Skip to main content

హంగ్ పార్లమెంట్.. రాష్ట్రపతి పాత్ర.. అవిశ్వాస తీర్మానం

‘రాజ్యాంగం గొప్పతనం దాన్ని గౌరవించి, అమలు చేసే వారిపై ఆధారపడి ఉంటుంది గానీ, రాజ్యాంగంపై మాత్రమే కాదు. రాజ్యాంగం ఉత్కృష్టమైంది. అయినా పాలించే వారిని బట్టి దానికి విలువ ఉండదు. పాలకులు మంచివారైతే రాజ్యాంగంలో లోపాలున్నా పాలన ఉత్తమంగానే ఉంటుంది’.
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

Bavitha‘రాజ్యాంగబద్ధ ప్రభుత్వం పాలనలో ఉండటం పాలకులకు దాసోహం కాదు. స్వేచ్ఛకు, విముక్తికి ప్రతీక’
- అరిస్టాటిల్


Bavithaహంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ ఏర్పడితే రాష్ట్రపతి/గవర్నర్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి? విశ్వాస, అవిశ్వాస తీర్మానాల గురించి రాజ్యాంగం ఏం చెబుతోంది? గత అనుభవాలు.. తదితర అంశాలపై విశ్లేషణ..

ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు, రాజకీయ పార్టీలు అనివార్యం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది. పౌరులు తమ ఓటు హక్కు ద్వారా ప్రతినిధులను ఎన్నుకుంటారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలను పాలిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఏదైనా పార్టీ చట్టసభల్లో నిర్ణీత మెజారిటీ సాధించాలి. లోక్‌సభ, రాష్ట్ర విధానసభలలోని మొత్తం స్థానాల్లో సగానికంటే ఎక్కువ స్థానాలు దక్కించుకున్న పార్టీ లేదా కూటమిగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. లోక్‌సభలో మొత్తం స్థానాల సంఖ్య 545 (నామినేట్ సభ్యులతో సహా). ఇందులో 273 స్థానాలు సాధించిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రపతి కోరతాడు. ఈ పద్ధతినే గవర్నర్లు రాష్ట్రాల్లో అనుసరిస్తారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా కూటమికి సంపూర్ణ మెజారిటీ రాకపోతే దాన్ని హంగ్ పార్లమెంట్/హంగ్ అసెంబ్లీ అని వ్యవహరిస్తారు.

ప్రభుత్వ ఏర్పాటు - రాజ్యాంగ ప్రస్తావన:
రాజ్యాంగ ప్రకరణ 74 (1) ప్రకారం విధుల నిర్వహణలో రాష్ట్రపతికి సలహా, సహకారాలను అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. ప్రకరణ 75 (1) ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. అతని సలహాపై మంత్రిమండలి ఏర్పాటవుతుంది. రాష్ట్రాల విషయంలో కూడా ఇలాంటి ఏర్పాటును రాజ్యాంగ ప్రకరణ 163 (1), 164 (1)లో ప్రస్తావించారు. ఈ ప్రకరణల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని నియమించే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు, నియమాలను వివరించలేదు. పార్లమెంటరీ పాలనా వ్యవస్థ అమల్లో ఉన్న దేశాలు ముఖ్యంగా బ్రిటిష్ తరహా రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా మనదేశంలో కూడా కొన్ని సంప్రదాయాలు, రాజకీయ ఆచారాలున్నాయి. అవి..

