Skip to main content

నవరత్నాలు..!

‘నేను విన్నాను... నేను ఉన్నాను’... అంటూ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 3,648 కి.మీ.పాదయాత్రలో ఇచ్చిన హామీలు మానిఫెస్టోగా రూపుదాల్చాయి.
ఆ మానిఫెస్టోలోని అంశాలే ఈ నవరత్నాలు. వీటికికులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. పార్టీలు అసలే లేవు. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి.. మాత్రమే ఈ హామీల లక్ష్యమని..సుపరిపాలనే ప్రభుత్వధ్యేయమని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదర్శపాలకు శ్రీకారం చుట్టారు.

నవరత్నాలు 9. అవి
  1. ఆరోగ్యశ్రీ
  2. ఫీజు రీయంబర్స్‌మెంట్
  3. పేదలందరికీ ఇళ్లు
  4. వైయస్‌ఆర్ ఆసరా వైయస్‌ఆర్చేయూత
  5. పించన్ల పెంపు
  6. అమ్మఒడి
  7. వైయస్‌ఆర్ రైతు బరోసా
  8. జలయజ్ఞం
  9. మధ్యనిషేధం

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,27,974.99 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జులై 12 శుక్రవారం, 2019న శానససభలోపవేశపెట్టారు. ఈ నవరత్నాలలోని కీలక అంశాలు ఏమిటో, ఈ నవరత్నాలకు మొదటి వార్షిక బడ్జెట్ కేటాయింపు ఏవింధంగా జరిగిందో పరిశీలిద్దాం!

  1. ఆరోగ్యశ్రీ
    ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ మేలు జరుగుతుందనిఅంచనా. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తారు. వెయ్యి మించిన అన్ని కేసులకు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో మంచి ఆస్పత్రులను ప్రభుత్వం జాబితాలో చేర్చుతుంది. ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యం అందిస్తారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను దీని పరిధిలోకి తెస్తారు. ఆపరేషన్ చేయించుకున్న లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక చేయూతనందిస్తారు. కిడ్నీవ్యాధి, తలసేమియాతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మరో రెండేళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతారు. వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు అంటే నెలకు రూ. 40 వేల ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.
    2019-20 బడ్జెట్‌లో..
    • ఆరోగ్యశ్రీకి రూ. 1740 కోట్లు
    • ప్రతి మండలంలో 108 సేవలు ఉండాలని, 20 నిమిషాల్లో రోగిని చేరుకోవాలని రూ. 143.38 కోట్లతో 432 అదనపు అంబులెన్‌‌సలు సేకరించటం.
    • గ్రామ స్థాయిలో వైద్య అధికారులతో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 104 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రూ.179.76 కోట్లతో 676 అదనపు వాహనాలను సేకరించటం.
    • ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిని మార్చేందుకు రూ. 1500 కోట్లు
    • పాడేరు, అరకు ప్రాంతాల్లో గిరిజన వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సంవత్సరానికి రూ. 66 కోట్లు
    • అదనంగా ఒక్కోదానికి రూ. 66 కోట్ల ప్రాథమిక బడ్జెట్ కేటాయిస్తూ పల్నాడుకు సేవ చేయాలని గురజాల వద్ద, ఉత్తరాంధ్రకు సేవలందించాలని విజయనగరం వద్ద రెండు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని, రూ. 50 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రానికి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు యోచిస్తుంది.

  2. ఫీజు రీయంబర్స్‌మెంట్
    1వ తరగతి మొదలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువుల వరకు పేదవాడి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఈ పథకం కింద అందుతుంది. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ మొత్తం కాకుండా విద్యార్థులకు వసతి, భోజనం కోసం ఏటా అదనంగా రూ. 20 వేలు ప్రభుత్వ ఇస్తుంది. ఈ పథకానికి ‘జగనన్న విద్యా దీవెన’ అని కొత్తగా పేరు పెట్టడం జరిగింది.
    2019-20 బడ్జెట్‌లో..
    • జగనన్న విద్యా దీవెనకి రూ.4,962.3 కోట్లు

