Skip to main content

రాష్ట్ర విభజన - రాజ్యాంగ ప్రక్రియ

రాష్ట్ర విభజనలో అత్యంత కీలకాంశం అధికరణ (Article) 3. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన విధివిధానాలను ఆర్టికల్ 3లో స్పష్టంగా వివరించారు. విభజనకు సంబంధించి రాజ్యాంగంలో స్పష్టమైన విధివిధానాలు, ఏకరూపతతో కూడిన స్పష్టమైన సుప్రీంకోర్టు తీర్పులు మార్గదర్శకంగా ఉన్నాయి. నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ సాంకేతికంగా వివిధ దశల్లో రాజ్యాంగంలో నిర్దేశించిన పద్ధతి ప్రకారమే జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త రాష్ర్టాల ఏర్పాటు కోసం వెల్లువెత్తుతున్న ఉద్యమాల నేపథ్యంలో కొత్త రాష్ర్టాల ఏర్పాటు విధివిధానాలపై ఫోకస్..

రాష్ర్ట విభజన ప్రక్రియ
ఏదైనా ఒక రాష్ర్టాన్ని విభజించాలంటే ముందుగా రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి వర్గం ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని కేంద్ర హోం శాఖకు పంపాలి. నూతన రాష్ట్ర ఏర్పాటులో మొదట హోం మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. హోం శాఖ నూతన రాష్ట్ర ఏర్పాటు అవసరానికి సంబంధించి ఒక ప్రతిపాదనను కేంద్ర మంత్రి వర్గానికి ఒక నోట్ ను సమర్పించడం ద్వారా తెలియజేస్తుంది. కేంద్ర మంత్రి వర్గం ఆమోదంతోనే కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కేంద్ర హోం శాఖ సమర్పించిన నోట్ ను కేంద్ర మంత్రి వర్గం సూచన ప్రాయంగా ఆమోదిస్తుంది. నూతన రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో హోం, ఆర్థిక, విద్య, విద్యుత్తు, సాగునీరు, మానవ వనరులు, న్యాయవ్యవహారాలు మొదలైన శాఖలకు చెందిన మంత్రులందరూ సభ్యులుగా ఉండి అన్ని అంశాలను పరిశీలిస్తారు. ఆ తరువాత మంత్రివర్గ ఉపసంఘం తమ సూచనలు, సలహాలు, సిఫార్సులు మళ్లీ కేంద్ర హోం శాఖకు సమర్పిస్తుంది. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని కేంద్ర హోం శాఖ ఒక ముసాయిదా బిల్లును రూపొందించి మళ్లీ కేబినెట్‌కు నివేదిస్తుంది. కేంద్ర కేబినెట్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి దానిని నిర్దిష్ట కాలవ్యవధితో రాష్ట్ర శాసనసభకు నివేదిస్తారు. రాష్ట్ర శాసనసభ ఆ బిల్లుకు ఆమోదం తెలిపినా, తిరస్కరించినా నిర్దిష్ట గడువు లోపల చేయాలి. శాసనసభ నిర్దిష్ట గడువులోపల తన అభిప్రాయాన్ని తెలియజేయకపోతే, రాష్ట్రపతి ఆ బిల్లును పార్లమెంటు ఆమోదానికి పంపవచ్చు. రాష్ట్ర శాసనసభ ఆమోద, తిరస్కారాలతో నిమిత్తం లేకుండా కేంద్రం తన నిర్ణయం తాను తీసుకోవచ్చు. బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రతిపాదించవచ్చు. సభకు హాజరైన సభ్యుల్లో సాధారణ మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును ఆమోదిస్తే చాలు. ఇలా రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రపతి ఆమోదముద్రతో బిల్లు చట్టమవుతుంది. అనంతరం నూతన రాష్ట్ర ఏర్పాటును భారత అధికారిక గెజిట్ లో ప్రచురిస్తారు.

