Skip to main content

పీఎస్‌ఎల్‌వీ-సీ34 ద్వారా 20 ఉపగ్రహాల ప్రయోగం

సి.హరికృష్ణ, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్.
అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ34 ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసిలోకి ప్రయోగించింది. దీంతో ఒకే రాకెట్ ద్వారా అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించిన 3వ దేశంగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగం ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్య రంగంలో ఇస్రో తన పరిధిని మరింత విస్తరించుకుంది. ఇప్పటి వరకు 36 సార్లు పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను నిర్వహించిన ఇస్రో 35 వరుస విజయాలను నమోదు చేసింది.

ఇస్రో జూన్ 22న శ్రీహరికోట (నెల్లూరు జిల్లా)లోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ34 రాకెట్ ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. వీటిలో 3 దేశీయ ఉపగ్రహాలతో పాటు 17 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. పీఎస్‌ఎల్‌వీ-సీ34ను ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించారు. ఈ రూపంలో పీఎస్‌ఎల్‌వీ బరువు 320 టన్నుల వరకు ఉంటుంది. దీని మొదటి దశ చుట్టూ ఆరు భారీ స్ట్రాప్ అప్ ఆన్ బూస్టర్ మోటార్లు ఉంటాయి. తాజా ప్రయోగంతో కలిపి ఇస్రో ఇప్పటి వరకు 14 పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లను ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించింది. సాధారణంగా పీఎస్‌ఎల్‌వీ నాలుగంచెల నౌక. దీని మొదటి, మూడో దశల్లో ఘన ప్రొపెల్లెంట్ (రాకెట్ ఇంధనం)ను, 2వ, 4వ దశల్లో ద్రవ ప్రొపెల్లెంట్‌ను ఉపయోగిస్తారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను 3 రూపాల్లో అభివృద్ధి చేశారు.

  1. పీఎస్‌ఎల్‌వీ-జనరిక్
    • బరువు 294 టన్నులు
    • మొదటి దశ చుట్టూ 6 స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి.
  2. పీఎస్‌ఎల్‌వీ-కోర్ అలోన్
    • బరువు- 230 టన్నులు
    • మొదటి దశ చుట్టూ 6 స్ట్రాప్ ఆన్ మోటర్లు ఉండవు.
  3. పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్
    • బరువు 320 టన్నులు
    • మొదటి దశ చుట్టూ ఆరు భారీ స్ట్రాప్ అప్ ఆన్ మోటార్లు ఉంటాయి.
    • ఇస్రో పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమాన్ని 1982లో ప్రారంభించింది. 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ (పీఎస్‌ఎల్‌వీ-డీ1) ప్రయోగం విఫలమైంది. తర్వాత రెండు అభివృద్ధి ప్రయోగాల (పీఎస్‌ఎల్‌వీ-డీ2, పీఎస్‌ఎల్‌వీ-డీ3)ను విజయవంతంగా నిర్వహించింది. తాజా పీఎస్‌ఎల్‌వీ-సీ 34తో కలిపి 33 కార్యచరణ ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. మొత్తంగా ఇప్పటి వరకు 36 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను నిర్వహించగా వరుసగా 35 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ తరహా అంతర్జాతీయ ట్రాక్ రికార్డు కలిగిన కొన్ని రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి.

ప్రయోగించిన ఉపగ్రహాలు
పీఎస్‌ఎల్‌వీ-సీ34 ద్వారా ఇస్రో ప్రయోగించిన ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్-2సీ. కార్టోగ్రఫీ అనువర్తనాలను మరింత విస్తరించే లక్ష్యంతో ఇస్రో కార్టోశాట్-2సీ ఉపగ్రహాన్ని రూపొందించింది. ఇస్రో ఇప్పటికే ఈ రంగానికి చెందిన నాలుగు ఉపగ్రహాల (కార్టోశాట్ 1, 2, 2ఎ, 2బీ)ను ప్రయోగించింది. ఇవన్నీ పూర్తిస్థాయి కార్టోగ్రఫీ సేవలను అందిస్తున్నాయి. కార్టోశాట్-2సీ ప్రయోగం ద్వారా భూ పరిశీలన (ఎర్త్‌అబ్జర్వేషన్) రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సామర్థ్యం పెరిగింది. భారీ స్థాయిలో చేపట్టే భూమి ఉపరితల చిత్రీకరణను కార్టోగ్రఫీ అంటారు. రవాణా రంగం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయల అభివృద్ధి, వ్యవసాయం, విపత్తు నిర్వహణ అధ్యయనం, దేశ భద్రత, సరిహద్దు గస్తీ మొదలైన అనువర్తనాలకు కార్టోశాట్-2సీ సేవలను అందిస్తుంది. ఇప్పటివరకు ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహాల్లో కార్టోశాట్-2సీకు అధిక రిజల్యూషన్ శక్తి ఉంది. దీని రిజల్యూషన్ శక్తి 60 సెం.మీ. (0.6 మీటర్లు) ఫలితంగా స్పష్టమైన భూ పరీశీలన సాధ్యమవుతుంది. ఇస్రో దీనికి ముందు కార్టోశాట్-2బీ ద్వారా 80 సెం.మీ. (0.8మీ)ల రిజల్యూషన్‌ను సాధించింది. కార్టోశాట్-2సీ బరువు 727.5 కిలోలు.

