Skip to main content

రైల్వే బడ్జెట్ 2015-16

భారతీయ రైల్వే వ్యవస్థను ఆధునికీకరించి ‘హైటెక్’ మార్గంలో నడిపే దిశగా అడుగులు వేసింది ఎన్డీఏ సర్కారు. కొత్త రైళ్లు, కొత్త మార్గాలు, కొత్త ప్రాజెక్టులు వంటి ప్రకటనలు పక్కనపెట్టి..
వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచటం, మరింతగా విస్తరించటం, బలోపేతం చేయటం, ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు 2015-16 ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీఏ సర్కారు గురువారం(ఫిబ్రవరి 26న) ప్రవేశపెట్టిన రెల్వే బడ్జెట్ మొత్తం వ్యయం రూ. 1,00,011 కోట్లు.

ఎన్‌డీఏ సర్కారు తలపెట్టిన ‘స్మార్ట్ సిటీ’ ప్రణాళికలు, ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాలకు అనుగుణంగా.. రైళ్లు, రైల్వేస్టేషన్లు, రైల్వే సేవలు, సదుపాయాలను సాంకేతికంగా ఆధునీకరించే ప్రణాళికలు ప్రకటించారు. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యంతో మొదలుపెట్టి.. ప్రయాణికుల సదుపాయాలు, సౌకర్యాలను ఆధునీకరించటం కోసం తాజా బడ్జెట్‌లో రూ. 12,500 కోట్లు కేటాయించారు. రైళ్ల వేగాన్ని గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వరకూ పెంచనున్నారు. మొత్తంగా రాబోయే ఐదేళ్లలో 8.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రైల్వే వ్యవస్థను బలోపేతం చేసి ప్రయాణికులకు భిన్నమైన అనుభవాన్ని అందిస్తామని మంత్రి ప్రకటించారు.

రైల్వే బడ్జెట్ తీరు (రూ. కోట్లలో)

అంశం

2013-14

2014-15

2015-16

మొత్తం ఆదాయం

1,39,558.18

1,59,248.00

1,83,578.00

వ్యయం

1,30,320.75

1,45,970.00

1,62,210.00

నికర రెవెన్యూ

11,749.07

16,452.59

25,076.45

డివిడెండ్ చెల్లింపులు

8,008.67

9,174.13

10,810.74

నిర్వహణ రేషియో

93.6%

91.8%

88.5%

మిగులు

3,740.40

7,278.46

14,265.71

(రైల్వే బడ్జెట్ 2015-16 పత్రాల ఆధారంగా..)
Current Affirs

బడ్జెట్ ముఖ్యాంశాలు
  • 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం
  • ప్రత్యేక ఈ-టికెటింగ్ వెబ్‌సైట్ రూపకల్పన, డెబిట్ కార్డుతో టికెట్లు పొందే సౌకర్యం
  • ఆన్‌లైన్‌లో విశ్రాంతి గదుల బుకింగ్, వికలాంగులకు వీల్‌చైర్ బుకింగ్
  • టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే నచ్చిన ఆహారం ఎంచుకునే సదుపాయం
  • బ్రాండెడ్ సంస్థలు, ఫుడ్-చైన్ సంస్థలతో ప్రయాణికులకు ఆహార సరఫరా
  • 120 రోజుల ముందుగానే ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
  • స్టేషన్‌కు వచ్చిన ఐదు నిమిషాల్లోనే సాధారణ టికెట్ పొందేలా సదుపాయాలు
  • రైల్ కమ్ రోడ్ టికెట్లను మరిన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించటం
  • రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయటం
  • ప్రయాణికుల ఫిర్యాదులు, సూచనల కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ల రూపకల్పన
  • భద్రత, సేవలకు సంబంధించి 24 గంటలూ పనిచేసే ప్రత్యేక ఫోన్ లైన్లు
  • బోగీల ద్వారాలను వెడల్పు చేయటం, పెద్ద స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల అమరిక
  • రైళ్లలో బెర్తుల ఆధునీకరణ, డిజైన్, నాణ్యత, శుభ్రతల ప్రమాణాల పెంపు
  • స్లీపర్ బోగీల్లో పై బెర్తుల్లోకి ఎక్కేందుకు ఆధునిక మడత నిచ్చెన్ల అమరిక
  • రైల్వే స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్త విభాగం ఏర్పాటు
  • బోగీల్లోనూ చెత్తడబ్బాల ఏర్పాటు, రైలు బోగీల్లో బయో టాయిలెట్లు ఏర్పాటు
  • శతాబ్ది రైళ్లలో వినోద సదుపాయాలు, అన్ని రైళ్లలో మొబైల్ ఫోన్ చార్జింగ్ సౌకర్యాలు
  • మహిళల భద్రత కోసం రైళ్లలో సీసీటీవీ కెమెరాలతో నిఘా
  • 9 రైల్వే కారిడార్లలో రైళ్ల వేగాన్ని 200 కిలోమీటర్ల వరకూ పెంచటం
  • ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్లు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థను స్థాపించటం
4-5-11 మంత్రం
రేల్వేల సమగ్రాభివృద్ధితో దేశ ఉన్నతికి పాటు పడేలా ఎన్డీఏ సర్కారు 4-5-11 మంత్రాన్ని జపించింది. వీటిలో ప్రధానంగా నాలుగు లక్ష్యాలు, ఐదు చోదకాలు, 11 ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