రాష్ట్ర విభజన- రాజ్యాంగ నిబంధనలు:
కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల్లో మార్పులు, పేర్లలో మార్పులకు సంబంధించి అధికారాల గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వివరిస్తుంది. ఆర్టికల్ 3 ప్రకారం చట్టం ద్వారా పార్లమెంటు దిగువ అధికారాలను కలిగి ఉంటుంది.

ఎ. ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని వేరు చేసి గానీ, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలిపిగానీ, ఒక రాష్ట్ర భూభాగానికి మరో ప్రాంతాన్ని కలిపిగానీ నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు (Form a new State by separation of territory from any State or by uniting two or more States or parts of States or by uniting any territory to a part of any State).

బి. ఏదైనా రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు(increase the area of any State)
సి. రాష్ట్రాల విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు(diminish the area of any State).
డి. ఏదైనా రాష్ట్ర సరిహద్దులను మార్చవచ్చు(alter the boundaries of any State).
ఇ. ఏదైనా రాష్ట్రం పేరును మార్చవచ్చు (alter the name of any State).

అంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ, విభజన చేయడం రాజ్యాంగబద్ధమైనదే అని స్పష్టమవుతుంది. అదేవిధంగా ఒక రాష్ట్రాన్ని విభజించి లేదా రెండు అంత కంటే ఎక్కువ రాష్ట్రాలను కలిపి లేదా మరే విధంగానై కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటు పరిధిలోనే ఉంటుందని నిర్ధారణ అవుతుంది. (The power conferred on Parliament by clause (a) includes the power to form a new State or Union territory by uniting a part of any State or Union territory to any other State or Union territory.)

రాజ్యాంగ విధివిధానాల ప్రకారం రాష్ట్రపతి సిఫార్సు మేరకు రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడతారు. సంబంధిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ప్రభావిత రాష్ట్ర శాసన సభల అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరాలి. బిల్లుపై అభిప్రాయం తెలుసుకునేందుకు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభకు సదరు బిల్లును పంపిస్తారు. ఎంత సమయంలోగా రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తెలియజేయాలో సంబంధిత బిల్లులోనే పేర్కొంటారు. అయితే రాష్ట్రపతి రాష్ట్రశాసన సభ అభిప్రాయం తెలియజేయడానికి గడువును పొడిగించవచ్చు. బిల్లులో పేర్కొన్న గడువులోగా లేదా పెంచిన సమయంలోగా శాసన సభ తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసన సభల అభిప్రాయాన్ని పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. నిర్ణీత గడువులో శాసనసభ తన అభిప్రాయాన్ని తెలుపకపోయినా ఆ బిల్లును సవరించి కానీ యథావిధంగా కానీ ఆమోదించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సంబంధిత బిల్లును పార్లమెంటులోని ఉభయసభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. (Provided that no bill for the purpose shall be introduced in either house of parliament except on the recommendation of the president and unless, where the proposal contained in the bill affects the area, boundaries or name of any of the states, the bill has been referred by the president to the legislature of that state for expressing its views thereon within such period as may be specified in the reference or within such further period as the president may allow and the period so specified or allowed has expired. Indisputably, only because one or the other view had been expressed in the state legislature, the same would not be binding upon the parliament even if its views were received in time. When, however, the views of the state legislature were not received in time, the parliament would be free to pass the act in terms of the bill or with amendment as it may deem fit and proper. A bill has to be introduced in the parliament. It is the parliament's prerogative to place the bill in either of the houses, either in the same form or with amendments.)

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం / విభజన చట్టం ద్వారా ప్రభావితమవుతున్న రాష్ట్ర శాసన సభల అభిప్రాయం తీసుకోవడం తప్పనిసరి అని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం విభజన బిల్లు సంబంధిత రాష్ట్ర శాసన సభకు తప్పనిసరిగా వస్తుంది. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సంబంధిత రాష్ట్ర శాసన సభ అభిప్రాయం వెల్లడించవచ్చు. అయితే రాష్ట్ర శాసనసభ వెల్లడించిన అభిప్రాయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన లేదా అమలు చేయాల్సిన అవసరం పార్లమెంటుకు లేదు. నిర్ణీత గడువులో సంబంధిత రాష్ట్రశాసన సభ బిల్లుపై తన అభిప్రాయం వెల్లడించనట్లయితే సదరు బిల్లును యథావిధిగా గానీ సవరించి గానీ ఆమోదించే విచక్షణాధికారం పార్లమెంటుకు ఉంది.