  • ఎన్నికల ఫలితాలను బట్టి రాష్ట్రపతి లోక్‌సభలో మెజారిటీ సాధించిన రాజకీయ పార్టీ లేదా కూటమి నాయకున్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తాడు. ఉదాహరణకు 1977లో ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి మెజారిటీ సాధించిన జనతాపార్టీ కూటమి నాయకుడైన మొరార్జీదేశాయ్‌ని ప్రధానమంత్రిగా నియమించారు.
  • ఎన్నికైన పార్టీల్లో కొన్ని సంకీర్ణ కూటమిగా రూపొంది, తమ నాయకున్ని ఎన్నుకుంటే.. ఆ నాయకున్ని ప్రధానమంత్రి పదవి చేపట్టమంటూ రాష్ట్రపతి ఆహ్వానించవచ్చు. ఉదాహరణకు 1999లో బీజేపీ 12 పార్టీలతో కలిసి (ఎన్‌డీఏ) ప్రభుత్వాన్ని, 2004లో కాంగ్రెస్ పార్టీ మరో 11 పార్టీలతో కలిసి (యూపీఏ పేరుతో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
  • ఏ ఒక పార్టీ లేదా కూటమికి పూర్తి మెజారిటీ లభించని పక్షంలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరవచ్చు. ఉదాహరణకు 1989 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించడంతో అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించగా, కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దాంతో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి వి.పి.సింగ్‌ను ప్రధానమంత్రిగా నియుమించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు రాష్ట్రపతి విచక్షణాధికారంతో తన దృష్టిలో ఎవరైతే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరో ఆ రాజకీయ పార్టీ నాయకున్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించవచ్చు. అలాంటి ప్రభుత్వం రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా తన మెజారిటీని నిరూపించుకోవాలి.
గత సందర్భాలు:
1952, 1957, 1962, 1967, 1971 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ప్రధానమంత్రిని నియమించడంలో నాటి రాష్ట్రపతులకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. 1964లో నెహ్రూ మరణానంతరం ప్రధానమంత్రి నియామకంలో సమస్యలు మొదలయ్యాయి. నెహ్రూ వారసున్ని సర్వసమ్మతితో ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను ప్రతిపాదించి (కామరాజ్ నాడర్) 1964లో లాల్ బహదూర్‌శాస్త్రిని ప్రధానమంత్రిగా నియమించారు. 1971, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన ఆధిక్యత వల్ల ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.

1977లో జనతా పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ, ఆది ఐదు పార్టీల కూటమి కావడంతో.. జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలానీ కృషి ఫలితంగా మొరార్జీ దేశాయ్‌ని జనతా పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆనాటి తాత్కాలిక రాష్ట్రపతి బి.డి. జెట్టి మొరార్జీ దేశాయ్‌ని ప్రధానమంత్రిగా నియమించారు. ఆ సందర్భంలో రాష్ట్రపతి.. జనతా పార్టీ స్వరూప స్వభావాలను విచారించాక కేవలం పార్లమెంటరీ సంప్రదాయాన్ని పాటించారు.

1979లో మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొన్నారు. జనతాపార్టీ చీలికతో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో లోక్‌సభలో తమకు మెజారిటీ ఉందని, చరణ్‌సింగ్, జగ్జీవన్‌రామ్‌లు తమ మద్దతుదారుల జాబితాను రాష్ట్రపతికి సమర్పించారు. ఇక్కడ వారు ప్రస్తావించిన సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యను మించిపోయింది. అయితే రాష్ట్రపతి తన అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరించి చరణ్‌సింగ్‌ను ప్రధాని పదవిని చేపట్టమని ఆహ్వానించారు. రాష్ట్రపతిగా సంజీవ రెడ్డి అనుసరించిన ఈ పద్ధతి బ్రిటిష్ పార్లమెంటరీ సంప్రదాయాలకు పూర్తిగా భిన్నమైంది. చరణ్‌సింగ్ రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా లోక్‌సభ విశ్వాసం పొందకుండానే రాజీనామా చేశారు. అతే జగ్జీవన్‌రామ్ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నానంటూ లిఖిత పూర్వకంగా తెలిపినా అవకాశం ఇవ్వకుండా లోక్‌సభ విశ్వాసం పొందని ప్రధాని చరణ్‌సింగ్ సలహా మేరకు రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేశారు.

1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం పడిపోవడంతో కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కానీ, కొన్ని నెలల్లోనే ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది. 1996లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో వాజ్‌పేయ్‌ని ప్రధానిగా నియమించారు. కానీ లోక్‌సభ విశ్వాసం పొందలేక ఆ ప్రభుత్వం 13 రోజుల్లోనే రాజీనామా చేసింది. ఆ తర్వాత దేవేగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో పడిపోయాయి.