ఐదు చోదకాలు
  1. రైల్వేలను సంపూర్ణంగా రూపాంతరం చేయటానికి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక
  2. నిధుల లభ్యత, చిట్టచివరి మైలు అనుసంధానం కోసం రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బహుముఖ సంస్థలు, ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం
  3. ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల సమీకరణ
  4. నిర్వహణ విధానాలను పునర్‌వ్యవస్థీకరించటం
  5. పాలన, పారదర్శకతల ప్రమాణాలను నిర్దేశించటం
నాలుగు లక్ష్యాలు
  1. ప్రయాణికుల అనుభూతిని సుస్థిరంగా మెరుగుపరచటం
  2. రైల్వేలను సురక్షితమైన రవాణా సాధనంగా మలచటం
  3. రైల్వే మౌలిక సదుపాయాల సామర్థ్యాలను విస్తరించటం, ఆధునీకరించటం
  4. సామర్థ్య విస్తరణకు, క్షీణిస్తున్న ఆస్తులను తిరిగి బలోపేతం చేయటానికి వీలుగా భారీ మిగులు సృష్టించటం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించటం
11 అంశాలు
  • ఆర్థిక వ్యవస్థ ప్రధాన చోదకశక్తిగా రైల్వేలను మళ్లీ అభివృద్ధి చేయటం
  • అధిక పెట్టుబడుల కోసం వనరులను సమీకరించటం
  • భారీ మార్గాలపై ఒత్తిడిని తగ్గించటం, రైళ్ల వేగాన్ని పెంచటం
  • ప్రయాణ సదుపాయాలు, భద్రతాచర్యలు మెరుగుపరచటం
  • రైల్వే మౌలికసదుపాయాల బలోపేతం
  • ఎంపిక చేసిన శతాబ్ది రైళ్లలో వినోద సదుపాయాలు
  • బి-కేటగిరీ రైల్వేస్టేషన్లలోనూ వైఫై సదుపాయం
  • మరో 200 రైల్వే స్టేషన్లు ఆదర్శ స్టేషన్ల పథకం కిందికి తేవటం
  • రోజు వారీ ప్రయాణికుల రవాణా సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 2.1 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచటం
  • రైలు మార్గాల నిడివిని 20 శాతం - ఇప్పుడున్న 1.14 లక్షల కిలోమీటర్ల నుంచి 1.38 లక్షల కిలోమీటర్లకు - పెంచటం
  • వార్షిక సరుకు రవాణా సామర్థ్యాన్ని 100 కోట్ల టన్నుల నుంచి 150 కోట్ల టన్నులకు పెంచటం వంటివి ఉన్నాయి.
ఆదాయ వ్యయాలు
రూపాయి రాక..

ఆదాయ మార్గం

వచ్చే మొత్తం

సరకు రవాణా

65

ప్రయాణికుల చార్జీలు

25

ఇతర చార్జీలు

3

చిల్లర వ్యాపారాలు

4

ఇతరత్రా ఆదాయం

3



రూపాయి పోక..

వ్యయ మార్గం

ఖర్చు మొత్తం

భత్యాలు, అలవెన్సులకు

33

ఇంధనం

19

నిల్వ

3

తరుగుదల నిధి

6

పెన్షన్ల నిధి

17

లీజు చార్జీలు

4

డివిడెండ్

6

పెట్టుబడి నిధి

0.03

అభివృద్ధి నిధి

2

రుణాలు

0.01

ఇతరత్రాలు

9.96



ఆధునీకరణ, విస్తరణలకు 8.5 లక్షల కోట్లు
రానున్న ఐదేళ్లలో (2015-19 కాలం) రూ. 8.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రైల్వేల ఆధునీకరణ, ఇతర విస్తరణ ప్రాజెక్టుల కోసం వినియోగించనున్నట్లు రైల్వేమంత్రి ప్రకటించారు. ఈ మేరకు రైల్వే ఆదాయంలో పెట్టుబడుల కోసం వినియోగించే మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో 8.2%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11.5% పెరగనుంది. రానున్న 3, 4 ఏళ్లలో రైల్వే శాఖకు రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం కాగా సాధారణ బడ్జెట్ ద్వారా లభించే మద్దతు కనీసం రూ. 50 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 9,420 కిమీల రైల్వేలైన్ల సామర్ధ్యాన్నిపెంచేందుకు రూ. 96,182 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నామన్నారు.