అభిప్రాయాల కోసం శాసనసభను సంప్రదించడమంటే ఆమోదాన్ని తీసుకోవడం కాదు. భారత రాజ్యాంగంలో ఆమోదం అనే పదం ఉపయోగించకుండా అభిప్రాయాలను తీసుకోవడం (అంటే సంబంధిత శాసన సభను సంప్రదించడం) అని మాత్రమే పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలు అనాలోచితంగా ఈ నిబంధన పొందుపర్చలేదు. కావాలనే భారత రాజ్యాంగంలో ఆమోదం అనేది కాకుండా అభిప్రాయాలను వ్యక్తం చేయడం అనే అంశాన్ని చేర్చారని రాజ్యాంగ సభలో జరిగిన చర్చను ఉదహరిస్తూ సుప్రీం కోర్టు రెండు వేరువేరు కేసుల్లో తీర్పు చెబుతూ పేర్కొంది. (From the Constituent Assembly debates, it appears that a motion to introduce the new provison was discussed, according to Prof. K.T. Shah for the purpose of consulting the Legislature of the State name or boundaries whereof is proposed to be altered or which areas were proposed to be increased or decreased. The term `Consultation' means differently in different context. While a power to introduce the Bill is kept with the Parliament, consultation with the State Legislature although is mandatory but its recommendations were not binding on the Parliament. `Consultation' in a case of this nature would not mean concurrence. It only means to ask or seek for the views of a person on any given subject. The views of the State Legislature certainly would be taken into consideration but the same would not mean that the Parliament would be bound thereby. Substantive compliance of the said provision shall serve the purpose. What is mandatory is that the President may refer the Bill to the Legislative Assembly for obtaining its views but it will bear repetition to state that the Parliament would not be bound by the views of the State Legislature and even in a case where substantive amendment is carried out, the amended Parliamentary Bill need not be referred to the State Legislature again for obtaining its fresh views.) మహారాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ అంశానికి సంబంధించిన కేసులో 1959, ఉత్తర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన కేసులో 2009లో సుప్రీం కోర్టు ఇచ్చిన వేరు వేరు తీర్పుల్లో ఇదే మౌలిక అంశాన్ని ప్రస్తావించింది.

సంబంధిత రాష్ట్ర శాసన సభకు పంపించి అభిప్రాయాలు తీసుకున్న బిల్లులో పార్లమెంటు సవరణలు చేస్తే (సదరు సవరణలు రాజ్యాంగ విరుద్ధం కానట్లయితే) ఆ సవరణలను తిరిగి సదరు శాసన సభకు పంపించాల్సిన అవసరం లేదు. లేదా రాష్ట్రపతి ఆ బిల్లును తిరిగి శాసన సభ అభిప్రాయాలను తీసుకునేందుకు పంపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ తీర్పుల సందర్భంగా ఉటంకించింది. (In Durga Das Basu's commentary on the Constitution of India (8th Edition) page 467, it is stated : "It has been ruled by the Speaker of the House of the People that the Bill having once been referred by the President to the State Legislatures concerned and thereafter duly introduced in Parliament, amendments seeking to make provisions different from those contained in the Bill as introduced and thereby affecting the area, boundaries or names of the State are in order and are not ultra vires of the constitution. These amendments are not required to be referred again to the State Legislature concerned nor is any fresh recommendation of the President necessary for their consideration." )

శాసన సభల సంప్రదింపుపై సుప్రీం కోర్టు తీర్పులు:
Case Study 1: బాబు లాల్ పరేట్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ముంబయి అండ్ అనదర్-1959 (Babulal Parate v/s The State of Bombay and Another-1959)

