఉన్నారు.

ఐరాస శరణార్థుల హైకమిషనర్: 1950లో జెనీవా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటైంది. 1954, 1981ల్లో నోబెల్ శాంతి బహుమతి ఈ సంస్థకు లభించింది. పోర్చుగల్ దేశస్తుడైన ఆంటోనియో గుటెరెస్ ప్రస్తుత హైకమిషనర్. ఐరాస మానవహక్కుల హైకమిషనర్: 1993లో ఏర్పాటైంది. దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతం పిళ్లై ప్రస్తుత హైకమిషనర్.

అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్): 1946లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. 1965లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అమెరికాకు చెందిన ఆంథోని లేక్ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్.

ఐరాస అభివృద్ధి కార్యక్రమం: ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. న్యూజిలాండ్‌కు చెందిన హెలెన్ క్లార్క్ దీనికి కార్యనిర్వహణాధికారి.

ఆహార, వ్యవసాయ సంస్థ: అక్టోబర్ 16, 1945న ఏర్పాటైంది. ఇటలీ రాజధాని రోమ్‌లో దీని కేంద్ర కార్యాలయం ఉంది. అక్టోబర్ 16ను ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తారు. సంస్థ డెరైక్ట్ జనరల్ బ్రెజిల్‌కు చెందిన జోన్ గ్రాజియానో డిసిల్వా.

అంతర్జాతీయ కార్మిక సంస్థ: 1919లో ఏర్పాటైన ఈ సంస్థ మొదట నానాజాతి సమితికి అనుబంధంగా ఉండేది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రధాన కార్యాలయం ఉంది. 185 దేశాలకు సభ్యత్వం ఉంది. 1969లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. బ్రిటన్‌కు చెందిన గై రైడర్ ప్రస్తుత డెరైక్టర్ జనరల్.

అంతర్జాతీయ ద్రవ్యనిధి: ఈ సంస్థ డిసెంబర్ 27, 1945న ఏర్పాటైంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఇందులో 188 దేశాలకు సభ్యత్వం ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టీన్ లగార్డే ఐఎంఎఫ్ ప్రస్తుత మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో): నవంబర్ 16, 1945న ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉంది. బల్గేరియాకు చెందిన ఇరీనా బొకోవా ప్రస్తుత డెరైక్టర్ జనరల్. ఇందులో 195 దేశాలకు సభ్యత్వం ఉంది. నవంబర్, 2011లో పాలస్తీనా చివరి సభ్యదేశంగా చేరింది.

ప్రపంచ బ్యాంక్ గ్రూప్: డిసెంబర్ 27, 1945న ఏర్పాటైంది. 188 సభ్యదేశాలున్నాయి. కొరియన్ అమెరికన్ అయిన జిమ్ యోంగ్ కిమ్ ప్రస్తుత అధ్యక్షుడు. ఇందులో ఐదు సంస్థలున్నాయి. అవి..

ఐబీఆర్‌డీ: ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్; ఐఎఫ్‌సీ: ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్; ఐడీఏ: ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్; ఐసీఎస్‌ఐడీ: ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్; ఎంఐజీఏ: మల్టీలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ.

ప్రపంచ ఆరోగ్య సంస్థ: ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైంది. ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. చైనాకు చెందిన మార్గరెట్ చాన్ ప్రస్తుత డెరైక్టర్ జనరల్. ఈ సంస్థ ప్రపంచ ఆరోగ్య నివేదికను విడుదల చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సర్వేను కూడా నిర్వహిస్తుంది.

ప్రపంచ మేధో సంపత్తి సంస్థ: జూలై 14, 1967న ఏర్పాటైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాన్సిస్ గురే ప్రస్తుత డెరైక్టర్ జనరల్. మొత్తం 186 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది.

ప్రపంచ వాతావరణ సంస్థ: 1950లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. మొత్తం సభ్యదేశాలు 191. మైకేల్ జెరాడ్ ప్రస్తుత సెక్రటరీ జనరల్.

ప్రపంచ పర్యాటక సంస్థ: 1974లో ఏర్పడింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. జోర్డాన్‌కు చెందిన తలేబ్ రిఫాయ్ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ: 1957లో ఏర్పాటైంది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ప్రధాన కార్యాలయం ఉంది. జ పాన్‌కు చెందిన యుకియా అమనో ప్రస్తుత డెరైక్టర్ జనరల్. 2005లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు, అప్పటి డెరైక్టర్ జనరల్ ఈజిప్టుకు చెందిన మహ్మద్ ఎల్ బరాదీకి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ఐరాస గురించి ఏపీపీఎస్సీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..
  1. ఐక్యరాజ్యసమితిలో సార్వభౌమ దేశాలు ఎన్ని సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి?
  2. ఐక్యరాజ్యసమితి దినం?
  3. ఐక్యరాజ్యసమితిలో 193వ సభ్యదేశంగా చేరిన దక్షిణ సూడాన్ ఏ ఖండంలో ఉంది?
  4. ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్?
  5. ఐక్యరాజ్యసమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఏ దేశస్తుడు?
  6. 2013, ఫిబ్రవరి నుంచి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి?
  7. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రారంభమైన సంవత్సరం?
  8. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యులు కాగా శాశ్వత సభ్యులు కానివారు ఎందరు?
  9. ఐక్యరాజ్యసమితికి పూర్వం ఉన్న శాంతి సంస్థ?
  10. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించిన భారతీయ వ్యక్తి ఎవరు?
సమాధానాలు: 1) 193; 2) అక్టోబర్ 24; 3) ఆఫ్రికా; 4) ట్రిగ్విలీ; 5) దక్షిణ కొరియా; 6) అశోక్ కుమార్ ముఖర్జీ; 7) 1945; 8) 10; 9) నానాజాతి సమితి; 10) విజయలక్ష్మీ పండిట్. UNO
Published date : 04 Oct 2013 03:40PM

Photo Stories