2015-19 కాలానికి ప్రతిపాదిత పెట్టుబడులు

రూ.కోట్లలో

నెట్‌వర్క్ రద్దీ నివారణ (ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు,

విద్యుదీకరణ.. ట్రాఫిక్ సౌకర్యాలు, విద్యుదీకరణ సహా

డబ్లింగ్ పనులు)

1,99,320

నెట్‌వర్క్ విస్తరణ (విద్యుదీకరణ సహా)

1,93,000

జాతీయ ప్రాజెక్టులు (ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్ కనెక్టివిటీ కోసం)

39,000

రక్షణ (ట్రాక్ నిర్వహణ, వంతెనల నిర్మాణం, ఆర్వోబీ,

ఆర్‌యూబీ, సిగ్నలింగ్ వ్యవస్థ, టెలికం)

1,27,000

సమాచార సాంకేతికత (ఐటీ)/పరిశోధన

5,000

రోలింగ్ స్టాక్ (ఇంజన్లు, బోగీలు, వ్యాగన్లు.. మొదలైనవి)

1,02,000

ప్రయాణికుల సదుపాయాలు

12,500

హైస్పీడ్ రైల్ అండ్ ఎలివేటెడ్ కారిడార్

65,000

స్టేషన్ల అభివృద్ధి, సరుకు నిల్వ సదుపాయాలు

1,00,000

ఇతర అవసరాలు

13,200

మొత్తం

8,56,020

Current Affirs

మెట్రో సిటీల మధ్య రైళ్ల వేగం పెంపు
మెట్రో సిటీల మధ్య నడిచే రైళ్ల వేగం గణనీయంగా 200 కిలోమీటర్ల వరకు పెరగనుంది. ఎంపిక చేసిన తొమ్మిది రైల్వే కారిడార్లలో ప్రస్తుతం గంటకు 110, 130 కిలోమీటర్లుగా ఉన్న రైళ్ల వేగాన్ని.. ఇకపై 160, 200 కిలోమీటర్లకు పెంచనున్నారు.

స్టేషన్లు, ట్రాక్‌ల వెంట సౌర విద్యుదుత్పత్తి
విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రైల్వేలకు చెందిన స్థలాలను, స్టేషన్లను, ట్రాకులనుఇలా అవకాశమున్న ప్రతి చోటాసౌరఫలకాలను ఏర్పాటుచేసిసౌర విద్యుదుత్పత్తి కోసం ఉపయోగించుకోనున్నారు.

ప్రభుత్వ సహకారం 40,000 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రైల్వే బడ్జెట్ వ్యయం రూ. 1,00,011 కోట్లు కాగా, అందులో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం రూ. 40 వేల కోట్లు ఉంది. అంటే మొత్తం రైల్వే బడ్జెట్‌లో ప్రభుత్వం మద్దతు 41.6%. గత ఆర్థిక సంవత్సరం రైల్వేలకు ప్రభుత్వం ఇచ్చిన బడ్జెటరీ మద్దతు రూ. 30 వేల కోట్లు. మిగిలిన మొత్తాన్ని అంతర్గత వనరుల ద్వారా రూ. 17,793 కోట్లు, డీజిల్ సెస్ ద్వారా రూ. 1,645 కోట్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా రూ. 17 వేల కోట్లు, ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్య పథకాల ద్వారా రూ. 6 వేల కోట్లను సేకరించనున్నారు.

9,420 కిలోమీటర్ల లైన్ల సామర్థ్యం పెంపు
9,420 కిలోమీటర్ల రైల్వే లైన్ల సామర్థ్యాన్ని విస్తరించటానికి రూ. 96,182 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఈ ఏడాది నాలుగు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం, మరో 6,608 కిలోమీటర్ల ట్రాక్ విద్యుదీకరణ పూర్తవుతుందని అంచనా.

ప్రయాణికుల స్వర్గధామంగా రైల్వేలు
ప్రయాణికులకు సరికొత్త రైల్వేలను పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన రైల్వే మంత్రి రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, బయో టాయ్‌లెట్లు, ఐదు నిమిషాల్లో జనరల్ టికెట్ల జారీ, రైళ్లలో భద్రత, కొత్త డిజైన్లతో సీట్లు, 24 గంటల హెల్ప్‌లైన్, సకల రుచులతో నాణ్యమైన ఆహారం, వైఫై వంటి అనేక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ వసతుల కల్పన కోసం మొత్తంగా రూ. 12,500 కోట్లను కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపుల కంటే 67 శాతం అధికం కావడం గమనార్హం.

