Skip to main content

తెలుగునేలపై మరో పీడకల... హుద్ హుద్‌

సి. హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
ఇటీవల జనజీవనంలో ప్రళయాన్ని సృష్టించిన తీవ్ర పెను తుపాను హుద్ హుద్... శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో అంతులేని అపార నష్టాన్ని మిగిల్చింది. సమాచార వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతో పాటు వేల ఎకరాల్లో పంటలను ముంచెత్తింది. ముఖ్యంగా హుద్ హుద్ విసిరిన పంజాకు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖ పట్టణం విషాద నగరంగా మారిపోయింది. ఇప్పట్లో కోలుకోని విధంగా పదేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. తెలుగు నేలపై తుపాన్ల అలజడి కొత్త కాక పోయినా హుద్ హుద్ రూపంలో పోటెత్తిన విపత్తు ఓ పీడకలగా మిగిలిపోతుంది. 2014 అక్టోబరు 12... ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రాంతంలో గంటకు 210 కిలోమీటర్ల వేగం తో విశాఖ వద్ద హుద్ హుద్ తీరాన్ని దాటింది. మునుపెన్న డూ విశాఖ సమీపంలో తీరం దాటిన దాఖలాలు పెద్దగా లేవు. ఈసారి బంగాళా ఖాతంలో ఏర్పడిన తుపాను ఉక్కునగరం వద్దనే తీరం దాటింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని, దాని తీవ్రతను అమెరికాకు చెందిన నాసా మూడు రోజుల ముందే తెలియజేసింది. నాసాకు చెందిన ఆక్వా అనే ఉపగ్రహం పంపిన పలు చిత్రాల ఆధారంగా తుపాను తీవ్రతను నిపుణులు అంచనా వేశారు. దాని ప్రభావం అసాధారణంగా ఉంటుందని నాసా అంచనా వేసింది. భారత్‌కు పొడవైన తీర రేఖ ఉండటంతో తుపాను ప్రభావం కూడా అధికం. 2013లో ఫైలిన్ ప్రభావాన్ని చవిచూసిన మన దేశం... ఇప్పుడు హుద్ హుద్ పెను తుపానుకు లోనైంది. మునుముందు కాలంలో మరింత అధిక తీవ్రతతో తుపాన్లు సంభవించే ప్రమాదం ఉంది.

బంగాళాఖాతంలోనే అధికం
అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలోనే అధిక తీవ్రతతో కూడిన తుపాన్లకు ఆస్కారం ఎక్కువ. సాధారణంగా 5:1 నిష్పత్తిలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు పుట్టుకొస్తాయి. నైరుతి రుతుపవనాలకు ముందు, ఆ తరువాత భారత్‌లో తుపాను సంభవించే తీవ్రత ఉంటుంది. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే... మన దేశంలో బంగాళాఖాతంలో తుపాను తీవ్రత పెరిగినట్లు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. హుద్‌హుద్ లాంటి పెను తుపాన్ల ప్రభావాన్ని తట్టుకునే స్థాయి, సంసిద్ధత లేని కారణంగా అపారనష్టాన్ని చవిచూస్తున్నాం. శీతోష్టస్థితిలో తలెత్తే విపరీత మార్పులు కూడా తుపాను తీవ్రత మరింత పెరగడానికి కారకాలే. ఆ స్థాయి సంసిద్ధత మనలాంటి దేశాలకు లేదని ఇంటర్ గవర్న్‌మెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (Inter Governmental panel on climate change) నివేదిక స్పష్టం చేసింది. తీర ప్రాంతాల్లో తగ్గుతున్న మడ అడవుల విస్తీర్ణం, తీరానికి దగ్గరగా భవన సముదాయాల వాణిజ్య కార్యకలాపాలు పెరగడం కూడా ఈ నష్టాలకు కారణాలవుతున్నాయి.

