Skip to main content

పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం విజయవంతమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మే 22న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగం ద్వారా 615 కిలోల బరువు గల రీశాట్-2బీ(రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) అనే ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రేవేశపెట్టింది.రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. రీశాట్-2బీ అయిదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది.

రక్షణశాఖకు కీలకం...
అత్యంత ఆధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్-2బీ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది. అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. రిశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో రిశాట్-2బి నాలుగవది. ఇప్పటికే రిశాట్-1, రిశాట్-2, స్కాట్‌శాట్-1 అనే మూడు ఉపగ్రహాలు విజయవంతంగా రోదసీలో పనిచేస్తున్నాయి.

జులైలో చంద్రయాన్-2...
పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్ కె. శివన్ మాట్లాడుతూ..పీఎస్‌ఎల్వీ ద్వారా ఇప్పటి వరకు 353 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. చారిత్రకమైన చంద్రయాన్-2 ప్రయోగాన్ని జులై 9-16 మధ్య చేపట్టనున్నామని వెల్లడించారు. చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం తర్వాత సెప్టెంబరులో చంద్రుడిపై కాలుమోపుతామని అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఆతర్వాత హైరెజెల్యూషన్ కాటో 3 ఉపగ్రహం సహా మరికొన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని శివన్ తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : మే 22
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 22 May 2019 04:08PM

Photo Stories