స్వచ్ఛ రైల్ - స్వచ్ఛ భారత్
స్టేషన్లను, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక విభాగంతో స్వచ్ఛ రైల్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గతంలో చేపట్టిన 120 రైల్వే స్టేషన్లకు తోడు మరో 650 స్టేషన్ల పరిధిలో కొత్త మరుగుదొడ్లను నిర్మించనున్నారు.

5 నిమిషాల్లో జనరల్ టికెట్.. 120 రోజుల ముందే రిజర్వేషన్
జనరల్ టికెట్లు పొందడానికి ప్రయాణికులు పడే కష్టాలు దూరం చేసేందుకు ‘ఆపరేషన్ ఐదు నిమిషాలు’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. స్టేషన్‌కు వచ్చిన ప్రతి ప్రయాణికుడు ఐదు నిమిషాల్లోనే జనరల్ టికెట్ పొందగలిగేలా చేయడమే దీని లక్ష్యం. అలాగే ప్రస్తుతం 60 రోజులు ముందుగా ఉన్న టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని 120 రోజులకు పెంచనున్నారు.

24 గంటల హెల్ప్‌లైన్.. మహిళల భద్రతకు సీసీ కెమిరాలు
ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు 138 హెల్ప్‌లైన్ నంబర్ ఇకపై 24/7 పనిచేయనుంది. దీంతో పాటు 182 నంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఓ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి పరుస్తారు. మహిళల భద్రత కోసం ఎంపిక చేసిన బోగీల్లో నిఘా కెమెరాలను అమర్చనున్నారు.

టికెట్‌తోపాటే నచ్చిన ఆహారం
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్ సమయంలోనే ప్రయాణికులకు నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన రైల్వేశాఖ ప్రస్తుత బడ్జెట్‌లో వారికి ఇష్టమైన ప్రాంతీయ రుచులను అందించే కార్యక్రమాన్ని చేపట్టనుంది.

ఎస్‌ఎంఎస్ అలర్ట్
రైలు వచ్చి/పోయే తాజా వేళలను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అందించేలా ఎస్‌ఎంఎస్ అలర్ట్ సేవలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే ప్రయాణికులు దిగే స్టేషన్ రావడానికి అరగంట ముందే ఎస్‌ఎంఎస్ ద్వారా అలర్ట్ చేస్తారు.

ఆహార ధాన్యాల నుంచి బొగ్గు దాకా.. సరుకు రవాణా చార్జీల పెంపు
ప్రయాణ చార్జీలుఏ మాత్రం పెంచని రైల్వే మంత్రి 12 రకాల సరకుల రవాణా చార్జీలను మాత్రం 0.8 శాతం నుంచి 10 శాతం దాకా పెంచారు. రవాణా చార్జీలు సిమెంటుపై 2.7%, బొగ్గుపై 6.3%, ఇనుము..ఉక్కుపై 0.8%, ఆహార ధాన్యాలు..పప్పు ధాన్యాలపై 10%, వేరుశనగ నూనెపై 2.1%, ఎల్‌పీజీపై 0.8%, కిరోసిన్‌పై 0.8% మేర పెరగనున్నాయి. మరోవైపు సున్నపురాయి, డోలోమైట్, మ్యాంగనీస్, స్పీడ్ డీజిల్ ఆయిల్ మొదలైన వాటి రవాణా చార్జీలు మాత్రం సుమారు 1 శాతం దాకా తగ్గనున్నాయి.

భారత రైల్వేలు- సరకు రవాణా చార్జీలు

సరుకుల వర్గీకరణ

ధరలు (రూ.లలో/టన్నుకు)

 

సగటు దూరం (కి.మీ.లో)

ప్రస్తుత

ప్రతిపాదిత

ప్రస్తుత

ప్రతిపాదిత

తేడా (శాతం)