  3. పేదలందరికీ ఇళ్లు
    ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనం చేకూరుతుంది. ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది లక్ష్యం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని ఆడవారి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 1.5 సెంట్ల ఇంటిస్థలం ఇచ్చి..పైసా ఖర్చులేకుండా పక్క ఇల్లు పొందేలా చేస్తారు. వైయస్సార్ ఇళ్ల పథకం కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేస్తారు. 2020 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభమై, ఉగాది నాటికి ఇళ్లస్థలాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం అన్ని జిల్లాలో పూర్తవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 300 చదరపు అడుగుల వరకు గల గృహాలకు సంబంధించి పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు రుణాన్ని మాఫీ చేస్తుంది.
    2019-20 బడ్టెలో..
    • పేదలందరికీ ఇళ్లకు రూ. 8615 కోట్లు

  4. వైయస్‌ఆర్ ఆసరా, వైయస్సార్ చేయూత
    ఈ పథకం కింద వచ్చే ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికే నేరుగా ఇస్తారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు. ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పింఛన్లు ఇస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, అల్ప సంఖ్య వర్గాల, ఇతర సంక్షేమ ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ సంవత్సరం పునరుద్ధరించాలని ప్రతిపాదించడం జరిగింది. పునరుద్ధరించిన తరువాత ఈ సంస్థలు లబ్ధిదారులను గుర్తింపును ఈ సంవత్సరంలోనే చేపట్టడం జరుగుతుంది. గ్రామ, వార్డు వలంటీర్ల సహకారంతో సంబంధిత కార్పొరేషన్ ద్వారా దీన్ని అమలు చేస్తారు. వచ్చే సంవత్సరాల నుంచి ప్రయోజనాలను పొందుపర్చుతారు.

  5. పించన్ల పెంపు
    ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.24,000 నుంచి రూ.48,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం పింఛన్ తీసుకోవడానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గుతుంది. ప్రభుత్వం అవ్వతాతలకు నెలకు రూ.2000, ఇస్తూ దానిని రూ.3 వేలకు పెంచుకుంటూ పోతుంది. జూన్ 1 నెల నుంచి రూ. 2,250, ఆ తర్వాత సంవత్సరం రూ. 2,500, ఆ తర్వాత సంవత్సరం రూ. 2,750, ఆ తర్వాత ఏడాది రూ. 3000. ఇలా ప్రభుత్వం పెంచుతుంది. ముఖ్యమంత్రిగా జగన్ తొలి సంతకం దీనిపై చేయడం గమనార్హం. దివ్యాంగులకు రూ.3000 పింఛన్ పెంచారు. డయాలసిస్ రోగులకు రూ. 3,500 నుంచి రూ. 10,000కు పెంచారు. వితంతువులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌ను రూ. 2,250కు పెంచారు.
    2019-20 బడ్జెట్‌లో..
    • పించన్ల పెంపుకు రూ.15,746.58 కోట్లు

  6. అమ్మఒడి
    ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థులకే కాదు, ఇంటర్ విద్యార్థులకు సైతం అమ్మఒడి వర్తిస్తుంది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తారు. ప్రతి తల్లి తన పిల్లలను సంతోషంగా స్కూల్‌కి పంపడానికి, బాలల భవిష్యత్తుకు మంచి పునాది ఏర్పాటు చేయడమే ఈ పథకం లక్ష్యం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే, ఆక్షయ పాత్ర ద్వారా రోజూ రుచికరమైన, బలవర్ధకమైన భోజనం, ప్రతి ప్రభుత్వ బడిలోనూ తెలుగుతో పాటు ఇంగ్లీషు మాధ్యమం, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత దిశగా నడిపించేందుకు వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
    2019-20 బడ్జెట్‌లో..
    • అమ్మ ఒడికి రూ. 6455 కోట్లు
    • ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు
    • మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1077 కోట్లు
    • పాఠశాల నిర్వహణ గ్రాంటుకు రూ. 160 కోట్లు
    • జగనన్న విద్యా దీవెన పథకానికి రూ. 4962.3 కోట్లు