తుపాను మూలాలు
సాధారణంగా సముద్రంలో 60 మీటర్ల లోతువరకు 26 డిగ్రీల సెంటీగ్రేడ్‌ని మించిన ఉష్ణోగ్రత నమోదైనప్పుడు తీవ్రస్థాయి భాష్పీభవనం జరిగి ఒక అల్పపీడన కేంద్రకం ఏర్పడుతుంది. దీనిచుట్టూ తేమతో కూడిన గాలులు బలంగా వీస్తాయి. క్రమంగా అది వాయు గుండంగా మారినప్పుడు గాలుల చక్రభ్రమణం తీవ్రమవుతుంది. ఇది చెల్లాచెదురుగా ఉన్న వర్ష మేఘాలను ఆకర్షించి దగ్గరకు లాక్కుంటుంది. అల్ప పీడన కేంద్రకంలో పీడనం క్షణక్షణానికి పడిపోతూ తుపాను తీవ్రత అధికమవుతుంది. ఇలాంటి తుపాను తీరం దాటే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమ్మీదకు దుముకుతుంది. దీన్నే ఉప్పెన అంటారు. తుపాన్ల వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. 24 గంటల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వరకు కుంభవృష్టి కురుస్తుంది. ఏడు మీటర్ల ఎత్తును మించి భూమ్మీదకు అలలు విరుచుకుపడతాయి. వీటి ఫలితమే తీవ్రస్థాయిలో నష్టం.

గాలుల వేగం ఆధారంగా తుపాన్ల వర్గీకరణ

 

 

(గంటకు కి.మీలలో)

1.

అల్పపీడనం

31 కంటే తక్కువ

2.

వాయు గుండం

31-49

3.

తీవ్ర వాయుగుండం

49-61

4.

తుపాను

61-88

5.

పెను తుపాను

88-117

6.

తీవ్ర పెనుతుపాను

117-220

7.

సూపర్ సైక్లోన్

221 కంటే ఎక్కువ



గాలుల వేగం ఆధారంగా తుపాన్లను 5 శ్రేణులుగా విభజిస్తారు.

రకం

వేగం

నష్టస్థాయి

1

120-150

స్వల్పం

2.

150-180

మోస్తరు

3.

180-210

అధికం

4.

210-250

తీవ్రం

5.

250 మించితే

అత్యధికం



కాపాడిన ముందుచూపు
గంటకు 210 కిలోమీటర్లతో గాలులు వీస్తే నష్టం ఊహించలేనిదిగా చెప్పవచ్చు. హుద్ హుద్ తుపాను సమయంలోనూ ఇదే వేగంతో గాలులు వీచాయి. పర్యవసానం అంచనాలకు అందని నష్టం నమోదైంది. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. గత కొన్నేళ్లుగా ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో అధికార యంత్రాంగం, హెచ్చరిక వ్యవస్థలు సఫలీకృతమవుతున్నాయి. ఈ విషయంలో పాలనా యంత్రాగం చూపిన చొరవ ప్రశంసనీయం. 1999 నాటి ఒడిశా సూపర్ సైక్లోన్ తీవ్రతకు సుమారు 4000 మంది మరణించారని అధికారిక లెక్కలు చెబితే... అనధికారికంగా సుమారు 10వేల మంది మృత్యువాత పడ్డారని అంచనా. హుద్ హుద్ తుపాను ప్రభావానికి 40 మంది మరణించారు. సుమారు 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణం, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు ఒడిశాలోని గజపతి, కోరాపుట్, మల్కన్‌గిరి, రాయ్‌గఢ్ జిల్లాలు హుద్‌హుద్ కోరల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టం సుమారు 90 వేల కోట్లుంటుందని ప్రాథమిక అంచనా. ఒడిశాలో 50 వేలకు పైగా పూరిళ్లు దెబ్బతిన్నాయి. విశాఖ పట్టణంలో అక్టోబరు 11 రాత్రి నుంచే అంధకారం అలముకొంది. సమాచార, సాంకేతిక, విద్యుత్తు వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ విపత్తు నివారణ బృందాలు (నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్-ఎన్‌డీఆర్‌ఎఫ్), నావెల్ రెస్క్యూ, ఆర్మీ బృందాలు, గ జ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాలు, పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విశాఖ విమానాశ్రయం కూడా దెబ్బతింది.

ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు విసిరిన సవాళ్లు కొంత కాలం పాటు కోలుకోని విధంగా చేస్తున్నాయి. పునరుద్ధరణ ఆలస్యం కావడమే కాకుండా అధిక స్థాయిలో ఖర్చు అవుతోంది. దీంతో అభివృద్ధి ఏళ్లపాటు వెనక్కి వెళ్లిపోతోంది. ప్రస్తుతం విశాఖ నగరానిదీ అదే దుస్థితి.

మూడేళ్లకో భారీ తుపాను
ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్లు, వరదలు, కరవు తాకిడి పరిపాటిగా మారిపోయింది. గత 37 ఏళ్లలో సుమారు 60 ప్రకృతి బీభత్సాలు అతలాకుతలం చేశాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం మూడేళ్లకోసారి భారీ తుపాను సంభవిస్తోంది. ఈ రకమైన ప్రభావాలకు ప్రకృతిలో పరిణామాలు సహజమైనప్పటికీ, మానవ తప్పిదాలు అగ్నికి ఆజ్యం పోసినట్లు తోడై రెట్టింపు నష్టానికి గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతాలు, తీర ప్రాంతాల్లోని చెట్ల నరికివేత, కాంక్రీట్ జంగిల్ నిర్మాణం, దాని స్థానంలో పచ్చదనాన్ని భర్తీ చేయక పోవడం, నేలల కోరివేత, నదులు, వాగులు, కాలువల్లో పూడిక పెరిగి ఏ మాత్రం కొద్దిపాటి వర్షం కురిసినా ఉప్పొంగి పట్టణాల్లో వరదలు సంభవిస్తున్నాయి. అదే విధంగా వ్యవసాయ భూములు, గ్రామాలు మునకకు గురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 2.9 కోట్ల మంది తుపాను తాకిడికి లోనవుతున్నారు. శీతోష్ణస్థితి పలు ప్రభావాలకు గురవడంతో రుతు పవనాల మధ్య అంతరం తీవ్రమవుతోంది. వర్షాలు సకాలంలో కురవడంలేదు. మితిమీరిన ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా కరవు కాటకాలు తాండవిస్తున్నాయి. ఇలా ఏటా విపత్తుల రూపంలో విపత్కర పరిణామాలు సామాజిక, ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేస్తున్నాయి. ఈ లోటును పూడ్చడానికి పాలనా యంత్రాగంపై అదనపు భారం పడుతోంది.

మన పాత్ర
ప్రకృతి విపత్తులు చోటుచేసుకోవడంలో మానవ తప్పిదాల పాత్ర నానాటికీ పెచ్చరిల్లుతోంది. స్వార్థ పూరిత కార్యక్రమాలకు పాల్పడి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాం. అడవులను ఆక్రమించి జీవావరణ వ్యవస్థకు విఘాతం కల్పిస్తున్నాం. అడవుల స్థానంలో కాంక్రీట్ జంగిల్ నెలకొల్పుతు న్నాం. కానీ ఇంటికో మొక్కను నాటాలనే ఆలోచనను విస్మరిస్తున్నాం. వీటి పర్యవసానమే ఈ దుష్ఫలితాలు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పర్యావరణాన్ని రక్షించేందుకు సంకల్పిస్తే కొంత నష్టం శాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి. తీర ప్రాంతాల్లోని భవన నిర్మాణ ఆకృతుల్లో మార్పులు చేపట్టాలి. విపత్తు నిర్మూలన, పునరుద్ధరణ, సంసిద్ధతలో భాగస్వాములు కావాలి. తీర ప్రాంతాల జన సాంద్రతను తగ్గించే ప్రయత్నాలు చేపట్టాలి. అదే విధంగా శీతోష్ణస్థితి మార్పు ద్వారా తుపాను తీవ్రతలో ఎటువంటి ప్రభావాలు, మార్పులు రావచ్చనే అంశంపై పరిశోధనలను విస్తృతం చేయాలి.