1959లో ముంబయి రాష్ట్రాన్ని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా, ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించే ముసాయిదా బిల్లును పార్లమెంటు అవిభక్త ముంబయి రాష్ట్ర శాసన సభకు పంపించడం జరిగింది. ఆ బిల్లుకు ముంబయి శాసన సభ ఆమోదం తెలిపింది. తర్వాత ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా మహారాష్ట్రలో భాగంగా చేస్తూ పార్లమెంటు సవరణ చేసింది. ఈ సవరణ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. ముంబయి విషయంలో కీలక సవరణకు సంబంధించి రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని మళ్లీ తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. ఈ వాదనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. సదరు బిల్లును పార్లమెంటు తిరిగి శాసనసభకు పంపించి అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 3 ప్రకారం ముసాయిదా బిల్లులో అంశాలే కాదు సవరణలు కూడా శాసనసభ అభిప్రాయానికి పంపించాల్సి ఉంటుందని, పిటిషనర్ వాదించారు. బిల్లులోని అంశాలను, సవరణలను వేరువేరుగా చూడాలనుకుంటే రాజ్యాంగంలో దాన్ని స్పష్టంగా పేర్కొని ఉండేవారని చెబుతూ ఈ పిటిషన్ ని కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇతర సందర్భాల్లో బిల్లులు, సవరణలు అని రాజ్యాంగంలో పేర్కొన్నారు కానీ ఆర్టికల్ 3 విషయంలో అలా పేర్కొనలేదు. బిల్లుకు సవరణలు చేస్తున్నారంటే అవి బిల్లులోని విషయాలకు సంబంధించినవై ఉండాలి. అలా కానప్పుడు అది వేరే బిల్లు అవుతుంది. అందువల్ల ఒక్కసారి ముసాయిదా బిల్లుపై సంబంధిత శాసనసభ అభిప్రాయాలను తీసుకున్నాక అదే బిల్లుకు సంబంధించిన సవరణలపై మరోసారి అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. సవరణలు ఏవిధంగా ఉండాలి? ఎలా ఆమోదించాలి? అన్నది పార్లమెంటు విధివిధానాలకు సంబంధించిన అంశం. ఈ విధి విధానాలను పార్లమెంటుకు బయట ప్రశ్నించలేము అని స్పష్టం చేసింది. ( Under Article 118 Parliament has power to make rules of its own procedure and conduct of business, including the moving of amendments etc. Rule 80 of the rules of procedure of the House of the People (Lok Sabha) lays down the conditions which govern the admissibility of amendments to clauses or schedules of a Bill, and one of the conditions is that an amendment shall be within the scope of the Bill and relevant to the subject matter of the clause to which it relates. Article 122 (1) of the Constitution says that the validity of any proceedings in Parliament shall not be called in question on the ground of any alleged irregularity of procedure.)