ఉప్పు

1,200

110

100

1,108.7

1,108.7

0.0%

సిమెంట్

551

150

140

784.6

805.6

2.7%

బొగ్గు

535

150

145

722.9

768.6

6.3%

ఇనుము

897

180

165

1,379.0

1390.5

0.8%

తృణ ధాన్యాలు,

పప్పుధాన్యాలు

1,280

130

130

1,415.1

1,556.6

10.0%

యూరియా

772

130

130

891.4

980.6

10.0%

సున్నపురాయి,

డోలమైట్, మాంగనీస్

ఖనిజాలు

575

160

145

837.0

834.3

0.3%

ఇనుప ఖనిజం

300

180

165

500.8

504.9

0.8%

తుక్కు ఇనుము,

దుక్క ఇనుము

645

160

150

902.2

930.5

3.1%

ధాతు మలినాలు

575

150

140

784.7

805.6

2.7%

వేరుశనగ నూనె

1,600

140

140

2,000.3

2,043.2

2.1%

స్పీడ్ డీజిల్ ఆయిల్

723

200

180

1,291.0

1278.4

1.0%

తారు

645

170

160

958.6

992.5

3.5%

కిరోసిన్

645

180

165

1,015.0

1,023.5

0.8%

ఎల్‌పీజీ

645

180

165

1,015.0

1,023.5

0.8%



నిర్వహణ నిష్పత్తి లక్ష్యం 88.5 %
రాబోయే ఆర్థిక సంవత్సరం(2015-16)లో నిర్వహణ నిష్పత్తిని 88.5 శాతం స్థాయికి తగ్గించుకోవాలని రైల్వేలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో ఇదే అత్యుత్తమం కానుంది. దీనిని 2014-15 ఆర్థిక సంవత్సరంలో 91.8 శాతంగా నిర్దేశించుకోగా అంతకుముందు సంవత్సరం(2013-14)లో 93.6 శాతంగా ఉండింది. నిర్వహణ నిష్పత్తిని తగ్గించుకోవడం సంస్థ లాభాలబాటలో పయనించడానికి దోహదపడుతుంది. ఉదాహరణకు నిర్వహణ నిష్పత్తి 93.6 శాతంగా ఉంటే.. భారత రైల్వేలు ఆర్జిస్తున్న ప్రతి రూపాయిలో కేవలం 6.4 పైసలు మాత్రమే మిగులుతుంది.

సెమీ బులెట్ రైళ్ల ఊసే లేదు
సాక్షి, హైదరాబాద్:
సరిగ్గా ఏడాది కిందట రైల్వే మంత్రి హోదాలో సదానంద గౌడ ఘనంగా ప్రకటించిన సెమీ బులెట్ రైళ్ల ప్రస్తావన ఈ బడ్జెట్‌లో లేదు. దక్షిణ మధ్య రైల్వేకు రెండు రైళ్లను కూడా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మార్గాలను 200 కిలోమీటర్ల గరిష్ట వేగంతోసిద్ధం చేసి హైస్పీడ్ (సెమీ బులెట్) రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కానీ ఈ బడ్జెట్‌లో వాటి ప్రస్తావన లేదు.

తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశ
రైల్వే బడ్జెట్‌లో యథావిధిగా తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. అరకొర విదిలింపులతో అవిభాజ్య రాష్ట్రం దశాబ్దాలుగా అన్యాయానికి గురికాగా ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురైంది. చివరికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాల్సిన కొత్త రైల్వే జోన్ ప్రకటన కూడా లేదు. అలాగే తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ గానీ, రైల్ నెట్‌వర్క్ విస్తరణ హామీకిగానీ ఈ రైల్వే బడ్జెట్‌లో మోక్షం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ పేర్కొంది. బడ్జెట్‌లో దాని ఊసు కూడా లేదు. మొత్తంగా పాత ప్రాజెక్టులకే అరకొర విదిలింపులు మినహా రెండు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదు. గణనీయంగా కేటాయింపులు జరిపిన వాటిలో తెలంగాణ విషయానికి వస్తే పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైను నిర్మాణానికి రూ. 140 కోట్లు, మేళ్లచెర్వు-విష్ణుపురం లైనుకు రూ. 100 కోట్లు కేటాయించారు. కొత్తగా సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను మంజూరు చేశారు. మన్మాడ్-ముద్కేడ్ మధ్య, పగిడిపల్లి-నల్లపాడు మధ్య విద్యుదీకరణ పనులు మంజూరు చేశారు.

పాత సర్వే పనులకు కేటాయించినవి (రూ.లలో)

