Skip to main content

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. 2019
ఏడాదికి గానూ ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లను సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 14న ప్రకటించింది. ఈ పురస్కారం కింద ఇచ్చే తొమ్మిది లక్షల 18 వేల అమెరికా డాలర్ల నగదును ముగ్గురు ఆర్థికవేత్తలు సమానంగా పంచుకుంటారని తెలిపింది. ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలతో ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని సమర్థమంతంగా ఎదుర్కొంటున్నామని కొనియాడింది.

అభిజిత్ బెనర్జీ
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీలకు కోల్‌కతాలో 1961లో అభిజిత్ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చేశారు. 1988లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 2003లో ఎస్తర్ డఫ్లోతో కలిసి అబ్దుల్ లతీఫ్ జమీల్ పోవర్టీ యాక్షన్ ల్యాబ్ (జే-పాల్)ను స్థాపించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక మాసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2015 తర్వాత అభివృద్ధి ఎజెండా అనే అంశంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన హైలెవల్ ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్‌‌సలో కూడా అభిజిత్ పనిచేశారు.

ఎస్తర్ డఫ్లో
ఫ్రాన్‌‌సకు చెందిన ఎస్తర్ డఫ్లో ఎంఐటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, పర్యావరణం, పరిపాలన వంటి పలు రంగాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఎంఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన రెండో మహిళగా నిలిచారు. పురస్కారం పొందిన మరో ఆర్థికవేత్త 54 ఏళ్ల వయసున్న క్రెమర్ హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.
Published date : 15 Oct 2019 07:08PM

Photo Stories