ఇలా సవరణలు చేసిన ప్రతిసారి సంబంధిత శాసనసభ అభిప్రాయాలను తీసుకోవాలంటే రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ తీవ్ర జాప్యానికి గురయ్యే అవకాశముంది. ప్రక్రియ ఎప్పటికీ పూర్తికాకపోవచ్చు. రెండు రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే సందర్భంలోనూ, నూతన రాష్ట్ర ఏర్పాటులో రెండు రాష్ట్రాలకు సంబంధాలు ఉన్నప్పుడు సమస్యలు మరింత జఠిలం అవుతాయి. రెండు రాష్ట్రాల శాసనసభలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లయితే కేంద్రం ఒక అభిప్రాయాలను పాటిస్తే మరో రాష్ట్ర శాసనసభకు సవరణల కోసం పంపించాల్సి ఉంటుంది. ఇది మొత్తానికి అంతులేని ప్రక్రియలా మారుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఇదే తీర్పులో భాగంగా భారత రాజ్యాంగానికి, అమెరికా రాజ్యాంగానికి మౌలికమైన తేడా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా లేదా రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా మార్చాలన్నా సంబంధిత శాసనసభ ఆమోదం పొందటం తప్పనిసరి. కానీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల శాసన సభల అభిప్రాయాలను తీసుకుంటారే తప్ప వాటిని ఆమోదించాల్సిన అవసరం పార్లమెంటుకు లేదని స్పష్టం చేసింది. ఈ మౌలికమైన తేడాకు సహేతుక కారణం కూడా ఉందని పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియా అంటే భారతదేశం రాష్ట్రాల సముదాయం (India that is Bharat shall be Union of States) అని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా భారతదేశాన్ని సమాఖ్యగా పేర్కొనలేదు. అంటే భారతదేశ యూనియన్ ఒడంబడిక ద్వారా ఏర్పాటు కాలేదు. అంటే భారతదేశ సమాఖ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదని స్పష్టం అవుతుంది. రాష్ట్రాల సముదాయం అని పేర్కొనడం వల్ల దేశం నుంచి రాష్ట్రాలకు విడిపోయే స్వేచ్ఛ లేదని అర్థమవుతుంది. అంతేకాదు రాష్ట్రాలపై సంపూర్ణ నిర్ణయాధికారం రాష్ట్రాలకు లేదని స్పష్టమవుతుంది. భారత రాజ్యాంగ ప్రవేశికలోని భారత ప్రజలమైన మేము (We, the people of India) అనే పదబంధం భారత ప్రజలు ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి, అధిశాసనం చేసి, తమకు తామే 1949 నవంబర్ 26 న ఇచ్చుకున్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నది. భారత ప్రజలమైన మేము అనే పద బంధం భారత ప్రభుత్వ సాధికారిత, యావత్ భారతదేశ ప్రజలందరి నుంచే వచ్చిందన్న విషయాన్ని స్పష్టపరుస్తుంది. అంటే ఇక్కడ రాష్ట్ర్రాలకు సంబంధం లేదని స్పష్టమవుతోంది.

("That being the position we see no reasons for importing into the construction of Article 3 any doctrinaire consideration of the sanctity of the rights of States or even for giving an extended meaning to the expression `State' occurring therein. None of the constituent units of the Indian Union was sovereign and independent in the sense the American colonies or the Swiss Cantons were before they formed their federal unions. The constituent Assembly of India, deriving its power from the sovereign people, was unfettered by any previous commitment in evolving a constitutional pattern suitable to the genius and requirements of the Indian people as a whole. Unlike some other federal legislature, Parliament, representing the people of India as a whole, has been vested with the exclusive power of admitting or establishing new States, increasing or diminishing the area of an existing State or altering its boundaries, the Legislature or Legislatures of the States concerned having only the right to an expression of views on the proposals. It is significant that for making such territorial adjustments it is not necessary even to invoke the provisions governing constitutional amendments.")

Case Study 2: ప్రదీప్ చౌదరీ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా - 2009 (Pradeep Chaudhary & Others. V/s. Union of India [2009] INSC 900)

ఉత్తరప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ విషయంలో హరిద్వార్ ను ఏ రాష్ట్రంలో చేర్చాలన్న వివాదం తలెత్తింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసన సభ హరిద్వార్ జిల్లాను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంచాలని సూచించింది. కానీ పార్లమెంటు ఆమోదించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో హరిద్వార్ జిల్లాను ఉత్తరాంచల్ (ఇప్పుడు ఉత్తరాఖండ్)లో చేర్చారు. ఈ సందర్భంలోనూ సదరు బిల్లుపై తిరిగి ఉత్తర ప్రదేశ్ శాసనసభ అభిప్రాయం తెలుసుకునేందుకు పంపించాలని డిమాండ్ తలెత్తింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందనీ, సంబంధిత శాసన సభ అభిప్రాయాలను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది.