సర్వే పని

2015-16 కేటాయింపు

నిజాంపట్నం-రేపల్లె

సున్నా

పగిడిపల్లి-శంకర్‌పల్లి

సున్నా

గిద్దలూరు-బాక్రాపేట

సున్నా

బోధన్-బీదర్

సున్నా

మంత్రాలయం రోడ్-కర్నూలు అప్‌డేటింగ్

సున్నా

గుత్తి-ధర్మవరం డబ్లింగ్ సర్వే

1,00,000

గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్ సర్వే

2,00,000

బీడీసీఆర్-విశాఖ అప్‌డేటింగ్

సున్నా

జగ్గయ్యపేట-మిర్యాలగూడ అప్‌డేటింగ్

1,000

కరీంనగర్-హసన్‌పర్తి సర్వే

1,000

పటాన్‌చెరు-ఆదిలాబాద్ అప్‌డేటింగ్

2,00,000

నంద్యాల-ఆత్మకూరు వయా మహానంది

సున్నా

హైదరాబాద్-శ్రీైశైలం

సున్నా

కడప-హిందూపూర్ వయా కదిరి

10,00,000

మచిలీపట్నం-నిజాంపట్నం వయా రేపల్లె

సున్నా

నాందేడ్-లాతూర్ రోడ్

8,00,000

వాషిం-మాహుర్-ఆదిలాబాద్

5,00,000

సిద్దిపేట-అక్కన్నపేట

5,00,000

డోర్నకల్-మిర్యాలగూడ

1,000

మహబూబ్‌నగర్-గుత్తి డబ్లింగ్

15,00,000

సికింద్రాబాద్-ముద్కేడ్-ఆదిలాబాద్

1,000

ధర్మవరం-పాకాల

10,00,000

మంచిర్యాల-ఆదిలాబాద్

5,00,000

పర్బణీ-మన్మాడ్

28,00,000

తిరుపతి-కట్పది డబ్లింగ్

10,00,000

సికింద్రాబాద్-కాజీపేట మూడో లైన్

9,68,000

పర్బణి-పర్లి డబ్లింగ్

1,00,000



కొత్త సర్వే పనుల మంజూరు(రూ.లలో)

సర్వే పని

అంచనా వ్యయం

2015-16 కేటాయింపు

పూర్ణ బైపాస్ లైన్

1,17,000

1,00,000

ఘన్‌పూర్-సూర్యాపేట

25,50,000

5,000

కొత్తగూడెం-కిరండోల్

27,00,000

6,000

దువ్వాడ-విజయవాడ

3,35,00,000

45,000

Current Affirs

భారతీయ రైల్వేలు - విశేషాలు
జార్జ్ స్టీఫెన్‌సన్:
బ్రిటన్‌కు చెందిన జార్జ్ స్టీఫెన్‌సన్(1781-1848) రైల్వే పితామహుడిగా ప్రసిద్ధి. ఎందుకంటే.. 1814లో ఎక్కువ వ్యాగన్లను లాగే సత్తా ఉన్న స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్‌ను తయారు చేసింది ఆయనే. అంతకుముందు రిచర్డ్ ట్రెవిథిక్ అనే ఆయన తొలి ట్రామ్‌వే లోకోమోటివ్‌ను రూపొందించినా.. అది రోడ్డుపై నడిచే లోకోమోటివ్. తర్వాత మరికొంత మంది స్టీమ్ లోకోమోటివ్‌లను తయారుచేసినా.. స్టీఫెన్‌సన్ శక్తిమంతమైనదాన్ని తయారుచేశారు. పైగా.. ప్రపంచంలోనే తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలును లాగింది జార్జ్ తయారుచేసిన ఇంజినే.

సెప్టెంబర్ 27, 1825.. ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌లోని స్టాక్‌టన్ ఆన్‌టీస్ నుంచి డార్లింగ్టన్ మధ్య తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలు నడిచింది ఈ రోజునే. ఈ రెండు పట్టణాల మధ్య 12.9 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మించాలని స్టాక్‌టన్ అండ్ డార్లింగ్టన్ రైల్వే యోచిస్తున్న విషయం తెలిసిన వెంటనే.. అప్పటివరకూ కిల్లింగ్‌వర్త్ కాలరీలో పనిచేస్తున్న జార్జ్ స్టీఫెన్‌సన్.. ఈ కంపెనీ అధినేత ఎడ్వర్డ్‌ను కలిశాడు. వాస్తవానికి ఈ రైల్వే లైనులో వ్యాగన్లను గుర్రాలతో లాగించాలని ఎడ్వర్డ్ భావించాడు. అయితే, వాటికి బదులుగా స్టీమ్ లోకోమోటివ్ ఇంజన్‌ను ఉపయోగిస్తే.. అంతకు 50 రెట్లు బరువును అవి లాగగలవంటూ తన ప్రణాళికను వివరించాడు. దీంతో ఎడ్వర్డ్ ఈ రైల్వే లైను మొత్తం బాధ్యతను జార్జ్‌కు అప్పగించాడు. సెప్టెంబర్ 27న 450 మంది మనుషులు, కొన్ని వందల కిలోల సరుకుతో ఈ రైలు బయల్దేరింది. గంటకు 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ సమయంలో రైలింజన్‌ను నడిపింది స్టీఫెన్‌సనే.

  • ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతి 1924లో మొదలైంది.
  • ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నె ట్‌వర్క్‌లలో భారతీయ రైల్వేది నాలుగో స్థానం. అమెరికా, రష్యా, చైనాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి.
  • 1,14,500 కిలోమీటర్ల రైలు పట్టాలు, 65 వేల కిలోమీటర్ల మార్గం, 8 వేలకు పైగా స్టేషన్లు కలిగి ఉన్న భారతీయ రైల్వేలో ప్రతిరోజూ దాదాపు 19 వేల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 12 వేల రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తుండగా, 7 వేల రైళ్లు సరుకు రవాణా చేస్తున్నాయి.
  • ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలిగిన ఉన్న సంస్థల్లో భారతీయ రైల్వే ఏడో స్థానంలో ఉంది. దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు.
  • భారత్‌లో తొలి రైలు 1851 డిసెంబర్ 22న పట్టాలెక్కింది. రూర్కీలో నిర్మాణ సామగ్రితో అది ప్రయాణించింది. ప్రయాణికుల రైలు మాత్రం 1853 ఏప్రిల్ 16న బోంబే నుంచి థానే మధ్య (34 కిలోమీటర్లు) నడిచింది. 14 బోగీల్లో 400 మంది ప్రయాణికులు, మూడు ఇంజన్లతో ముందుకెళ్లింది. ఈ 34 కిలోమీటర్ల ప్రయాణానికి 75 నిమిషాలు పట్టింది.
  • దక్షిణ భారత దేశంలో తొలి రైలు 1856 జూలై 1న వేయ్‌సరాప్ది(మద్రాస్) నుంచి వల్లజా రోడ్(ఆర్కాట్) వరకు ప్రయాణించింది.
  • 1873లో ఢిల్లీ నుంచి రేవారి మధ్య ప్రపంచంలోనే తొలి మీటర్‌గేజ్ సర్వీస్ ప్రారంభమైంది.
  • తొలి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న బోంబే వీటీ, కుర్లా మధ్య నడిచింది.
  • 1862లో మూడో తరగతిలో రెండు వరుసల(టూ టైర్) సీట్లు ప్రవేశపెట్టారు.
  • 1871-74 మధ్య ప్రయాణికుల బోగీల్లో గ్యాస్ దీపాలు అమర్చారు.
  • 1872లో ఒకటో తరగతి బోగీల్లో ఎయిర్ కూలింగ్ సౌకర్యం ప్రారంభించారు. 1936లో ఏసీ ప్రవేశపెట్టారు.
  • 1874లో రైళ్లలో నాలుగో తరగతి కోచ్‌లు ప్రవేశపెట్టారు. వీటిలో సీట్లు లేవు.
  • రైళ్లలో తొలిసారిగా 1891లో టాయిలెట్‌లు(ఒకటో తరగతిలో) ప్రవేశపెట్టారు. దిగువ తరగతుల్లో 1905లో వాటిని ఏర్పాటుచేశారు.
  • ప్రయాణికుల బోగీల్లో ఫ్యాన్లు, లైట్లు 1952 నుంచి తప్పనిసరి చేశారు.
  • 1967లో స్లీపర్ క్లాస్ బోగీలు ప్రారంభించారు.
  • 1974లో 3వ తరగతి బోగీలు తొలగించారు.
  • 1986లో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థ ఢిల్లీలో ప్రారంభమైంది.
  • చిన్న పేరున్న రైల్వేస్టేషన్: ఇబ్-ib (ఒడిశా)
  • పెద్ద పేరున్న రైల్వేస్టేషన్: శ్రీ వెంకటనరసింహరాజువారి పేట (తమిళనాడు)
  • అత్యధిక దూరం ప్రయాణించే రైలు: వివేక్ ఎక్స్‌ప్రెస్ (దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4,273 కిలోమీటర్లు).
  • అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు: నాగపూర్ నుంచి అజ్ని (మూడు కిలోమీటర్లు)
  • అత్యధిక దూరం ప్రయాణించే రెండో రైలు: (జమ్మూతావి నుంచి కన్యాకుమారి వరకు 3,715 కి.మీ)
  • ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు: కేరళ ఎక్స్‌ప్రెస్ (3,054 కి.మీ). ఇది త్రివేండ్రమ్ రాజధాని (వడోదర-కోట మధ్య 528 కిలోమీటర్లు 6.5 గంటల్లో)
  • ఎప్పుడూ ఆలస్యంగా నడిచే రైలు: త్రివేండ్రమ్ సెంట్రల్-గౌహతి ఎక్స్‌ప్రెస్. ప్రతిరోజూ ఇది 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తుంది.
  • దేశం నలుమూలల చివరి రైల్వేస్టేషన్లు: ఉత్తరాన జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా. పశ్చిమాన గుజరాత్‌లోని భుజ్ సమీపంలో నలీయా. దక్షిణాన కన్యాకుమారి. తూర్పున తిన్సుకియా లైన్‌లోని లీడో.
  • ప్రపంచంలో తొలిసారి రైలు చక్రాల కింద పడి మరణించిన వ్యక్తి విలియం హస్కిసన్, బ్రిటన్ ఎంపీ. 1830 సెప్టెంబరు 15న బ్రిటన్‌లోని లివర్‌పూల్, మాంచెస్టర్ రైల్వేలైన్‌ను ప్రారంభించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారు.
ఇప్పటికీ రైలు సౌకర్యం లేని దేశాలున్నాయా?
జపాన్, చైనాల్లో విమానాలతో పోటీ పడుతూ బుల్లెట్ రైళ్లు దూసుకెళుతున్నాయి.. భారత్ వంటి దేశాల్లో లోపలా, బయటా కిక్కిరిసిన జనాలతో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.. మరోవైపు ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాల్లో రైళ్లే లేవు. ప్రస్తుతం దాదాపు 25 దేశాల్లో అసలు రైళ్లే లేవు. మన పొరుగునే ఉన్న భూటాన్ నుంచి సైప్రస్, ఉత్తర తిమోర్, కువైట్, లిబియా, మకావూ, మాల్టా, నైగర్, ఓమన్, పపువా న్యూగినియా, ఖతార్, రువాండా, సాన్ మారినో, సోలోమన్ ఐలాండ్స్, సోమాలియా, టోంగా, ట్రినిడాడ్, యెమెన్, బహమాస్, బురుండి, బహ్రెయిన్ వంటి దేశాల్లో రైళ్లే లేవు. ఇక ప్రపంచంలోనే అతి తక్కువగా మొనాకోలో కేవలం 1.7 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం ఉంది. అలాగే లావోస్‌లో 3.5 కిలోమీటర్లు, నౌరూలో 3.9, లీచెన్‌స్టైన్‌లో 9.5, బ్రూనైలో 13, పరాగ్వేలో 38, సెయింట్ కిట్స్‌లో 58, మన పొరుగునే ఉన్న నేపాల్‌లో 59 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,000 కిలోమీటర్ల కన్నా తక్కువగా రైలు మార్గాలున్న దేశాల సంఖ్య ఏకంగా 64 కావడం కొసమెరుపు.