పరిజ్ఞానానికి మరింత పదును
రాబోయే కాలంలో మరిన్ని విపత్తులు సంభవించే అవ కాశం లేకపోలేదు. ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) తుపానుతోపాటు ఇతర విపత్తులు, వాటి సంబంధిత అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు (National cyclone risk mitigation project) అనే తుపాను ప్రమాద నిర్మూలన కార్యక్రమం అమల్లో ఉంది. తీవ్ర స్థాయి విపత్తులను ఎదుర్కొనే దేశాల్లో భారత్ ఒకటి అని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీన్ని మననం చేసుకుంటూ భవిష్యత్తులో తలెత్తే విపత్కర పరిణామాలను ముందుగా గుర్తించి, నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు పటిష్టమైన విపత్తు నిర్వహణ చక్రాన్ని ఏర్పరచాలి. విపత్తుకు పూర్వ చర్యలైన సంసిద్ధత, హెచ్చరికల జారీ, విపత్తు సమయంలో చేపట్టాల్సిన చర్యలైన తక్షణ సహాయం, తరలింపు, గాలింపు (సెర్చ్), రక్షణ (రెస్క్యూ), విపత్తు అనంతర చర్యలైన నిర్మూలన పునరుద్ధరణను సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రమాద స్థాయి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు జీవిత, గృహ బీమాను ప్రోత్సహించాలి. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది. జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో విపత్తు స్పందన దళాలను ఏర్పాటు చేయాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.... సమగ్ర తుపాను నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు ముందున్న తక్షణ కర్తవ్యం.

తుపాన్లకు పేర్లు-ప్రస్థానం
తుపాన్లకు పేర్లు పెట్టే పద్ధతిని అమెరికా ప్రారంభించింది. ఆ దేశంలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో ఏర్పడే వాటిని టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అని పిలుస్తారు. అలాగే ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్ ఇండీస్ (పశ్చిమ ఇండీస్) దీవుల్లోని తుపాన్లను హరికేన్స్ అంటారు. 19వ శతాబ్దంలో సర్ ఫ్రాన్సిస్ బ్యూఫోర్ట్ అనే బ్రిటీష్ అడ్మిరల్ సముద్ర తీరాన ఏర్పడే గాలులను వాటి వేగం ఆధారంగా విభజించే విధానాన్ని ప్రారంభించాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాన్లకు స్త్రీల పేర్లను పెట్టారు. ప్రస్తుతం అమెరికాలో నేషనల్ హరికేన్ సెంటర్ స్త్రీ, పురుషుల పేర్లను మార్చిమార్చి వినియోగిస్తుంది. ఆంగ్ల అక్షరాల్లో A - W వరకు ఉపయోగిస్తారు. Q, U అక్షరాలతో పేర్లు ఇవ్వరు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టే పద్ధతి సెప్టెంబరు 2004లో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెడతారు. ఉదాహరణకు హుద్ హుద్. దీనికి ఒమన్ దేశం పేరు పెట్టింది. ఆ తర్వాత ఆంగ్లవర్ణమాల ప్రకారం దేశాల జాబితాలో పాకిస్థాన్ వస్తుంది. కాబట్టి హుద్ హుద్ తర్వాత వచ్చిన తుపానుకు నీలోఫర్ అని పేరు పెట్టింది పాకిస్థాన్. అనంతర క్రమంలో శ్రీలంక (ప్రియ), థాయ్‌లాండ్ (గోమెన్), బంగ్లాదేశ్ (చౌపాలా), భారత్(మేఘ), మాల్దీవులు(రోను), మయన్మార్(క్వాంట), ఒమన్(నాదా), పాకిస్థాన్(వార్ధా)... ఆ తర్వాత శ్రీ లంక... ఇలా వరుస క్రమం ఆధారంగా పేర్లు పెడతారు. హుద్ హుద్ అంటే ఇజ్రాయెల్ జాతీయ పక్షి. ఈ తుపానుకు పేరు పెట్టింది ఒమన్. ఎవరైనా సరే తుపాన్లకు పేర్లు పెట్టవచ్చు. భారత వాతావరణ విభాగానికి ఈ పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదిస్తే ఆ పేరు భారత తరపున జాబితాలో చే రుతుంది.
Published date : 08 Nov 2014 10:55AM

Photo Stories