రాష్ట్రాల్లో కూడా:
రాష్ట్రాలలో హంగ్ అసెంబ్లీలు ఏర్పడిన సందర్భాలు తక్కువే. 1965 ఎన్నికల్లో కేరళలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ ఒక్క పార్టీ మరొక పార్టీ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించకపోవడంతో రెండేళ్లపాటు అనిశ్చితి సాగింది. చివరకు ఒక్క సమావేశం జరగకుండానే శాసనసభ రద్దయింది. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పరిస్థితే తలెత్తింది. అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ ప్రభు త్వ ఏర్పాటుకు అనాసక్తత వ్యక్తపర్చడంతో రెండో పెద్ద పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాయకుడైన అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆహ్వానించిన పరిణామాన్ని గమనించవచ్చు.

హంగ్ పార్లమెంట్- రాజ్యాంగం:
ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో రాష్ట్రపతి ఏ విధంగా వ్యవహరించాలి? అనే విషయాన్ని రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ప్రకరణ 75 (1)ని అనుసరించి రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు అని మాత్రమే ఉంది. స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు ఏ పద్ధతిని అనుసరించాలి అనేది సంశయమే? పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్వయించుకోవాలి. సర్వ విషయాలను, సర్వ సందర్భాలను ఊహించి రాజ్యాంగాన్ని రూపొందించడం సాధ్యం కాదు. అలా చేస్తే రాజ్యాంగం సరళతను కోల్పోయి సంక్లిష్ట సనాతన చట్ట స్వభావాన్ని సంతరించుకొంటుంది. అది ప్రగతికి ఆటంకమే కాకుండా సందర్భహితాన్ని కోల్పోతుంది. అందువల్ల అనుభవాల దృష్ట్యా కొన్ని అలిఖిత రాజ్యాంగ విలువలను, ఆచారాలను సృష్టించి పాటించడం పరిపాటి. దీనికి ఏ రాజ్యాంగం మినహాయింపు కాదు. అయితే మంచి సంప్రదాయాలను ఏర్పరచాల్సి ఉంటుంది.

అవిశ్వాస- విశ్వాస తీర్మానం
రాజ్యాంగ ప్రకరణ 75(3) ప్రకారం మంత్రిమండలి సంయుక్తంగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. అది లోక్‌సభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత వరకే అధికారంలో కొనసాగుతుంది. ప్రభుత్వంపై విశ్వాసం లేదని ఒక తీర్మానంతో మెజారిటీ సభ్యులు తెలిపితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని నియంత్రించడానికి, తప్పొప్పులకు బాధ్యున్ని చేయడానికి ఉన్న పార్లమెంటరీ ప్రక్రియగా దీన్ని పేర్కొనవచ్చు.

అవిశ్వాస తీర్మానం:
ఈ తీర్మానం గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. పైన పేర్కొన్నట్లు ప్రకరణ 75(3)తో పరోక్ష సంబంధం ఉంది. అయితే ప్రకరణ 118 ప్రకారం ఉభయ సభలు తమ పద్ధతులను, ప్రక్రియలను నిర్దేశించుకొనే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఆ ప్రకారం పార్లమెంట్ రూల్స్ అండ్ ప్రోసీజర్‌‌సను రూపొందించుకొంది. అందులో భాగంగా లోక్‌సభ నియమం 198 (1) ప్రకారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సభ్యులు సంతకాలు చేసి, అవిశ్వాస తీర్మాన నోటీస్‌ను స్పీకర్‌కు అందజేయాలి. ఈ నోటీస్‌కు 50మంది సభ్యుల మద్దతు ఉంటే స్పీకర్ నోటీస్‌కు అనుమతిస్తాడు. దానిపై సభలో చర్చ ఉంటుంది. ఆ తర్వాత ఓటింగ్ కూడా నిర్వహిస్తారు. మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుంది. అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక కారణం సూచించాల్సిన అవసరం లేదు.