రైల్వే ట్రాక్‌నూ ఎత్తాల్సిందే..
అంతటా రైలొస్తే గేట్లు వేస్తారు... ఇక్కడ మాత్రం పడవలొస్తే రైలు పట్టాలనే ఎత్తేస్తారు.. వెళ్లిపోయాక మళ్లీ దించేస్తారు.. ఆశ్చర్యపోతున్నారా? మన దేశ దక్షిణ దిశన చిట్టచివర ఉన్న రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతూ సముద్రంపై ఈ రైల్వే వంతెన ఉంది. రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జికి ఎటు చూసినా సముద్రం.. మధ్యలో మన రైలు.. కిటికీలోంచి చూద్దామన్నా గుండెలు గుభేలుమనడం ఖాయం. 1902లో రూ. 70 లక్షలతో 600 మందితో ఈ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. మధ్యలో పాక్ జలసంధిపై రెండు వైపులా ఎత్తగలిగే 65.2 మీటర్ల పొడవున ‘కాంటిలివర్’ బ్రిడ్జినీ నిర్మించారు. ఎప్పుడో వందేళ్ల కింద 1914లో రైళ్లు నడవడం మొదలుపెట్టినా... ఇప్పటికీ వంతెన దృఢంగా ఉంది. 1964లో వచ్చిన భారీ తుపానును ఇది తట్టుకుని నిలవడం అప్పటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం.

పొడవైన రైళ్లు ఎక్కడ ఉన్నాయి?
మన దేశంలో గూడ్స్ రైళ్లు 1.2 కిలోమీటర్ల వరకూ, ప్రయాణికుల రైళ్లు 600 మీటర్ల వరకూ ఉంటాయి. కానీ పశ్చిమ ఆస్ట్రేలియాలో బీహెచ్‌పీ సంస్థ ఏకంగా 682 వ్యాగన్లతో 7.35 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును నడిపింది. 8 ఇంజన్లను వాడిన ఈ రైలు ఏకంగా లక్ష టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించింది. దక్షిణాఫ్రికాలో 660 వ్యాగన్లతో 7.3 కి.మీ పొడవైన రైలును నడిపారు.. ఇది 16 ఇంజన్లతో 70 వేల టన్నుల సామగ్రిని మోసుకెళ్లింది. రష్యా కూడా 439 వ్యాగన్లతో 6.5 కిలోమీటర్ల పొడవైన రైలును నడిపింది. ఇక బెల్జియంలో 70 కోచ్‌లతో 1.8 కి.మీ. పొడవున్న ప్యాసింజర్ రైలును నడిపారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో 90 కోచ్‌లతో 1.2 కి.మీ. పొడవైన రైళ్లను నడుపుతారు.
Published date : 28 Feb 2015 05:22PM

Photo Stories