  7. వైయస్‌ఆర్ రైతు బరోసా
    ఈ పథకంతో రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 నుంచి రూ.లక్ష వరకూ ప్రయోజనం ఉంటుంది. ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్, ఉచిత భీమా, ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్, టోల్ టాక్స్ మాఫీ ఇందులో వర్తించే అంశాలే.
    ప్రభుత్వం ఏర్పడ్డ రెండో ఏడాది నుంచి మే నెలలో పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 చొప్పున వరుసగా నాలుగేళ్లు అందిస్తారు. వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్‌కు రూ.1.50కు తగ్గిస్తారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకతి వైపరీత్యాల సహాయ నిధి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరమైతే ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేస్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరించి.. రెండో ఏడాది నుంచి సహకార డైరీలకు పాలుపోసే పాడి రైతులకు లీటర్‌కు రూ.4 సబ్సిడీ ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని అప్పులవాళ్లు తీసుకోకుండా చట్టం చేస్తారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు ‘వైఎస్సార్ అగ్రి ల్యాబ్’లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రైతుల కోసం 13 శీతల గిడ్డంగులు, 24 గోదాముల ఏర్పాటు, కౌలు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.4,000 సాయాన్ని రూ.10,000 పెరుగుతుంది.
    గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా ప్రస్తుత ప్రభుత్వం రూ.7 లక్షల చొప్పున సాయం అందిస్తుంది. రైతు పక్షపాతిగాచెప్పే జగన్ ప్రభుత్వం వైయస్సార్ పుట్టినరోజును జులై 8న ఆంధ్రప్రదేశ్ రైతుదినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.
    2019-20 బడ్జెట్‌లో..
    • వైయస్‌ఆర్ రైతు బరోసాకు రూ. 8,750 కోట్లు

  8. జలయజ్ఞం
    లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతుల లోగిళ్లలో సిరులు నింపుతారు.
    కృష్ణా, గోదావరి ఆయకట్టును స్థిరీకరిండం, రాయలసీమ, ఉత్తరాంధ్రప్రాంతాలను హరితాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దడం మహానేత వైయస్‌ఆర్ దార్శనికత. ఆయన కలను సహకారం చేసేందుకు పోలవరం జూన్ 2021 నాటికి అధిక ప్రాధాన్యంతో పూర్తి చేయడానికి, తగిన బడ్జెట్‌ను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మానవతా దృక్పథంతో ప్రాజెక్టు ప్రభావిత కేటాయింపును, పునరావాసాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒక సంవత్సర కాలంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు స్వరంగం పూర్తికానుంది. దీన్ని వలన 1.19 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు. మిగిలిన ఆయకట్టు ఏర్పాటు చేయడానికి రెండు సంవత్సరాల కాలంలోపు రెండో దశ పూర్తవుతుంది. అవుకు స్వరంగాన్ని పూర్తి చేస్తూ ఒక సంవత్సరంలో గాలేరు-నగరి ప్రాజెక్టు ఒకటవ దశను పూర్తి చేసేందుకు గండికోట రిజర్వాయర్‌లో నీటి నిల్వ, కడప జిల్లాలోని ఆయకట్టు దారులకు నీటి సరఫరా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.98 లక్షల ఎకరాలకు సాగునీరు కల్పించేందుకు హంద్రీనీవా సృజల స్రవంతి ఒకటవ దశను పూర్తి చేసేందుకు చర్యలు.
    అనంతపురం, చిత్తూరులోని చెరువులను నింపేందుకు రెండవ దశను పూర్తి చేయడం జరుగుతుంది. వెనుకబడిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సత్వర సాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు వంశధార, సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు రాష్ట్రంలో సరస్సులు, చెరువులను పునరుద్ధరించేందుకు చర్యలు.
    2019-20 బడ్జెట్‌లో..
    • జలయజ్ఞంకు రూ. 13139.13 కోట్లు

  9. మద్య నిషేధం
    మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి, మధ్యాన్ని 5 స్టార్ హోటల్స్‌కి మాత్రమే పరిమితం చేయడం.

ఇతరాలు..
వైయస్‌ఆర్ బీమా
18 నుంచి 60 సంవత్సరాల మధ్య గల వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. లక్ష అందించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. బీసీ, ముస్లిం, క్రిస్టియన్ సామాజికవర్గాలకు చెందినవారు సహా ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల సాయం
2019-20 బడ్జెట్‌లో..
  • వైయస్‌ఆర్ బీమా పథకానికి రూ.404.02 కోట్లు

వైయస్‌ఆర్ కల్యాణ కానుక
వైయస్‌ఆర్ కల్యాణ కానుక ద్వారా బీసీ కులాలకు చెందిన వధువులకు రూ. 50 వేలు, ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యలకు చెందిన వధువులకు రూ.లక్షా కల్యాణ కానుక ఇవ్వడం జరుగుతుంది.

పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు
ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా ఉద్యోగ కల్పన ముఖ్య ఉద్దేశంగా ప్రత్యేక హోదా సాధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హోదా లేకుండా కూడా పారిశ్రామిక, మౌలిక సదుపాయల అభివృద్ధి ద్వారా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఉపయోగించుకునే పరిశ్రమలు స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తోంది.
ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు, గిరిజన సామాజిక, ఆరోగ్య కార్యకర్తలకు రూ. 400 నుంచి 4000లకు, మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు, సెర్ప్ గ్రామ వ్యవస్థ సహాయకుడిగా, మెప్మా రిసోర్స్ పర్సన్లకు నెలకు రూ. 5 నుంచి 10 వేలకు, హోంగార్డులకు రూ. 18 వేలు ఉంటే 21,300 ప్రభుత్వం పెంచింది. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేలకు, అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 10,500 నుంచి రూ.11,500లకు, అంగన్‌వాడీ హెల్పర్లకు రూ. 6 నుంచి రూ. 7 వేలకు పెంచింది.
ఆటో రిక్షాలు, ట్యాక్సీలను సొంతంగా కలిగి ఉన్న డ్రైవర్లు ఓలా, ఊబర్ వంటి యాప్ వారితో పోటీపడలేకపోతున్నారు. బీమా, ఫిట్‌నెస్ మరమ్మతులు, ఇతర అవసరాల నిమిత్తం ఏడాదికి రూ. 10 వేలు సాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది. సొంత ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల ప్రయోజనాలకు బడ్జెట్‌లో రూ. 400 కోట్లు న్యాయవాదులకు ప్రాక్టీసు మొదటి మూడు సంవత్సరాల కాలంలో రూ. 5 వేల నెలవారి వేతనాన్ని సమకూర్చడానికి ప్రతిపాదిస్తుంది. ఇందుకు రూ. 10 కోట్లు, అంతేకాకుండా రూ.100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమం కోసం ట్రస్టు ఏర్పాటు.

యువత- ఉపాధి:
ప్రతి గ్రామంలో గ్రామసచివాలయం ద్వారా అదే ఊరిలోని 10 మంది యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. ప్రతి గ్రామంలో, వార్ట్‌లో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్వథం ఉన్న యువతీ/యువకులని నెలకు రూ.5000ల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్‌గా, వార్డ్ వాలంటీర్‌గా నియమిస్తారు. వారు గ్రామ సచివాలయానికి, వార్డ్ సచివాలయానికి అనుసంధాన కర్తగా ఉండి ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, వాటిలో భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు, వైఎస్‌ఆర్ రైతుభరోసా నుంచి వైయస్‌ఆర్ చేయూత వరకు అన్ని పథకాలు ఇంటివద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు. వీళ్లకి మెరుగైన ఉద్యోగాలు వచ్చేవరకు సచివాలయాలలో అనుసందానమై ఉంటారు. ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రేషన్, పింఛన్...వాటికి సంబంధించిన సమస్యలేమైనా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరిస్తారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2,30,000 లక్షల ఉద్యోగాలతోబాటు ప్రతి సంవత్సరం జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోవున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటారు.ప్రభుత్వం రేషన్ సరుకుల డోర్ డెలవరీ సౌకర్యం కల్పించనున్నారు. నాణ్యమైన సరుకులు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సరుకులు ఇంటింటికీ అందజేస్తారు. దీనికోసం 2019-20 బడ్జెట్‌లో రూ.3750 కోట్లు కేటాచించడం జరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల కోసం వైయస్‌ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలుకు రూ. 1140 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

చివరిగా..
మీకో విషయం తెలుసా... చరిత్రలో స్వర్ణయుగంగా పేరుగాంచిన గుప్తుల కాలంలో రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలోని 9 మంది మంత్రులకు ‘నవరత్నాలు’ అనే పేరుంది. గుప్తుల నవరత్నాలు, వైయస్సార్‌సీపీ నవరత్నాలు ఒకటి కావు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ వ్యత్యాసాన్ని గమనించాలి.
Published date : 14 Aug 2019 03:54PM

Photo Stories