ఐక్యరాజ్య సమితి - సమగ్ర స్వరూపం
మొదటి ప్రపంచ యుద్దానంతరం ఏర్పడిన నానాజాతి సంస్థ (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండో ప్రపంచ యుద్దాన్ని ఆపలేకపోయింది. ఫలితంగా ప్రపంచ శాంతి, దేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు 1945, అక్టోబరు 24న ఐక్యరాజ్య సమితి (యునెటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. ఈ రోజును ప్రతి ఏటా ఐరాస దినంగా నిర్వహిస్తారు. ఐరాస ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ‘యునెటైడ్ నేషన్స్’ అనే పదాన్ని తొలిసారి ప్రవేశపెట్టాడు. ఐరాస పతాకాన్ని 1947 అక్టోబరు 20న ఆమోదించారు. ఈ పతాకం లేత నీలం, తెలుపు రంగుల్లో ఉంటుంది. పతాకం మధ్యలో ఐరాస చిహ్నమైన ప్రపంచ పటం రెండు ఆలివ్ కొమ్మల మధ్య ఉంటుంది. ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం. ఐరాసాకి ఆరు అధికారిక భాషలున్నాయి అవి...చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, అరబిక్. 1973లో అరబిక్‌ను ఆరో అధికార భాషగా చేర్చారు. 1945, జూన్ 26న శానిఫ్రాన్సిస్కో నగరంలో జరిగిన సమావేశంలో యూఎన్ చార్టర్ పై 50 దేశాలు సంతకాలు చేశాయి. ఈ సమావేశానంతరం పోలండ్ 51వ దేశంగా చార్టర్‌పై సంతకం చేసింది. ప్రస్తుతం ఐరాసాలో 193 సభ్యదేశాలున్నాయి. 2011లో దక్షిణ సూడాన్ 193వ సభ్యదేశంగా చేరింది. వాటికన్, తైవాన్‌లు ఐరాసాలో సభ్యదేశాలు కావు.
ఐరాసాలో చివరిగా చేరిన దేశాలు:
189 - తువాలు (సెప్టంబరు, 2000)
190 - స్విట్జర్లాండ్ (సెప్టెంబరు, 2002)
191 - తూర్పు తిమోర్ (2006)
192 - మాంటెనెగో (2006)
193 - దక్షిణ సూడాన్ (జూలై, 2011)
ఆరు ప్రధాన విభాగాలు
- సాధారణ సభ:
ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలన్నీ సాధారణ సభలో సభ్యులుగా ఉంటాయి. ప్రతి దేశం సభకు ఐదుగురు ప్రతినిధులను పంపవచ్చు. కాని ఒక దేశానికి ఒక ఓటు హక్కు మాత్రమే ఉంటుంది. సాధారణ సభను ప్రపంచ పార్లమెంటుగా పరిగణిస్తారు. ఈ సభ ఏడాదికి ఒకసారి సమావేశం అవుతుంది. భద్రతామండలికి పది అశాశ్వత సభ్యదేశాలను ఎన్నుకోవడం, ఐరాస బడ్జెట్‌ను ఆమోదించటం, భద్రతా మండలి సిఫార్సు మేరకు ఐరాస సెక్రటరీ జనరల్‌ను ఎన్నుకోవటం వంటివి సాధారణ సభ ముఖ్య విధులు. సాధారణ సభ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఏడాది పదవీ కాలం ఉంటుంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
- భద్రతా మండలి:
భద్రతా మండలిలో సభ్యులుగా ఐదు శాశ్వత సభ్యదేశాలు, పది అశాశ్వత సభ్యదేశాలు ఉంటాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలకు వీటో హక్కు ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల కాలపరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడం, సభ్యదేశాల మధ్య వివరాలను పరిష్కరించడం వంటి విధులను భద్రతా మండలి నిర్వర్తిస్తుంది.