విజయవంతంగా..
48 గంటల కౌంట్‌డౌన్ తర్వాత జూన్ 22 ఉదయం 9.25 గంటలకు సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ల్యాంచింగ్ ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ34ను ప్రయోగించారు. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 17 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ34.. కార్టోశాట్-2సీను 505 కి.మీ ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత 10 నిమిషాల్లో మిగిలిన 19 ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్ష్యలోకి ప్రయోగించింది. కార్టోశాట్-2సీలో అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ సెన్సర్లు ఉన్నాయి. దీనిలోని ప్యాన్‌క్రొమాటిక్ కెమెరా (పీసీసీ), మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు భూ పరీశీలనకు ఎంతగానో ఉపయోగపడతాయి. భూవనరుల సమాచార వ్యవస్థ, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఏర్పాటులో కూడా కార్టోశాట్-2సీ ఉపకరిస్తుంది.

19 ఉపగ్రహాలు
కార్టోశాట్-2సీతో పాటు ఇస్రో మరో 19 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ34 ద్వారా ప్రయోగించింది. వీటిలో భారత్‌కు చెందిన రెండు ఉపగ్రహాలతో పాటు 17 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. భారత్‌కు చెందిన వాటిలో సత్యభామశాట్‌ను చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం రూపొందించింది. సత్యభామశాట్ బరువు 1.5 కిలోలు. ఇది భూతాపానికి కారణమవుతున్న కార్బన్‌డైఆక్సైడ్, నీటి ఆవిరి, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ ఉద్గారాలపై సమాచారాన్ని సేకరిస్తుంది. భారత్‌కు చెందిన మరో ఉపగ్రహం స్వయంను పుణేలోని కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నిర్మించింది. దీని బరువు ఒక కిలో. దీన్ని హోం రేడియో ఆపరేటర్లుకు, హోమ్ రేడియో సమాజానికి మేసేజింగ్ సేవలను అందించే లక్ష్యంతో రూపొందించారు. ఇస్రో ప్రయోగించిన 17 విదేశీ ఉపగ్రహాలు.

విదేశీ ఉపగ్రహం

దేశం

బరువు

లక్ష్యం

లాపన్ ఎ 3

ఇండోనేసియా

120 కిలోలు

సహజవనరులు, పర్యావరణ నిర్వహణ

(Biros Berlin Infrared optical System)

జర్మనీ

130 కిలోలు

అధిక ఉష్ణోగ్రత ప్రక్రియల అధ్యయనం

ఎమ్3ఎమ్ శాట్ Maritime Monitoring Messaging micro satellite

కెనడా

85 కిలోలు

భూ సమీప కక్ష్య నుంచి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం సిగ్నళ్లను పసిగట్టడం. మారిటైం అనువర్తనాలకు ఉద్దేశించినది

Skysat gen2-1(గూగుల్‌కు చెందిన Tera Bella కంపెనీ నిర్మించింది.)

అమెరికా

110 కిలోలు

ఒక మీటరు లోపు (సబ్ మీటర్) రిజల్యూషన్‌తో చిత్రీకరణ

GHG Sat-D

కెనడా

25.5 కిలోలు

గ్రీన్‌హౌస్ ఉద్గారాల అధ్యయనం

12 Dove ఉపగ్రహాలు (ప్లానెట్ ల్యాబ్స్ నిర్మించింది)

అమెరికా

ఒక్కొదాని బరువు 4.7 కిలోలు

భూ పరిశీలన


నాసా తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలను మీనియేచర్ లేదా మినీ శాటిలైట్స్‌గా విభజించింది.

మినీశాట్

బరువు

1. పికోశాట్

< 1 కిలో

2. నానోశాట్

1-10 కిలోలు

3. మైక్రోశాట్

10-500 కిలోలు

Published date : 04 Jul 2016 01:51PM

Photo Stories