రాజ్యాంగ నిర్మాతల దీర్ఘదృష్టి:
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై తుది నిర్ణయాధికారం పార్లమెంటుకే కేటాయించడం రాజ్యాంగ రూపకర్తల హేతుబద్ధత, దూరదృష్టికి నిదర్శనం. సాధారణంగా రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతం (చాలా సందర్భాల్లో) నుంచే ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం డిమాండ్లు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితుల్లో పునర్వ్యస్థీకరణ లేదా విభజనపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా రాష్ట్రాలకే కేటాయిస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలే దాదాపుగా ఉండవు. సహజంగానే ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న ప్రాంతానికి రాష్ట్ర శాసన సభలో మెజారిటీ స్థానాలు ఉండవు (అత్యధిక సందర్భాల్లో) కాబట్టి వారి ఆకాంక్షలు నెరవేరే అవకాశమే ఉండదు. పైగా ప్రత్యేక రాష్ట్రంపై భిన్న వాదనలకు, డిమాండ్లకు ఆస్కారం ఉంది. దీని వల్ల సమస్యల పరిష్కారం కాకపోగా మరింత జఠిలమయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్ర విభజన లేదా పునర్ వ్యవస్థీకరణపై చట్టబద్ధ అధికారాలను కేంద్రానికి కట్టబెట్టారు.

పునర్వ్యవస్థీకరణ – న్యాయసమీక్ష:
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం విభజనకు అవకాశం ఉన్న రాష్ట్రాలతో కూడిన అవిభాజ్య కేంద్రం (Union of states). అంటే ఒక రాష్ట్రాన్ని విడగొట్టి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం అంగీకరిస్తుందనేది స్పష్టం. కానీ ఒక రాష్ట్రం కేంద్రం నుంచి విడిపోవాలంటే కేంద్రం అంగీకరించదు. అంటే రాష్ట్రాల విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది రాజ్యాంగపరంగా వీలున్న అంశం. అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. కాబట్టి న్యాయస్థానాల్లో సవాలు చేయచేటానికి వీలుకాదు. కొత్త రాష్ట్ర ఏర్పాటులో ఉన్న రాజ్యాంగపరంగా విరుద్ధమైన అంశాలనే కోర్టుల్లో సవాలు చేయవచ్చు. కానీ కొత్త రాష్ట్ర ఏర్పాటు వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనం, రాజకీయ లబ్ది వంటి రాజకీయ వైఖరితో కూడిన అంశాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించటం కుదరదు. రాష్ట్రాల అభిప్రాయాలను పాటించడం తప్పనిసరి కాకపోయినా సంబంధిత రాష్ట్ర శాసనసభను సంప్రదించాలని రాజ్యాంగం చెప్పటానికి కారణం పార్లమెంటు చట్టం చేసే సమయంలో శాసనసభలో వ్యక్తమయిన అభిప్రాయాలను పరిశీలించి, పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పించడం. పరిగణించడం అంటే పాటించాలని కాదు. సంప్రదింపులంటే ఆమోదం కాదు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. కాబట్టి ఈ విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం శూన్యం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో చెప్పిన అంశాలపై భిన్నాభిప్రాయాలుంటే ఆ అధికరణను న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు. కానీ ఆర్టికల్ 3ని న్యాయస్థానంలో ప్రశ్నించినప్పుడు ఆ అధికరణ ప్రకారం జరిగే రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం అనిపించుకోదు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టాలలో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలేవైనా ఉంటేనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. కానీ రాష్ట్ర విభజన అంశం కేంద్ర కార్యనిర్వాహక వర్గం పరిధిలోనిది కాబట్టి కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోలేవని గుర్తించాలి.

ముగింపు: రాష్ట్ర పునర్విభజనపై రాజ్యాంగంలో స్పష్టమైన విధివిధానాలున్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు సవివరణాత్మక తీర్పులు శిరోధార్యాలు. రాష్ట్రాల విభజన రాజ్యాంగబద్ధతకు ఇవే ప్రామాణికాలు. ఇవే రాష్ట్ర్రాల విభజన / పునర్ వ్యవస్థీకరణ రాజ్యాంగబద్ధతను పరిక్షించడానికి కొలమానాలు.
 
ప్రేమ విఘ్నేశ్వర్ రావు కె.
Published date : 25 Oct 2013 05:03PM

Photo Stories