- ఆర్థిక, సామాజిక మండలి
ఆర్థిక, సామాజిక మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. ఈ మండలిలో మొత్తం 54 సభ్యదేశాలున్నాయి. కాలపరిమితి మూడేళ్లు. సాధారణ సభ ఏటా 18 దేశాలను మండలికి ఎన్నుకుంటుంది. ఐరాస, దాని సంస్థల మధ్య ఆర్థిక, సామాజిక రంగాల్లో సమన్వయం కోసం ఇది కృషి చేస్తుంది.
- ధర్మ కర్తృత్వ మండలి
వలస పాలనలో ఉన్న దేశాలు స్వాతంత్య్రం పొందేందుకు ఈ సంస్థ తోడ్పాటు అందిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూయర్క్‌లో ఉంది. ఇప్పటికే చాలా దేశాలకు స్వాతంత్య్రంపొందాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ సంస్థ ప్రాధాన్యం తగ్గింది.
- అంతర్జాతీయ న్యాయస్థానం
అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఉంది. ఈ న్యాయస్థానంలో మొత్తం15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీ కాలం తొమ్మిదేళ్లు. ఐరాస సభ్యదేశాల మధ్య వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం పరిష్కరిస్తుంది.
- సచివాలయం
ఐరాస రోజువారీ కార్యకలాపాలను సచివాలయం నిర్వహిస్తుంది. ఇది సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో పని చేస్తుంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఐదేళ్లు.
పేరు | దేశం | పదవీ కాలం |
ట్రిగ్వే లై | నార్వే | 1946-53 |
దాగ్ హామ్మర్స్‌జోల్డ్ | స్వీడన్ | 1953-61 |
యూ థాంట్ | మయన్మార్ | 1961-71 |
కుర్ట్ వాల్దీమ్ | ఆస్ట్రియా | 1972-81 |
జేవియర్ పెరేజ్ డికుల్లర్ | పెరూ | 1982-91 |
బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ | ఈజిప్ట్ | 1992-96 |
కోఫీ అన్నన్ | ఘనా | 1997-2006 |
బాన్ కీ మూన్ | దక్షిణ కొరియా | 2007-ప్రస్తుతం |
ఐరాస ప్రత్యేక ఏజెన్సీలు (స్వయంప్రతిపత్తి)
ఏజెన్సీ | ప్రధాన కార్యాలయం |
యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) | పారిస్ |
పుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో) | రోమ్ |
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో) | మాంట్రియల్ |
ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (ఐఎఫ్‌ఎడీ) | రోమ్ |
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ | జెనీవా |
ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో) | లండన్ |
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) | వాషింగ్టన్ డి.సి |
ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) | జెనీవా |
యునెటైడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్‌ఐడీవో) | వియన్నా |
యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) | బెర్న్ |
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ | వాషింగ్టన్ డి.సి |
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) | జెనీవా |
వరల్డ్ ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీవో) | జెనీవా |
వరల్డ్ మెటీయోరోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో) | జెనీవా |
యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) | మాడ్రిడ్ |
ముఖ్య సంస్థలు
సంస్థ | ప్రధాన కార్యాలయం |
యునెటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) | న్యూయార్క్ |
యునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ | జెనీవా |
యూఎన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ | న్యూయార్క్ |
యూఎన్ హై కమీషనర్ ఫర్ రెప్యూజీస్ | జెనీవా |
వరల్డ్ పుడ్ ప్రోగామ్ | రోమ్ |
యూఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ | వియన్నా |
యూఎన్ ఎన్విరాన్‌మొంట్ ప్రోగ్రామ్ | నైరోబి |
యూఎన్ పాపులేషన్ ఫండ్ | న్యూయార్క్ |
యూఎన్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్ ప్రోగ్రామ్ | నైరోబి |
యూఎన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ | జెనీవా |
యూఎన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ | జెనీవా |
యూఎన్ యూనివర్సిటీ | టోక్యో |
యూఎన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిస్ ఆర్మమెంట్ | జెనీవా |
యూనివర్సిటీ ఫర్ పీస్ | కోస్టారికా |
యూఎన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ విమెన్ (యూఎన్ ఇన్‌స్త్రా) | డొమినికన్ ఆఫ్ రిపబ్లిక్ |