విశ్వాస తీర్మానం:
దీన్ని ‘ట్రస్ట్ మోషన్’ అని కూడా అంటారు. విశ్వాస తీర్మానం గురించి రాజ్యాంగంలోగానీ, పార్లమెంటరీ రూల్స్‌లో గానీ లేదు. రూల్ 184 కింద సాధారణ తీర్మానం మాదిరిగానే విశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తారు. అధికారంలోని పార్టీ మెజారిటీ కోల్పోతే, తిరిగి మెజారిటీ నిరూపించుకోవాలంటూ రాష్ట్రపతి ప్రధానమంత్రిని కోరతాడు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రానప్పుడు, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ముందుకు వచ్చిన నాయకున్ని ప్రధానమంత్రిగా నియమించి, నిర్ణీత గడువులో సభ విశ్వాసాన్ని పొందాల్సిందిగా రాష్ట్రపతి కోరవచ్చు. రాజకీయ సంక్షోభంలో ఎవరు మిత్రులో, శత్రువులో, ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో తెలుసుకొని సంఘటితం కావడానికి కూడా విశ్వాస తీర్మానాన్ని వాడుకోవచ్చు.

తక్కువేమీకాదు:
ఇంతవరకూ ఏర్పడిన 15 లోక్‌సభల్లో 26 సార్లు అవిశ్వాస తీర్మానాలను, 12 సార్లు విశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. మొదటి, రెండో లోక్‌సభల్లో ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టలేదు. అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలను మూడు, నాలుగో లోక్‌సభలో ఆరు సార్లు, అతి తక్కువగా 13వ లోక్‌సభలో ఒక సారి మాత్రమేప్రవేశపెట్టారు. అతి ఎక్కువ విశ్వాస తీర్మానాలను నాలుగు సార్లు 11వ లోక్‌సభ ఎదుర్కొంది. మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై 1963లో ఆచార్య జె.బి.కృపలాని ప్రవేశపెట్టారు. అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. కానీ వీటిలో ఏ ఒక్క తీర్మానం కూడా నెగ్గలేదు. లాల్ బహదూర్ శాస్త్రి, పి.వి.నరసింహా రావు చెరో మూడు సార్లు, మొరార్జీ దేశాయ్ రెండు సార్లు, రాజీవ్ గాంధీ, వాజ్‌పేయి ఒక్కోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు.

క్రియాశీలకం:
తొమ్మిదో లోక్‌సభ (1989) నుంచి ఏ రాజకీయ పార్టీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇవ్వడంలేదు. వూరిన పరిస్థితుల నేపథ్యంలో హంగ్ పార్లమెంట్ అనివార్యం అవుతోంది. హంగ్ పార్లమెంట్, సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలోనే రాష్ట్రపతి పాత్ర క్రియాశీలకమవుతోంది. రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగ సంప్రదాయాలు, ఉత్తమ రాజకీయ సంస్కృతికి అద్దం పట్టేలా రాష్ట్రపతి, గవర్నర్లు వ్యవహరించాలి. అప్పుడే మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ద్విగుణీకృతమవుతుంది.

విశ్వాస, అవిశ్వాస తీర్మానాల మధ్య తేడా?
విశ్వాస, అవిశ్వాస తీర్మానాల ఉద్దేశం ఒక్కటే. ప్రభుత్వానికి ఉన్న మెజారిటీని తెలుసుకోవడమే. ప్రక్రియలో కొంత తేడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కేంద్రం, రాష్ట్రాలలో మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడటం, మద్దతు ఇస్తున్న పార్టీలు తర్వాత మద్దతు ఉపసంహరించడం, పార్టీలో చీలికలు రావడం, హంగ్ పార్లమెంట్‌లు ఏర్పడడంతో ఈ తీర్మానానికి సమకాలీన ప్రాముఖ్యత పెరిగింది. విశ్వాస తీర్మానానికి సభ అనుమతి అవసరం లేదు కానీ అవిశ్వాస తీర్మానానికి సభ అనుమతి ఉండాలి. ఒకవేళ రెండు తీర్మానాలు ఒకేసారి సభ ముందుకు వస్తే విశ్వాస తీర్మానానికి ప్రాధాన్యత ఇస్తారు.

Bavitha
Published date : 19 Dec 2013 02:40PM

Photo Stories