Skip to main content

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికాలను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. సుమారు నాలుగేళ్ల తరువాత జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటిదాకా భారతరత్న పొందిన ప్రముఖుల సంఖ్య 48కి చేరింది. చివరగా 2015లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయకు భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
ప్రణబ్ ముఖర్జీ...
1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా మిరాటీలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. ఆయన తండ్రి కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మి. చరిత్ర, రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన ప్రణబ్ కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. టీచర్‌గా వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ‘దేశేర్ దక్’(మాతృభూమి పిలుపు) అనే పత్రికకు జర్నలిస్టుగా పనిచేశారు.

కాంగ్రెస్ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ కేంద్రంలో విదేశాంగ, రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి భిన్నమైన మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. 1987లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తదనంతర పరిణామాలతో 1989లో ఈ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2012, జూలై 25 నుంచి 2017 జూలై 25 వరకు భారత 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు.

మరోవైపు రచయితగా కూడా ప్రణబ్ పలు పుస్తకాలను రచించారు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.

నానాజీ దేశ్‌ముఖ్...
1916లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో జన్మించిన నానాజీ అసలు పేరు చండికాదాస్ అమృత్‌రావ్ దేశ్‌ముఖ్. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన బిర్లా కాలేజీ (నేటి బిట్స్)లో విద్యాభ్యాసం చేశారు. భారతీయ జన్‌సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. 1977లో లోక్‌సభ ఎంపీగా గెలిచారు. 1999లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషి చేసినా నానాజీ దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ప్రారంభించారు. మంథన్ అనే పత్రికను స్థాపించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలోనే తొలి గ్రామీణ యూనివర్సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ‘చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయ’నానాజీ ఆలోచనల ఫలితమే. 1974నాటి జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకర్తల్లో ఒకరైన ఆయన 94 ఏళ్ల వయసులో 2010 ఆయన కన్నుమూశారు.

భూపేన్ హజారికా...
ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్ హజారికా 1926 సెప్టెంబర్ 8న అస్సాంలోని సాదియాలో జన్మించారు. తల్లి నుంచి అస్సామీ సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ఆయన బ్రహ్మపుత్ర కవి, సుధాకాంతగా పేరొందారు. 1939లో సినిమాలో పాటలు పాడిన హజారికా 13 ఏళ్ల వయసులో సొంతంగా పాట రాశారు. ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషల్లోకి తర్జుమా అయ్యాయి. నేపథ్య గాయకుడు, సంగీతకారుడు, రచయిత, సినీ దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్ర వేసిన హజారికాను జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి.

1946లో బెనారస్ హిందూ వర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన హజారికా కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. ఆ తరువాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేందుకు 1949లో న్యూయార్క్ వెళ్లారు. 1953లో స్వదేశం తిరిగొచ్చిన ఆయన 1967లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998-2003 వరకు సంగీత నాటక అకాడమీకి చైర్మన్‌గా వ్యవహరించారు. 2011 నవంబర్ 5న ముంబైలో కన్నుమూశారు.
Published date : 26 Jan 2019 05:26PM

Photo Stories